క్విడ్‌ప్రోకో దోపిడీ పక్కన పెట్టు జగన్ రెడ్డి.. స్టీల్ ప్లాంట్‌ను కాపాడు!
posted on Feb 6, 2021 @ 2:19PM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తీవ్రంగా స్పందించారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డికి ఉందని ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీని ఢీకొడతా, మోదీ మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికే జగన్‌రెడ్డీ.. నీ క్విడ్‌ప్రోకో దోపిడీ బుద్ధిని పక్కన పెట్టు’’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలుగువారి ఉద్యమఫలం, విశాఖ మణిహారం ఉక్కు కర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉందన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు చంద్రబాబు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కు. దీనిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తే మరో ఉక్కు ఉద్యమం తప్పదన్నారు చంద్రబాబు. లక్షలాది మంది ఏళ్ల తరబడి ఉద్యమించి, 32 మంది ప్రాణత్యాగంతో, అమరావతివాసి అమృతరావు ఆమరణ నిరాహార దీక్షతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ని సాధించుకున్నామని చెప్పారు. అటువంటి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని జనాన్ని ఏమార్చి, తుక్కు కింద కొనేసి లక్షల కోట్లు కొట్టేద్దామనుకుంటున్న జగన్‌రెడ్డి గ్యాంగ్ కుతంత్రాన్ని ప్రజల మద్దతుతో అడ్డుకుని తీరుతామన్నారు చంద్రబాబు
అభివృద్ధి వికేంద్రీకరణకే విశాఖలో పరిపాలనా రాజధాని అన్న జగన్మోహన్ రెడ్డీ.. నువ్వు ఇప్పటికే ఆ పేరుతో విశాఖలో కొండలు కొట్టేశావు. గుట్టలు మింగేశావు. భూములు ఆక్రమించేశావు. ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యక్షంగా 18 వేలమంది శాశ్వత ఉద్యోగులు, 22 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తుంటే, ఒక ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంటి? అని టీడీపీ అధినేత నిలదీశారు.
‘‘ నీ 31 కేసుల మాఫీ కోసం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌సభ, 6గురు రాజ్యసభ సభ్యుల్ని కేంద్రానికి తాకట్టు పెట్టేశావు. ప్రత్యేకహోదాని బాబాయ్ హత్యకేసుకి మార్టిగేజ్ చేశావు. ఇప్పుడు విశాఖ ఉక్కుపై స్పందించ వద్దంటూ నీ ఎంపీల నోరు కుట్టేశావు. గతంలో స్వర్గీయ వాజ్‌పాయి ప్రభుత్వంలో ఇదే పరిస్థితి వస్తే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును కాపాడింది.. అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. ఆ పని ఇప్పుడు మీరెందుకు చేయరు?’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.