ఎన్నికల వేళా.. జగన్ కి వాలంటీర్ల సెగ ?
posted on Feb 8, 2021 @ 2:02PM
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి పంచాయతీ ఎన్నికల వేళ వాలంటీర్ల సెగ తగిలింది. ఎన్నికల సమయమే వారి సమస్యకు పరిష్కారం అనుకున్నారేమో, తక్కువ జీతాలు ఇస్తూ.. తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారంటూ వాలంటీర్లు విశాఖలో రోడ్డెక్కారు. తక్షణమే తమ జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. గాజువాకలో వాలంటీర్లు జీవీఎంసీ జోన్ 5వ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వాలంటీర్ల పనితనం ఏంటో తెలపాలని రోజుకు ఎన్నిగంటలు పనిచేయాలో స్పష్టం చేయాలని అన్నారు. కరోనా కాలంలో కూడా కష్టపడి పనిచేసిన తమను ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రక్ డ్రైవర్లకు ఇచ్చిన జీతం కూడా తమకు ఇవ్వడంలేదన్నారు. సీఎం జగన్ వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు.
విజయవాడలో కూడా వలంటీర్లు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వేలాది మంది వలంటీర్లు రావడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. తమకు రూ.10 వేల జీతం, ఉద్యోగ భద్రత కల్పించాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఒకవైపు పంచాయితీ ఎన్నిలు, మరో వైపు నిరసన సెగలు ఇవే ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్న కధనాలు. మొన్న విజయవాడ లో రేషన్ వాహనాల డ్రైవర్స్ తమతో చాకిరీ చేపించుకుంటున్నారని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.. రేషన్ డ్రైవర్స్ ఆందోళన మరిచి పోక ముందే వలంటీర్లు నిరసన మొదలైంది. తమ ప్రభుత్వమే నియమించిన వలంటీర్లు, రేషన్ వాహనాల డ్రైవర్లు ఆందోళనలు చేస్తుండడం తో వైపిపి పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో కలవరం రేపుతోంది.