దేనికైనా రె..ఢీ అంటున్న బాలయ్య.. ఇక వైసిపికి చుక్కలే..
posted on Feb 8, 2021 @ 12:03PM
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలయ్య తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం చేస్తున్న బోయపాటి సినిమా తర్వాత తానేం చేయబోతున్నానో ఒక అభిమానితో అయన మాట్లాడిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాను దేనికైనా రెడీ అని.. అంతేకాకుండా ఇకనుండి జనంలోనే ఉంటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బాలయ్య ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని రుద్రకోటలో నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు, బాలకృష్ణ అభిమానులతో ఆయన మాట్లాడారు. అదే సమయంలో బాలకృష్ణకు కోటంరెడ్డి ఫోన్ చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలు బాలయ్య.అడిగి తెలుసుకున్నారు .
ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య... బోయపాటి సినిమా తర్వాత నేనేంటో చూపిస్తానంటూ ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ తాజాగా సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందని.. ఇటువంటి పరిపాలన మనం గతంలో ఎన్నడూ చూడలేదని బాలకృష్ణ విమర్శించారు.
యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో అరాచకాల గురించి వింటామని, అయితే వైసిపి ప్రభుత్వంలో ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నామని ఆయన ఆరోపించారు. అభిమానులతో తనది జన్మజన్మల అనుబంధమని.. ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే తాను సహించబోనని అయన స్పష్టం చేసారు. తాను మానసికంగా సిద్ధం అవుతున్నానని.. పార్టీ కేడర్ దేనికీ భయపడొద్దు, అయ్యేదేదో అవుతుందని బాలయ్య స్పష్టం చేశారు. సాక్షాత్తు శ్రీరాముడు 14 ఏళ్లు అరణ్యవాసం చేశాడని.. ఇదీ అంతేనని అయన వ్యాఖ్యానించారు. అన్నగారితో ఆంధ్రుల అనుబంధం ఎటువంటి ప్రలోభాలకు లొంగనిదన్నారు. అధికార వైసీపీ పార్టీ ఇప్పుడు చేస్తున్న వాటికి వంద రెట్లు రుచి చూపిద్దామని బాలకృష్ణ పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు.