114 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన అశ్విన్
posted on Feb 8, 2021 @ 2:29PM
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 114 ఏళ్ల నాటి రికార్డును బ్రేక్ చేశాడు. టెస్ట్ ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు ఏ భారత స్పిన్నర్ కూడా టెస్ట్ ఇన్నింగ్స్ మొదటి బంతికి వికెట్ తీయలేదు. అంతేకాదు ఇన్నింగ్స్ మొదటి బంతికి వికెట్ తీసిన మూడో స్పిన్నర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. చెన్నై చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఈ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంగ్లాండ్ రెండో సెకండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బాల్‌ని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన అశ్విన్ కొద్దిగా టర్న్ చేశాడు. దీంతో ఆ బంతిని డిఫెన్స్ చేసేందుకు ఓపెనర్ రోరీ బర్న్స్ ప్రయత్నించారు. అయితే అదనపు బౌన్స్ కావడంతో ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లోకి వెళ్లింది. అక్కడే ఉన్న అజింక్య రహానె చక్కగా క్యాచ్ అందుకున్నాడు.
క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకూ కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే స్పిన్నర్లు ఈ ఘనత సాధించారు. 1888లో ఇంగ్లాండ్ స్పిన్నర్ బాబీ పీల్ తొలుత ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత 1907లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ బెర్ట్ వోల్గర్ ఫస్ట్ బాల్‌కే వికెట్ పడగొట్టాడు. ఇషాంత్ శర్మ కూడా అరుదైన ఫీట్ ను అందుకున్నాడు. 300 వికెట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత పేస్ బౌలర్ గా చరిత్ర క్రియేట్ చేశాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది. 6 వికెట్లకు 257 పరుగులతో నాలుగో రోజు సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. మరో 80 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్భుత పోరాటంతో 85 పరుగులు చేయడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ కూడా 31 పరుగులతో రాణించాడు. దీంతో ఇంగ్లండ్ కంటే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు వెనుకబడి ఉంది.