అంతా కేటీఆర్ వల్లే జరిగిందా? ఫ్యామిలీని కేసీఆర్ కూల్ చేసినట్టేనా?
posted on Feb 7, 2021 @ 7:36PM
తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు పై కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే కేటీఆర్ కు మద్దతుగా ప్రకటనలు చేయడంతో మరింత అసక్తి రేపింది. కొందరు మంత్రులు కూడా ముఖ్యమంత్రి మార్పుపై సానుకూలంగా మాట్లాడటంతో.. కేటీఆర్ టైమ్ వచ్చిందనే అంతా భావించారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేశారు గులాబీ బాస్. తానే ముఖ్యమంత్రిగా ఉంటానని తేల్చి చెప్పారు. కేసీఆర్ ప్రకటనతో సీఎం మార్పుపై క్లారిటీ వచ్చినా.. కొన్ని అనుమానాలు మాత్రమే అలానే ఉన్నాయి. కేటీఆర్ విషయంలో కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న విషయంలో కేసీఆర్ ఏం చేశారన్నది ఇప్పుడు చర్చగా మారింది.
కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో కేసీఆర్ ఫ్యామిలీలో గొడవ జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ సతీమణి శోభ.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో పట్టుబట్టినట్లు చెబుతున్నారు. కేసీఆర్ పై ఆమె ఒత్తిడి తెచ్చారంటున్నారు. ఎమ్మెల్సీ కవిత మాత్రం కేటీఆర్ విషయంలో సానుకూలంగా స్పందించలేదని సమాచారం. ఎంపీ సంతోష్ కూడా కేటీఆర్ సపోర్ట్ చేయలేదని తెలుస్తోంది. కేటీఆర్ మాత్రం తల్లి ద్వారా తండ్రిపై సీఎం సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే.. తన వర్గం నేతల ద్వాారా ప్రకటనలు ఇప్పించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేటీఆర్ నుంచి సిగ్నల్స్ ఉండటం వల్లే కొందరు టీఆర్ఎస్ నేతలు పోటీపడి మరీ స్టేట్ మెంట్లు ఇచ్చారంటున్నారు. తన ముందే నేతలు మాట్లాడుతున్నా కేటీఆర్ వారించకపోవడానికి కూడా ఇదే కారణమంటున్నారు.
ముఖ్యమంత్రి విషయంలో జరుగుతున్న ప్రచారం, కుటుంబంలో విభేదాలతో కేసీఆర్ కొన్ని రోజులుగా అసహనంగా ఉన్నారని తెలుస్తోంది. బయట జరుగుతున్న ప్రచారంపై ఆయన నిఘా వర్గాల నుంచి వివరాలు తెప్పించుకున్నారని అంటున్నారు. అన్ని విషయాలపై క్లారిటీ రావడం వల్లే.. తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో కేటీఆర్ టీమ్ పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారని చెబుతున్నారు. తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని ఘాటుగా ప్రశ్నించారట కేసీఆర్. ఇంకోసారి మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతానని హెచ్చరించారట . ఎక్కడైనా లూస్ టాక్ చేస్తే బండకేసి కొట్టి పార్టీ నుంచి బయట పారేస్తానని చెప్పారట. సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందే చెప్పినా ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారట. తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఇంకో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేశారని చెబుతున్నారు.
పార్టీ సమావేశంలో కేసీఆర్ సీరియస్ కామెంట్లు చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే కొందరు నేతలు అత్యుత్సాహం చేస్తూ ఇలాంటి ప్రచారం చేశారనే భావనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. కేటీఆర్ సీఎం అయితే తమకు మంచి అవకాశాలు వస్తాయనే ఆశతో కొందరు ప్రకటనలు చేశారని పార్టీ ముఖ్య నేతలు కొందరు కేసీఆర్ కు చెప్పారని తెలుస్తోంది. పార్టీ సమావేశానికి ముందు తనకు అత్యంత సన్నిహితులుగా ఉండే నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. ఎంపీ కేశవరావు, అసెంబ్లీ మాజీ స్పీకర్ మదుసూదనాచారితో పాటు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితోనూ కేసీఆర్ మాట్లాడారని తెలుస్తోంది. వారంతా ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో.. కేటీఆర్ టీమే ఈ రచ్చకు కారణమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారంటున్నారు. అందుకే వాళ్లపై కేసీఆర్ ఘాటైన పదాలతో విరుచుకుపడ్డారని చెబుతున్నారు.
మరోవైపు సీఎం మార్పు అంశాన్ని విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. సీఎం పదవికి కేటీఆర్ కన్నా ఈటల బాగా సరిపోతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి నాయకులు బహిరంగంగానే సూచనలు చేశారు. బీసీ నాయకుడైతే బెటర్ అంటూ ఈటలకు మద్దతుగా చాలా మంది తెరపైకి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాదం మరి కొన్ని రోజులు కొనసాగితే మరి కొందరు నేతలు బయటికి వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ భయపడ్డారట. అదే జరిగితే పార్టీలో అంతర్గత విభేదాలు ఏర్పడి పార్టీ భవిష్యత్తు నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయని భావించారట. అందుకే ఈ ప్రచారాన్ని ఎక్కువ కాలం కొనసాగించవద్దనే ముఖ్యమంత్రి మార్పు అంశంలో జరుగుతున్న ప్రచారానికి కేసీఆర్ ముగింపు పలికారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.