ఉత్తరాఖండ్‌కు మ్యాచ్ ఫీజు విరాళంగా ఇచ్చిన రిషబ్ పంత్
posted on Feb 8, 2021 @ 10:29AM
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంచు చరియలు విరిగి పడి.. ఆ పరిణామంతో వచ్చిన జలప్రళయంతో తీవ్ర నష్టం జరిగిన సంగతి తెల్సిందే. తాజాగా అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు ఇండియన్ క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించి బాసటగా నిలిచాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా రూర్కీ పట్టణంలో జన్మించిన రిషబ్ పంత్ చమోలీ జిల్లాలోని జోషిమఠ్ వద్ద జరిగిన జలప్రళయంపై విచారం వ్యక్తం చేస్తూ పంత్ ఈ ప్రకటన చేశారు.ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అంతేకాకుండా జలప్రళయం బాధితులను ఆదుకునేందుకు అందరు ముందుకు రావాలని రిషబ్ విజ్ఞప్తి చేశారు.చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ప్రస్తుతం భారత్-ఇంగ్లాండు జట్ల మధ్య జరుగుతన్న ఓపెనింగ్ టెస్టులో రిషబ్ పంత్ 91 పరుగులు చేశారు. ఉత్తరాఖండ్ ప్రకృతి విలయం లో నష్టపోయిన వారికోసం మొట్టమొదటి విరాళం ప్రకటించి రిషబ్ పంత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు.