హ్యాండ్ కి రేవంత్ బ్యాండ్! సొంత కుంపటి ఖాయమేనా?
posted on Feb 8, 2021 @ 3:04PM
డివైడ్ అండ్ రూల్. ఆధిపత్యం కోసం బ్రిటిషర్లు వేసిన ఎత్తుగడ. ఇదే స్ట్రాటజీని ఇప్పుడు రేవంత్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అంటే అవుననే అనుమానం వస్తోంది. రాజీవ్ రైతు భరోసా దీక్షలు తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. ఊరంతా ఒకదారి.. ఉలిపిరి కట్టది ఇంకోదారి అన్నట్టు ఉంది రేవంత్ తీరు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ.. పార్టీతో సంబంధం లేకుండా తన వర్క్ తాను చేసుకుపోతున్నారు. అంతా పార్టీ పనే. అయినా.. పార్టీతో పని లేదు అన్నట్టుగా సాగుతోంది రెడ్డి గారి రాజకీయం.
నేను ఒక్కడిని ఒకవైపు..
ఖమ్మంలో జరిగిన రైతు భరోసా దీక్షకు హస్తం పార్టీ పెద్దలంతా హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తో సహా బడాబడా నేతలంతా తరలివచ్చారు. పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిందా దీక్ష. ఇంత వరకూ బాగానే ఉంది. మరి, పని చేయాల్సిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడ? ఆ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టారు. దీక్షా శిబిరంలో ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ ఒక్కరే మిస్సింగ్. ఒకవైపు ఖమ్మంలో అంత పెద్ద ఎత్తున ప్రొగ్రామ్ జరుగుతుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం తనకేమీ పట్టనట్టు.. తనకు నచ్చినట్టు.. అచ్చంపేటలో వాలిపోయారు. రైతు భరోసా దీక్షను.. రైతు పాదయాత్రగా మార్చి.. అదరగొట్టారు. సర్కారుకు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సీతక్క కూడా అచ్చంపేట సభకు హాజరయ్యారు.
కాంగ్రెస్ కు షాక్..!
రేవంత్ రెడ్డి నిర్ణయం కాంగ్రెస్ పార్టీని షాక్ కు గురి చేసింది. పార్టీకి సంబంధం లేకుండా.. అధిష్టానంతో చర్చించకుండా.. 10 జన్ పథ్ పర్మిషన్ లేకుండా.. సడెన్ గా.. సొంతంగా.. పాదయాత్ర నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు. కాంగ్రెస్ లో ఇది క్షమించరాని నేరం. అయినా.. రేవంత్ రెడ్డి అదేమీ పట్టించుకున్నట్టు లేదు. పార్టీ పెద్దలంతా విచ్చేసిన ఖమ్మం దీక్షకు అటెండ్ కాకపోవడమే ఓ సాహసం అనుకుంటే.. పాదయాత్రను ప్రకటించి.. సొంత జెండా ఎగరేయడం మరింత విస్మయం. ఇదే అంశంపై ఇప్పుడు హస్తం పార్టీ పోస్ట్ మార్టం స్టార్ట్ చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ వర్క్ స్టైల్ పై కాంగ్రెస్ నేతలంతా కస్సుమంటున్నారు. ఏళ్లుగా చేతి గుర్తులో పెత్తనం చెలాయిస్తున్న పెద్దలందరికీ.. నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి వ్యవహారశైలి అసలే మాత్రం నచ్చడం లేదట. అయితే.. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. జెండా ఎగిరిందా? లేదా? అనేదే లెక్క అన్నట్టు రేవంత్ రెడ్డి దూకుడు మీదున్నారు. రాహుల్ గాంధీ అండతో.. తనదైన స్టైల్ లో రాజకీయం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలవరానికి కారణం.
హస్తానికి హ్యాండ్ ఇస్తారా?
పీసీసీ చీఫ్. ఈ పదవిపైనే కొంత కాలంగా కాంగ్రెస్ లో అంతర్మథనం. రేసులో అనేకమంది. అంతాహేమాహేమీలే. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తనకే పార్టీ పగ్గాలు పక్కా. ఇదీ రేవంత్ రెడ్డి లెక్క. తలచిందే జరిగితే అది కాంగ్రెస్ ఎందుకవుతుంది? ఫైర్ బ్రాండ్ లీడర్ కు పార్టీ పీఠం దక్కకుండా అనేక చిక్కుముడులు. హస్తినలో పెద్ద ఎత్తున పెద్దలంతా లాబీయింగ్. ఈ గందరగోళ రాజకీయాల్లో తన సత్తా
ఏంటో.. ఎంతో.. బలంగా చాటుకునేలా.. పావులు కదుపుతున్నారు రేవంత్ రెడ్డి. ఖమ్మంను కాదని.. అచ్చంపేటలో జరిగిన రాజీవ్ రైతు భరోసా దీక్షకు హాజరవడం.. పాదయాత్రకు పిలుపివ్వడం అంతా
వ్యూహాత్మకమే అంటున్నారు. కాంగ్రెస్ లో గుంపులో గోవిందలా ఉంటే.. ఎప్పటికీ అనుకున్న పదవి సాధించలేమని.. ఇలా సెపరేట్ గా ఉంటనే.. వర్కవుట్ అవుతుందనేది రేవంత్ గేమ్ ప్లాన్ లా కనిపిస్తోంది.వస్తే కొండ. పోతే వెంటుక.. అన్నట్టు డైనమిక్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సెపరేట్ స్ట్రాటజీ బెడిసికొడితే పోయిందేముంటుంది? పదవి రాదు. అంతేగా? అదే జరిగితే.. ఇక కాంగ్రెస్ లో కొనసాగడమెందుకు? అవసరమైతే హస్తం పార్టీని వీడేందుకూ రేవంత్ రెడ్డి వెనకాడబోరని అంటున్నారు ఆయన అనుచరులు.
రేవంత్ తో వెళ్లేదెవరు? ఉండేదెవరు?
రేవంత్ రెడ్డి వ్యవహారం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. చాలా ప్రమాదకరం. అతి జాగ్రత్తగా డీల్ చేస్తేనే ఫలితముంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా.. డ్యామేజ్ జరిగిపోతుంది. సీనియర్లను, పాత
కాపులను, నల్గొండ రెడ్డిలను కాదని.. రేవంత్ ను పీసీసీ చీఫ్ చేస్తే.. మిగతా వారంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోవడం ఖాయం. రేవంత్ నాయకత్వాన్ని చాలా మంది నేతలు సహించకపోవచ్చు. వారిలో అనేక
మంది పార్టీని వీడిపోవడం తప్పకపోవచ్చు. అలా జరిగితే.. ఒక్క రేవంత్ రెడ్డి కోసం అనేక మంది లీడర్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఒకవేళ రేవంత్ ను కాదని మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే..ఈయన ఒప్పుకునేలా లేరు. పార్టీలో కొనసాగేలా కనిపించడం లేదు. ఇప్పటికే పార్టీతో సంబంధం లేకుండా సొంత ఎజెండా ఫాలో అవుతున్నారు. ఇక సీతక్క, వేం నరేందర్ రెడ్డిలాంటి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఓ స్థాయి ఉన్న లీడర్లు సైతం రేవంత్ కే జై కొడతారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి ఒక్క లీడర్ తగ్గినా.. అది పార్టీకి తీరని లోటే. కోలుకోలేని దెబ్బే. ఇలా ఎలా చూసినా.. రేవంత్ రెడ్డితో వ్యవహారం కాంగ్రెస్ కు కత్తి మీద సామే.