మంత్రిపై డాక్టర్ షాకింగ్ కామెంట్స్ !
posted on Feb 16, 2021 @ 11:52AM
అతనో సీనియర్ డాక్టర్. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరిండెంట్ గా పని చేస్తున్నారు. సడెన్ గా ఆ డాక్టరును బదిలీ చేశారు. డిప్యూటేషన్ పై మరో ప్రాంతానికి పంపించారు. తనను బదిలీ చేశారన్న విషయం తెలిసి ఆ సూపరిండెంట్ షాకయ్యారు. 16 నెలల్లో రిటైర్ కాబోతున్న తనను.. కక్ష పూరితంగానే ట్రాన్స్ ఫర్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు, ఏకంగా మంత్రినే టార్గెట్ చేశారు. తన బంధువుకు పోస్టింగ్ ఇవ్వడం కోసం తనను .. అకారణంగా బదిలీ చేయించారంటూ మంత్రిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
మహబూబా బాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ భీమ్ సాగర్ బదిలీ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. తనను బదిలీ చేయడం పట్ల డాక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్‌పై డాక్టర్ ఆరోపణలు గుప్పించారు. మంత్రి సత్యవతి రాథోడ్ తనను టార్గెట్ చేసి మానసికంగా వేధించారని..కావాలనే తనను హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించారని విరుచుకుపడ్డారు. ఇక్కడ వైద్యుడిగా పనిచేసే మంత్రి కుమారుడు నెలలో వారం రోజుల మాత్రమే డ్యూటీకి వస్తాడని తెలిపారు. నెల రోజుల జీతం ఇవ్వాలని అధికారులపై వత్తిడి తెస్తాడన్నారు. అలా ఇవ్వకపోవడంతోనే తనను టార్గెట్ చేశారని డాక్టర్ భీమ్ సాగర్ ఆరోపించారు.
ఏ తప్పు చేయకున్నా తనను అకారణంగా శిక్షించారన్నారు డాక్టర్ భీమ్ సాగర్ . సీబీఐ, సీబీసీఐడీ విచారణకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.జిల్లా హాస్పిటల్ సూపరిండెంట్ బదిలీయే రాజకీయ వివాదంగా మారగా.. ఆయన చేసిన కామెంట్లు మరింత కలకలం రేపుతున్నాయి. అంతేకాదు మంత్రిని టార్గెట్ చేసిన డాక్టర్ భీమ్ సాగర్.. టీఆర్ఎస్ పార్టీకే చెందిన మాజీ మంత్రి రెడ్యా నాయక్ , ఎంపీ మాలోతు కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనకు సహకరించారని చెప్పారు. దీంతో సూపరిండెంట్ బదిలీ వ్యవహారం టీఆర్ఎస్ లోనూ రచ్చ రాజేసే సూచనలు కనిపిస్తున్నాయి.