కేసీఆర్ ఆంధ్రా బిడ్డ.. షర్మిల తెలంగాణ బిడ్డ! టీకాంగ్రెస్ నేత సంచలనం
posted on Feb 16, 2021 @ 10:50AM
వైఎస్ షర్మిల కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. కొత్త పార్టీ కోసం షర్మిల చకచకా ఏర్పాట్లు చేసుకుంటుండగా.. ఆమెకు మద్దతు కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న నాయకులు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత మాగం రంగారెడ్డి లోటస్ పాండ్ వెళ్లి షర్మిలతో సమావేశమయ్యారు. అంతేకాదు షర్మిలతో సమావేశం తర్వాత హాట్ కామెంట్స్ చేశారు మాగం రంగారెడ్డి.
వైఎస్ షర్మిల తెలంగాణ బిడ్డ అని.. ఇదే గడ్డమీద జన్మించింది అన్నారు మాగం. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బిడ్డకాదని చెప్పారు. ఎంపీ కే.కేశవరావు తండ్రి కూడా ఆంధ్రా నుంచి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు రంగారెడ్డి. తెలంగాణలో పనిచేసేందకు వస్తున్న మహిళను అందరూ స్వాగతించాలని సూచించారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజం అని.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా కేరళకు చెందిన మహిళ అని గుర్తుచేశారు.షర్మిలపై అవాకులు చెవాకులు పేలవద్దని వార్నింగ్ ఇచ్చారు మాగం రంగారెడ్డి. గతంలో వైఎస్ తో లబ్ది పొందిన వారు కూడా ఇప్పుడు షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న మాగం రంగారెడ్డి తెలంగాణలో పార్టీకి ఏర్పాటుకు సన్నహాలు చేస్తున్న షర్మిలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఆమెతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన కూడా తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతో షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన చెబుతున్నా.. షర్మిలకు రాజకీయంగా రంగారెడ్డి అండగా ఉండబోతున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.