హిట్లర్ పద్దతులను ఫాలో అవుతున్నారు..ఇలాగైతే కష్టమే...
posted on Feb 16, 2021 @ 1:23PM
అయోధ్యలో శ్రీ రాముడి మందిరం నిర్మాణం కోసం ఒకపక్క భక్తులు స్వచ్చందంగా విరాళాలు ఇస్తుండగా .. మరోపక్క ఈ విరాళాల సేకరణ కోసం కొందరు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా కర్ణాటకలో రామాలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వని ఇళ్లకు మార్క్ పెడుతున్నారని అక్కడి యడియూరప్ప సర్కార్‍పై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా అయన ఆర్ఎస్‌ఎస్, బీజేపీలను జర్మనీలోని నాజీలతో పోల్చారు. ఈ వ్యవహారంపై తాజాగా ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై వరుస ట్వీట్లలో తీవ్రంగా మండి పడ్డారు.
కుమారస్వామి తన తాజా ట్వీట్లలో "హిట్లర్ పాలనలో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు అనుసరించిన విధానమే ఇప్పుడు కర్ణాటకలో అనుసరిస్తున్నారు. రామాలయానికి విరాళాల సేకరిస్తున్న వారు.. ఇళ్ల వద్ద వేరువేరుగా మార్కింగ్ చేస్తున్నారు. ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదని గుర్తించేందుకే ఈ మార్కింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది" అని ఒక ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. ఈ దేశంలో ఏ ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే పరిస్థితి కనిపించడం లేదని.. ఒకవేళ ప్రభుత్వ అభిప్రాయాలను మీడియా కూడా సమర్ధిస్తూ పోతే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో, సామాన్యుడి పరిస్థితి ఏమి కానుందో కూడా ఊహించడం కష్టమని" అయన వ్యాఖ్యానించారు.
బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ నేతలంతా కలిసి రామ మందిర నిర్మాణానికి విరాళం ఇవ్వని వారందరి ఇంటిని ప్రత్యేకంగా మార్క్ చేస్తున్నారని అయన అన్నారు. అసలు ఇలాంటి మార్కింగ్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని కుమారస్వామి పేర్కొన్నారు. జర్మనీలో నాజీలు ఏం చేశారో ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు అదే చేస్తోందని విమర్శించారు. జర్మనీలో నాజీ పార్టీ ఏర్పాటు చేసినప్పుడే ఆర్ఎస్ఎస్ పుట్టిందని, ప్రజలు ఎవ్వరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేని అప్రకటిత ఎమర్జెన్సీ ప్రస్తుతం దేశంలో ఉందని ఆరోపించారు.దీనిపై దేశం మొత్తం చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.