తెలంగాణ మంత్రి సమైక్య రాష్ట్ర గళం
posted on Feb 16, 2021 @ 2:52PM
తెలంగాణలో కొన్ని రోజులుగా అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన తర్వాత కొత్త కొత్త వాదనలు, ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో వినిపించిన వాదాలు కూడా మళ్లీ చర్చగా మారాయి. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తుందంటూ లోక్ సభలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటన ప్రకంపనలు స్పష్టిస్తోంది. అసద్ వ్యాఖ్యలపై వివిధ పార్టీల నేతలు తీవ్రంగానే స్పందిస్తున్నారు. హైద్రాబాద్ జోలికి వస్తే ఊరుకునేది లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
ఆ వివాదం కొనసాగుతుండగానే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మరో బాంబ్ పేల్చారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన గంగుల... వైఎస్ షర్మిల పార్టీపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న బాణం షర్మిల వస్తోందని.. తర్వాత మెల్లగా జగన్ వస్తాడని చెప్పారు. జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని గంగుల కామెంట్ చేశారు. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవని, కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని, లేకపోతే సమైక్య రాష్ట్రం అవుతుందని గంగుల హెచ్చరించారు. ఆంధ్రా నేతలు కరెంటు, నీళ్లు ఎత్తుకుపోతారని, తెలంగాణకు కేసీఆరే రక్షకుడని గంగుల హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ మంత్రి నోట మళ్లీ సమైక్య రాష్ట్రం నినాదం వినిపించడం ఇప్పుడు చర్చగా మారింది.