మరో ‘సారీ’ ప్రత్యేక హోదా!
ఈ రోజు ఫిబ్రవరి 20. ఈరోజుకు ఒక ప్రత్యేకత వుంది. 2014లో ఇదే రోజున ఆప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరించారు. ఆ మేరకు రాజ్య సభలో ప్రకటన చేశారు. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చరిత్ర. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, ప్రభుత్వం అన్నది, ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాలు మారినా గత ప్రభుత్వాలు చట్టబద్దంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం కొత్తగా వచ్చిన ప్రభుత్వాల రాజ్యాంగ విదిత కర్తవ్యం. ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టింది,అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న, ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ. కాబట్టి ప్రత్యేక హోదా హామీని అమలు చేయవలసిన రాజ్యాంగ కర్తవ్యంతో పాటుగా,రాజకీయ నైతిక బాధ్యత కూడా ప్రభుత్వంపై వుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై కూడా ప్రత్యేక బాధ్యత ఉందని విపక్షాలే కాదు ప్రజలు కూడా బావిస్తున్నారు. అదలా ఉంటే, ఈ రోజు ఏడేళ్ళ తర్వాత, యాదృచ్చికమే కావచ్చుకానీ,మళ్ళీ అదే ఫిబ్రవరి 20 తేదీన, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మరోసారి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చారు.
ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్’గా నీతిఆయోగ్ పాలక మండలి అరవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన మంత్రిని కోరారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రంలో పారిశ్రామిక,ఆర్థిక అభివృద్ధి సాధ్యమని ప్రధాన మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అప్పట్లో రాష్ట్ర విభజనకు ముందు అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతనే విభజ చట్టం (ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014) పార్లమెంట్ ఆమోదం పొందిన విషయాన్నికూడా గుర్తు చేశారు.
అయితే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఎప్పుడోనే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్ధనను పట్టించుకుంటుందని, ఎవరూ అనుకోవడం లేదు. ఎవరూ ఆశించనూ లేరు.నిజానికి,ముఖ్యమంత్రికి కూడా ప్రత్యేక హోదా రాదని తెలుసు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీనిగెలిపిస్తే, లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి 25 కి 25 సీట్లు గంప గుత్తగా కట్టపెడితే కేంద్రంపై పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.మొత్తానికి మొత్తంగాగాక పోయినా, 25కు 22 లోక్ సభ సీట్లలోను ప్రజలు వైసీపీని గెలిపించారు.
అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చే రాగానే, డామిట్ కథ అడ్డం తిరగింది అన్నట్లుగా, కేంద్రంలో బీజేపీకి సొంతంగానే పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి, ఇక హోదా హులిక్కే అని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. చేతులెత్తేశారు. అయినా కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని అప్పట్లోనే ప్రకటించారు. ఇంతకు ముందు ప్రధాన మంత్రిని కలిసిన సందర్భంలో హోదా గురించి అడిగారో లేదోగానీ, ఇప్పుడైతే ఒక అభ్యర్ధన చేశారు. అయితే ఇది అభ్యర్ధనలతో అయ్యే పని కాదు, నిజంగా ప్రభుత్వానికి, అధికార పార్టీకి హోదా సాధించాలన్న చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీలో, పార్లమెంట్లో ఇతర వేదికలనుంచి నిరంతరంగా హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ,గతంలో చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీ చేసిన విధంగా ధర్మపోరాటం చేస్తే, కొంతైన ప్రయోజనం ఉంటుందని, అలా కాకుండా అడుగుతూనే ఉంటామని అంటే ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.