వేధించిన కుర్రాళ్లకు బుద్ధి చెప్పిన ఎద్దు.. వైరల్ అవుతున్న వీడియో
posted on Feb 16, 2021 @ 10:08AM
మూగ జీవాల జోలికి వెళ్ళవద్దు.. వాటిని హింసిస్తే భగవంతుడు కూడా క్షమించడు అంటారు మన పెద్దలు. అయినా కొంతమంది ప్రబుద్ధులు తమ రాక్షస ఆనందం కోసం అమాయకమైన జంతువులను హింసిస్తూనే ఉంటారు. ఇటువంటి వారు మనకు మంచి చేసే మూగజీవాల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుంటారు. మనదేశంలో ఎన్ని జంతు పరిరక్షణ చట్టాలు ఉన్నా ఇలాంటి వారి నుండి ఈ మూగ ప్రాణులను మాత్రం కాపాడలేకపోతున్నాయి. అయితే ఇలాంటి వారిపైకి ఒక్కోసారి ఆ జంతువులే తిరగబడి తమను వేధిస్తున్న వారిని శిక్షించిన ఘటనలు కొన్ని మనం చూశాం తాజాగా ఇలాంటి ఘటన కు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను గమనిస్తే.. ఇద్దరు యువకులు చెట్టు కొమ్మల మధ్య ఓ ఎద్దు తలను ఉంచి దాన్ని తీవ్రంగా వేధించారు. దాని కొమ్మలను పట్టి లాగుతూ దాని తలకు గాయమయ్యేలా చేసి వారు రాక్షసానందం పొందారు. ఇలా ఆ యువకులు చాలాసార్లు చేశారు. అంతేకాకుండా తమ క్రూరత్వాన్ని వారు వీడీయో కూడా తీశారు. అయితే ఆ యువకుల హింస మితిమీరడంతో ఆ ఎద్దు ఆగ్రహించి.. ఒక్కసారిగా వారి మీదకు దూసుకెళ్లింది. అంతేకాకుండా ఇద్దరిని తన కొమ్ములతో గుద్ది కింద పడేసింది. అక్కడి నుండి వేగంగా పరుగెత్తి తనను తాను రక్షించుకుంది.
ఈ వీడియోను అవనీశ్ శరణ్ అనే ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "మంచితనానికి ఇవి రోజులు కావు" అంటూ అయన ఆ వీడియోకు మంచి క్యాప్షన్ కూడా ఇచ్చారు . తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనకు పాల్పడ్డ యువకులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేధించిన యువకుల తిక్కను ఆ ఎద్దు బాగా కుదిర్చిందని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. దేశంలో ఎక్కడో ఒక చోట కొంత మంది శాడిస్టులు ఇలా జంతువులను వేధించడం మామూలైపోయిందని, ఇలా చేసే వారికి తప్పకుండ శిక్ష పడాల్సిందేనని కామెంట్లు పెట్టారు.