ఫాస్టాగ్ కంపల్సరీ ఓకే ! వాలెట్ లో నిధులకు భద్రతేది?
posted on Feb 15, 2021 @ 4:06PM
సమయం ఆదా.. ఇంధనం మిగులు.. వీటితో పాటు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కోసం ఫాస్టాగ్ వ్యవస్థను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 16 నుంచి అన్ని వాహనాలకు కంపల్సరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనానికి డబుల్ ఛార్జీ వసూల్ చేస్తోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండం వల్ల గతంలో ఇంధనంతో పాటు ప్రయాణికుల సమయం వృథా అయ్యేదని.. వీటిని అధిగమించేందుకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేశామని కేంద్రం చెబుతోంది. అయితే ఫాస్టాగ్ తో ప్రయోజనాలతో పాటు ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నిధుల విషయంలో వాహనదారుల నుంచి చాలా సందేహాలు, అభ్యంతరాలు వస్తున్నాయి.
ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కలిగి ఉన్న ప్రభుత్వం అందించే ట్యాగ్. టోల్ కట్టాల్సిన అన్ని పెద్ద వాహనాలు FASTagను వాహనం మీద విండ్ షీల్డ్‌పై అతికిస్తారు. టోల్ ప్లాజాలోకి వాహనం వెళ్లగానే అక్కడ ఉండే RFID రీడర్ FASTagను స్కాన్ చేసి వివరాలు పరిశీలిస్తుంది. ఈ ట్యాగ్‌పై వాహనదారులు అందించిన ఖాతా నుంచి టోల్ ట్యాక్స్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. SMS ద్వారా మీకు సమాచారం లభిస్తుంది. ప్రస్తుతం గుర్తింపు ఉన్న బ్యాంకులు, పేటీఎం వంటి డిజిటల్ వాలెట్లు ఫాస్టాగ్‌ను అందిస్తున్నాయి. వాహనం వివరాలను నమోదు చేసి సంబంధిత కేవైసీ పత్రాలతో ఫాస్టాగ్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో పత్రాల వెరిఫికేషన్ పూర్తయి ఫాస్టాగ్ వస్తుంది. దాన్ని వాహనంపై నిర్దిష్టమైన భాగంలో అతికించాలి. ఇక ఫాస్టాగ్‌కు కనెక్ట్ అయి ఉండే డిజిటల్ వాలెట్‌లో నగదును లోడ్ చేయాలి. దీంతో టోల్ ప్లాజాల గుండా వెళ్లినప్పుడు నగదు ఆటోమేటిగ్గా కట్ అవుతుంది. దీనిలో వినియోగదారులు కనీసం 100 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలి. మీరు KYC చేసిన ఫాస్టాగ్ ఖాతాలో 100,000 రూపాయల వరకు ఉంచవచ్చు.
ఇప్పుడు దీనిపైనే వినియోగదారుల నుంచి సందేహాలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 3 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేశామని కేంద్రం చెబుతోంది. వాహనదారులు కూడా తమ ఫాస్టాగ్ అకౌంట్ లో ఒకేసారి ఎక్కువ మొత్తంలో లోడ్ చేస్తున్నారు. కోట్లాది మంది వాహనదారులు రీచార్జ్ చేస్తున్న వేల కోట్ల రూపాయల డబ్బు.. ఎవరి ఖాతాలో ఉంటుంది.. వాటికి భద్రత ఏంటన్న చర్చ వస్తోంది. వాహనదారులు ఫాస్టాగ్ లో లోడ్ చేసిన అమౌంట్ కు జవాబుదారి ఎవరూ... అది మిసి యూజ్ అయ్యే అవకాశం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు కొన్ని సార్లు ఫాస్టాగ్ ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్ అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రిటర్ జర్నీ డబ్బులు కూడా ముందే కట్ తీసేసుకుంటున్నారని చెబుతున్నారు. కట్టాల్సిన టోల్ కంటే డబుల్ చార్జీ కొన్ని సార్లు పేమెంట్ అవుతుందని కూడా తెలుస్తోంది. ఈ సమస్యలపై అడగడానికి సరైన ఫ్లాట్ ఫామ్ లేదనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వస్తున్నాయి.
రెగ్యులర్ గా వినియోగించేవారితో సమస్య లేకున్నా... అప్పుడప్పుడు వాహనాల్లో తిరిగేవారి విషయంలోనే కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఫోర్ వీలర్ ఉన్నవారందరికి కంపల్సరి కావడంతో అంతా ఫాస్టాగ్ తీసుకుంటున్నారు. అయితే ఎక్కువగా బయటికి వెళ్లని వారు ఫాస్టాగ్ లో జమ చేసిన నిల్వ చాలా కాలంపాటు అలాగే ఉండిపోతోంది. ఇలాంటి ఖాతాలు లక్షల్లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంటే వందల కోట్ల రూపాయలు అలా ఉంటాయన్న మాట. ఆ డబ్బులకు ఇంట్రెస్ట్ కూడా రాదు. అదే బ్యాంకుల్లో మనం జమ చేసిన డబ్బుకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాలెట్లలో మనం జమ చేసిన డబ్బును.. దేనికైనా వాడుకోవచ్చు. కాని ఫాస్టాగ్ కోసం రీచార్జ్ చేసిన డబ్బును... కేవలం టోల్ ప్లాజా దగ్గర మాత్రమే వినియోగించుకోవాలి. మనం టోల్ ప్లాజా ద్వారా వెళ్లనప్పుడు ఆ డబ్బంతా ఖాతాలో వృధాగనే ఉండిపోతుంది.
దేశంలో ఇప్పటికే చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కొట్టేసింది. డీజీల్ కూడా అదే దారిలో ఉంది. ఎల్పీజీ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఫాస్టాగ్ అదనపు భారంగా మారిందనే అభిప్రాయం వాహనదారుల నుంచి వస్తోంది. అయితే ఫాస్టాగ్ తో మనం ఎంత రీచార్జ్ చేసుకున్నా సమస్య ఉండదని, మనం వాడుకుంటేనే అది ఖర్చు అవుతుందని, మిగిలినదంతా వాలెట్ లో భద్రంగానే ఉంటుందని ఫాస్టార్ సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాలెట్ల మాదిరిగానే ఇది పని చేస్తుందని, దీనిపై ఎవరికి సందేహాలు ఉండాల్సిన పని లేదని స్పష్టం చేస్తున్నారు.