నిమిషానికి 40 కేసులు! దేశంలో కరోనా విలయం
posted on Apr 7, 2021 @ 10:47AM
దేశంలో కరోనా పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ ఉధృతి మరింత తీవ్రమైంది. మంగళవారం దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏకంగా లక్షా 15 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. మంగళవారం ఒక్కరోజే కరోనా సోకి 630 మంది చనిపోయారు. దేశంలో కరోనా వ్యాప్తి ఊహించిన దాని కంటే తీవ్రంగా ఉందని వైద్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. గడచిన కొద్ది రోజులుగా వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. రాష్ట్రంలో మంగళవారం కొత్త 55 వేలకు మించిన కరోనా కేసులు వెలుగు చూశాయి. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 297 మంది మృతి చెందారు. దీని ప్రకారం చూస్తే మహారాష్ట్రలో నిమిషానికి దాదాపు 40 మంది కరోనా భారీన పడుతున్నారు. ప్రతీ ఐదు నిముషాలకు కరోనాతో ఒకరు మృతి చెందుతున్నారని తెలుస్తోంది.
గత ఏడాది కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ కేసులు 50 వేలకు దాట లేదు. మరణాలు కూడా ఈ స్థాయిలో నమోదు కాలేదు. గత 24 గంటల్లో ముంబై నగరంలోనే 10 వేలకు పైగా కేసులు వచ్చాయి. గతంలో ఒక్క రోజులో ఇన్ని కేసులు ఎప్పుడూ నమోదు కాలేదు. పుణెలో పరిస్థితి మరి దారుణంగా తయారైంది. హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. రోగులను వెయిటింగ్ ప్రాంతంలోనే ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పింప్రి, నాగపూర్ లోనూ రోగులతో హాస్పిటల్స్ నిండిపోయాయి. ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదని తెలుస్తోంది.
మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడంతోపాటు రాత్రిపూట లాక్‌డౌన్ విధించింది. ప్రభుత్వం ఇటువంటి ప్రకటన చేయగానే వలస కూలీలు ఆందోళనకు గురవుతున్నారు. భివండీలోని పవర్‌లూమ్‌లో పనిచేస్తున్న వలస కూలీలు గత ఏడాదిలో ఎదురైన లాక్‌డౌన్ ఇక్కట్లు మరోమారు రాకూడదని కోరుకుంటున్నారు. అందుకే గ్రామాలకు తిరిగి వెళ్లాపోయే ప్రయత్నాల్లో ఉన్నారు
జార్ఖండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రాత్రి 8గంటల తర్వాత అన్ని షాపులు, రెస్టారెంట్లు, క్లబ్‌లు తెరచి ఉంచరాదని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ స్థలాల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడ రాదని, అన్ని పాఠశాలలను మూసివేయాలని సీఎం ఆదేశించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ ను మూసివేశారు. అన్ని పార్కులు, క్రీడా పోటీలను నిషేధించారు. ఎగ్జిబిషన్లు, మేళాలను నిషేధించారు.