ఎమ్మెల్యేల అనుచరులకు కరోనా! సాగర్ టీఆర్ఎస్ లో టెన్షన్
posted on Apr 7, 2021 @ 12:17PM
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. తమ బలగాన్ని మెత్తం సాగర్ లోనే మోహరించాయి పార్టీలు. అన్ని జిల్లాల నుండి పార్టీ నేతలను తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అయితే మండలానికో ఎమ్మెల్యే, పలువురు మంత్రులను రంగంలోకి దింపింది. ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేల వెంట.. వాళ్ల నియోజకవర్గానికి చెందిన నేతలు భారీగా సాగర్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి సాగర్ లో ప్రచారం చేస్తున్న వారిలో కొందరికి కరోనా సోకిందనే ప్రచారం.. స్థానిక నేతలను, జనాలను కలవరపెడుతోంది.
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉంది. ప్రతిరోజు వందల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరగణం అంతా నిజామాబాద్ నుండి వచ్చి సాగర్ లో మకాం వేసింది. మాస్కులు, భౌతిక దూరం లేకుండానే వాళ్లంతా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే జీవన్ రెడ్డి టీంలో దాదాపు 10 మందికి కరోనా వైరస్ సోకినట్లు ప్రచారం జరుగుతుంది. జీవన్ రెడ్డితో పాటు మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపులో ఎడుగురికి వైరస్ సోకినట్లు ప్రచారం జరుగుతుంది. పైగా వీరికి లక్షణాలు కనపడితేనే టెస్టులు చేశారు. పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల టీంను కలిసిన వారు, వాళ్లతో కలిసి ప్రచారం చేసిన వారిలో టెన్షన్ నెలకొంది.
బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల అనుచరులకు కరోనా సోకిందన్న ప్రచారంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా భయపెడుతున్నా ఇలా వందలాది మంది వచ్చి ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ కేసుల్లో అత్యధికంగా లక్షణాలు లేని కేసులు నమోదవుతున్నాయి. దీంతో మిగిలిన వారికి కూడా వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 14న సాగర్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీంతో సాగర్ లో వైరస్ విజృంభణ భారీగా పెరిగే అవకాశం స్పష్టంగా కనపడుతుంది.