వివేకా హత్య వెనుక బంధువులే..?
posted on Apr 6, 2021 @ 4:48PM
రెండేళ్ల క్రితం తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు మాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్. హత్యపై సీబీఐ విచారణ జరుగుతున్నా కేసు ఇంకా కొలిక్కి రావడం లేదు. వివేకా హత్యపై రాజకీయ నేతల మధ్య మాటల యుద్దం సాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి.. తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగడం లేదని ఆరోపించడం కలకలం రేపుతోంది.
వైఎస్ వివేకానందారెడ్డిని గొడ్డలి పోటు పొడించింది ఎవరు? అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. వివేకానందారెడ్డికి కట్లు కట్టింది ఎవరు.. ఆ వైద్యులు ఎవరో తేలాలని వైసీపీ సర్కారును నిలదీశారు. హత్య సమాచారం రాగానే అక్కడి సీఐతో ఎంపీ ఏం మాట్లాడారు? అని ప్రశ్నించారు. సీబీఐ అధికారులతో ఓ ఎంపీ వీడియో కార్ఫరెన్స్‌లో ఏం మాట్లాడారు? అని నిలదీశారు. వివేకా హత్య వెనుక బంధువులే ఉన్నారని తెలుస్తోందని చెప్పారు. పార్లమెంట్‌లో కూడా వివేకా హత్య విషయం ప్రస్తావిస్తానని రఘురామ స్పష్టం చేశారు. తనపై కేసులు పెట్టాలని సీఎం జగన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రవీణ్ ప్రకాష్ కలిసి.. తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్‌పై ఒత్తిడి తెస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసులో కొన్ని రోజులుగా వస్తున్న కథనాలపై స్పందించారు వైఎస్ విజయమ్మ. ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. తన లేఖలో సంచలన విషయాలు చెప్పారు విజయమ్మ. వివేకా హత్య ఎవరు చేశారో నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఇది నా మాట, జగన్ మాట, షర్మిల మాట అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తమ కుటుంబానికి మరో అభిప్రాయం లేదని పేర్కొన్నారు. జగన్ తన కేసు అయినా, తన బాబాయ్ కేసు అయినా సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఏం చేయగలడని విజయమ్మ ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన కుమార్తె సునీతకు తమ అందరి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.