హాస్పిటల్స్ ఫుల్.. ఆక్సిజన్ నిల్! కరోనా కల్లోలం
posted on Apr 6, 2021 @ 8:37PM
దేశం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ముంబయి, పుణె, నాగ్‌పూర్‌లలో మహమ్మారి విజృంభిస్తున్న తీరు బెంబేలెత్తిస్తోంది. పుణెలో పలు ప్రాంతాల్లో ఆస్పత్రులు పూర్తిగా నిండిపోయాయి. కొత్తగా వచ్చి చేరుతున్న వారికోసం తాత్కాలిక గదులు ఏర్పాట్లు చేసి చికిత్స అందించాల్సిన అవసరం ఏర్పడుతోంది. పింప్రిలోని ఆసుపత్రిలో వెయిటింగ్ ఏరియాలోనూ బాధితులకు ఆక్సిజన్ అందిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.
పింప్రిలోని యశ్వంత్‌రావ్ చవాన్ మెమోరియల్ ఆసుపత్రి సామర్థ్యం 400 పడకలు. వీటిలో 55 ఐసీయూ పడకలు. ప్రస్తుతం కొవిడ్ బాధితులతో బెడులన్ని నిండిపోయాయి. అయినా తాకిడి మాత్రం తగ్గడం లేదు. బాధితుల పరిస్థితి అర్థం చేసుకొన్న వైద్యులు తాత్కాలిక ఏర్పాట్లు చేసి చికిత్స అందజేస్తున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారికి వెయిటింగ్ ఏరియాలోనే ఆక్సిజన్ అందిస్తున్నారు.పుణె వ్యాప్తంగా కేవలం 79 మాత్రమే వెంటిలేటర్ సదుపాయం ఉన్న పడకలు ఉన్నాయి. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. సోమవారం పుణెలో 8,075 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఇప్పటి వరకు రికార్డయిన కేసుల సంఖ్య 5.8 లక్షలకు చేరింది. ఒక్క పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలోనే 2,152 కేసులు వెలుగులోకి వచ్చాయి.