అమ్మకానికి విశాఖ భూములు.. జగన్ సర్కార్ సేల్ స్కీమ్
posted on Apr 7, 2021 8:47AM
విశాఖపట్నంలోని ఖరీదైన భూములను అమ్మకానికి పెట్టింది జగన్ సర్కార్. ఉద్యోగులకు జీతాలివ్వడానికి నానా తంటాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం...పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలోని అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ భూములను విక్రయించేందుకు కేంద్రప్రభుత్వ ఆధ్వరంలోని నవరత్న సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్స్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ) ప్రకటన చేసింది. ఇందులో బీచ్ రోడ్డులో ఏపీఐఐసీకి చెందిన 13.59 ఎకరాల భూమి సహా మొత్తం 18 ఆస్తులు ఉన్నాయి. బీచ్ రోడ్డు మార్గంలోని భూమి ధరను రూ. 1,452 కోట్లుగా ఎన్‌బీసీసీ నిర్ణయించింది.
స్థలాల వివరాలు, వాటి ఫొటోలు, లే అవుట్ కాపీలు, ప్లాట్ నంబర్లు, మ్యాప్‌లు, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అవి ఎంత దూరంలో ఉన్నాయి? వంటి పలు వివరాలను ఎన్‌బీసీసీ ఇంటర్నెట్‌లో పెట్టింది. ‘మిషన్ బిల్డ్ ఏపీ’లో భాగంగా కొన్ని స్థలాలను ఏపీ ప్రభుత్వం విక్రయించాలని నిర్ణయించిందని, ఆయా స్థలాలకు ప్రభుత్వం తరపున తాము ఈ-వేలం నిర్వహిస్తున్నామని పేర్కొంది. దరఖాస్తు ఫారాన్ని కూడా ఇంటర్నెట్‌లో పెట్టింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ప్రీబిడ్ ముందస్తు మొత్తం (ఈఎండీ) సమర్పించాలని సూచించింది.
ఇంతకు ముందు కూడా ‘బిల్డ్ ఏపీ మిషన్’ పేరుతో విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్న స్థలాలను, పరిశ్రమలకు ఉద్దేశించిన భూములను వేలం వేస్తామని ప్రకటించింది. ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కి (ఎన్‌బీసీసీ) అప్పగించింది. ఏడాది పూర్తయినా ఆ ప్రక్రియ ముందుకు కదల్లేదు. తాజాగా మరో నాలుగు స్థలాలను అమ్ముతామంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘ఎన్‌బీసీసీ’ ప్రకటన వచ్చింది. అందులో ముఖ్యమైనది బీచ్ రోడ్డులో 13.59 ఎకరాల స్థలం. గత టీడీపీ ప్రభుత్వం ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు దుబాయ్‌కు చెందిన లులూ గ్రూపుతో రూ.2,200 కోట్లకు ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వానికి (ఏపీఐఐసీ దగ్గర) 10.65 ఎకరాలే ఉండగా, దానిని ఆనుకొని బీచ్‌కు అభిముఖంగా వున్న 3.4 ఎకరాలను సీఎంఆర్ గ్రూపు నుంచి తీసుకుంది. అందుకు ప్రతిఫలంగా వారికి నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఖరీదైన భూములను ఇచ్చింది. ఇక్కడ నిర్మించే కన్వెన్షన్ సెంటర్, హోటల్ వల్ల ఐదు వేలమందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యం. దీనికి పెట్టుబడిదారుల సదస్సులో శంకుస్థాపన కూడా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లులూతో ఒప్పందం రద్దు చేసుకుంది. రెండేళ్లుగా ఆ భూమి ఖాళీగానే ఉంది.
కొన్నాళ్ల క్రితం భారీ షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించడానికి ఆసక్తి గల సంస్థలు ముందుకురావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మించి, అడుగు రూ.6,500 చొప్పున అమ్మి తమకు నిధులు ఇవ్వాలని పేర్కొంది. దానికి పెద్దగా స్పందన లభించలేదు. దాంతో ఇప్పుడు బీచ్‌రోడ్డు స్థలంతో పాటు గాజువాక సమీపాన ఉన్న అగనంపూడి, ఫకీర్‌తకియాల్లో మరో మూడు ఎకరాలు కలిపి మొత్తం రూ.1,465 కోట్లకు అమ్మకానికి పెట్టింది. అందులో బీచ్ రోడ్డులో 13.59 ఎకరాలకు రూ.1,452 కోట్లు విలువ నిర్ణయించింది. వీటిని ఈ నెల 22న ఆన్‌లైన్‌లో వేలం వేస్తామని ప్రకటించింది. దానికి ప్రీబిడ్ వేలం 19న నిర్వహిస్తామని ప్రకటించింది. ఇంతకు ముందు బీచ్ రోడ్‌లో 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలని ప్రకటించి, ఇప్పుడు దానిని 10 లక్షలు పెంచి 40 లక్షల చదరపు అడుగుల నిర్మాణం అని పేర్కొంది.
ప్రభుత్వం అమ్మదలచిన బీచ్ రోడ్డు స్థలానికి సంబంధించి.. తప్పనిసరిగా కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్) అనుమతులు తీసుకోవాలి. తీరానికి అతి సమీపాన అంత పెద్ద భారీ భవంతుల నిర్మాణానికి అనుమతులు లభిస్తాయా అనేది అనుమానమే. విశాఖలోని ఖరీదైన భూములను అమ్మకానికి పెట్టిన జగన్ సర్కార్ పై విశాఖ వాసులు మండిపడుతున్నారు. భూములు అమ్మడం కోసమే పరిపాలనా రాజధాని పేరుతో డ్రామాలు చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.