హే రమణా.. రచ్చ అవసరమా?
posted on Apr 7, 2021 @ 1:16PM
వడ్డించే వాడు మనవాడైతే పదవులు వెతుక్కుంటూ వస్తాయి. టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు విషయంలో ఇదే జరిగింది. టీడీపీ హయాంలో పదవి కోల్పోయారు. జగన్ రెడ్డి కాలంలో మళ్లీ ప్రధాన అర్చకులుగా నియమితులయ్యారు. పింక్ డైమండ్, నేలమాళిగలంటూ చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు ప్రతిఫలంగానే ఈ పదవి ఇచ్చారనేది ప్రతిపక్షం మాట. అందుకు తగ్గట్టుగానే.. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా చేరాక రమణ స్వామి భక్తి ప్రదర్శించుకున్నారు. సీఎం జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చారు. తిరుమలలో అన్యమత ప్రచారం లేదంటూ కితాబు ఇవ్వడం కాంట్రవర్సీగా మారింది.
శ్రీవారి ఖజానాలో పింక్ డైమండ్. అసలు ఉందో లేదో ఎవరికీ తెలీదు. ఉందంటూ అప్పట్లో గట్టిగా వాదించారు రమణ దీక్షితులు. దేవుని మీద ఒట్టేసి మరీ తాను చెప్పేదంతా నిజమన్నారు. ఆలయ నేలమాళిగల్లో ఖజానా తవ్వుకుపోయారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్‌గా చేసినవే. పింక్ డైమండ్ వివాదం మరింత ముదరడం.. కోర్టుకు చేరడం,.. నిజనిర్ధారణకు కమిటీ వేయడం.. అలాంటిదేమీ లేదంటూ తేలడంతో.. రమణ దీక్షితులు నోటికి తాళం పడింది. ఆ తర్వాత వయసురిత్యా ఆయన్ను ప్రధాన అర్చకుడి బాధ్యతల నుంచి తప్పించింది అప్పటి ప్రభుత్వం.
కట్ చేస్తే.. ఏపీలో ప్రభుత్వం మారింది. రమణ దీక్షితులకు మళ్లీ టీటీడీ ప్రధాన అర్చకులయ్యారు. పదవి అలంకరించిన వెంటనే జగన్ రెడ్డిని విష్ణుమూర్తితో పోలుస్తూ ఆకాశానికి ఎత్తేశారు. ఉడతా భక్తిగా స్వామి భక్తిని ప్రదర్శించారు. పనిలో పనిగా జగన్ సర్కారు ఉదాసీనత వల్ల తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందనే ఆరోపణల మకిలీని తుడిచేసే ప్రయత్నమూ చేశారు. అసలు తిరుమలలో అన్యమత ప్రచారమే లేదంటూ క్లీన్‌చీట్ ఇచ్చేశారు.
రమణ దీక్షితులు వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వైసీపీ అధికార ప్రతినిధిగా రమణ దీక్షితులు వ్యవహరిస్తున్నారని, అంతగా పార్టీలో సేవలు చేయాలనుకుంటే టీటీడీ ప్రధాన అర్చకుడిగా రాజీనామా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో అన్యమత ప్రచారం జరగడం లేదని ఆయన సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. గతంలో దేవస్థానంపై చేసిన ఆరోపణలుపై సమాధానం చెప్పిన తర్వాత రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడుగా రావాలన్నారు. తిరుమల దేవస్థానం ప్రతిష్టను భంగం కలిగించే విధంగా పింక్ డైమండ్ ఉందని, నేలమాళిగలు ఉన్నాయని ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు.. ఇప్పుడు ప్రధాన అర్చకుడుగా ఏముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందని తాను నిరూపిస్తానని, రమణ దీక్షితులు విచారణకు వస్తారా? అని భానుప్రకాశ్‌రెడ్డి సవాల్ విసిరారు.
రమణ దీక్షితులు తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా నియమితులు కావడంతో పాత ఆరోపణలన్నీ మళ్లీ కొత్తగా తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. తిరుమల వివాదాల తేనెతెట్టును మళ్లీ కదిలినా ఆశ్చర్యం అవసరం లేదు.