పోలీసులకు వ్యతిరేకం కాదు.. జవాన్ ను అప్పగిస్తాం! మావోయిస్టుల లేఖ
posted on Apr 6, 2021 @ 7:15PM
ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి వికల్ప్ పేరుతో లేఖ విడుదలైంది. జీరగూడెం భద్రతా బలగాల పై దాడి చేసింది తామేనని లేఖలో మావోయిస్టులు అంగీకరించారు. కాల్పుల్లో 23మంది జవాన్లు చనిపోయారని, ఒకరు తమ ఆధీనంలో ఉన్నారని తెలిపారు. నలుగురు మావోయిస్టులు కూడా ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయారని వెల్లడించారు. సురేష్, ఓడి సన్ని, లక్మా, భద్రు ఎన్ కౌంటర్ లో చనిపోయారని మావోయిస్టులు చెప్పారు. ఘటనా ప్రదేశం నుంచి సన్ని మృతదేహాన్ని తీసుకెళ్లలేకపోయామన్నారు.
అమరులైనా పోలీసు కుటుంబాలకు సంతాపం తెలిపారు మావోయిస్టులు. తాము పోలీసులకు వ్యతిరేకం కాదన్నారు. ఫాసిస్టు ప్రభుత్వ విధానాలకు తాము వ్యతిరేకమని లేఖలో వెల్లడించారు. విస్పస్టమైన విధానంతో చర్చలకు తాము సిద్ధమన్నారు. మధ్య వర్తల పేర్లు ప్రకటిస్తే తమ వద్ద ఉన్న జవాన్ రాకేశ్వర్ సింగ్ అప్పగిస్తామని మావోయిస్టులు తమ లేఖలో స్పష్టం చేశారు.
ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్–సుక్మా సరిహద్దుల్లో ఆదివారం మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో 24 మంది జవాన్లు అమరులయ్యారు. పథకం ప్రకారం ‘యూ’ ఆకారంలో చుట్టుముట్టిన నక్సలైట్లు.. జవాన్లను కాల్చి చంపారు. ఎటు పోవడానికి లేకుండా చేసి దాడికి పాల్పడ్డారు. .24 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న మావోయిస్టు హిడ్మా ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా బలగాలను ట్రాప్ చేసి హతమార్చిన మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా లక్ష్యంగా ‘ఆపరేషన్ ప్రహార్ 3’ని చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మరో 8 మంది మావోయిస్టులనూ హిట్ లిస్ట్ లో పెట్టింది. వారికి సంబంధించి వాంటెడ్ జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది.