ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్
posted on Apr 6, 2021 @ 4:12PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్ కు పోలింగ్ కు మధ్య నాలుగు వారాల గడువు ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఏపీ ఎస్ఈసీ పాటించలేదని హైకోర్టు పేర్కొంది. ఏప్రిల్ 1న ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ లో తదనంతర చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో గురువారం జరగాల్సిన పరిషత్ ఎన్నికల పోలింగ్ ఆగిపోయింది.
పరిషత్ ఎన్నికల నిర్వహణపై విపక్షాలు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్ఈసీ పట్టించుకోలేదని విమర్శించాయి. ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత రోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాకా అఖిలపక్ష సమావేశం జరపడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. ఎస్ఈసీ సమావేశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరించాయి. అంతేకాదు పరిషత్ ఎన్నికలను కూడా తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది.