తిరుపతి ప్రచారానికి జగన్.. నిఘా వర్గాల నివేదికే కారణమా?
posted on Apr 7, 2021 @ 3:59PM
5 లక్షల మెజారిటీ. తిరుపతిలో బంపర్ విక్టరీ. ఇదీ అధికార పార్టీ హడావుడి. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో గెలవడం తమకు పెద్ద విషయమేమీ కాదు. ఎంత మెజార్టీతో గెలుస్తామన్నదే టార్గెట్. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 5 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధిస్తామంటూ వైసీపీ నేతలు ఊదరగొడుతున్నారు. మెజార్టీ పేరుతో ప్రతిపక్షాలు, ప్రజలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ఇదంతా ఇంతకు ముందుమాట. ఇప్పుడు సీన్ మారిపోయింది. వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే, తొలిసారి జగన్ సైతం రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 14న తిరుపతిలో ప్రచారం నిర్వహించడానికి సిద్దమవుతున్నారు. ఇంతకీ.. అధికార పార్టీలో అంత కలవరం ఎందుకు వచ్చింది? స్వయంగా సీఎం జగనే తిరుపతిలో ప్రచారం చేసేంత అవసరం ఏమొచ్చింది?
ప్రచారం జోరందుకుంటున్న కొద్దీ అధికార పార్టీలో కలవరం మొదలైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుపతిలోనే తిష్ట వేసి.. ఓటర్లలో అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు. వైసీపీ ఆగడాలు, అరాచకాలను ఎండగడుతూ.. టీడీపీకే మీ ఓటు అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. నారా లోకేశ్ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. డివిజన్ల వారీగా టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకులను మోహరించడం.. వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు వర్తించవని బెదిరిస్తే ఆ వీడియో, ఆడియోలు తమకు పంపమంటూ వాట్సాప్ నెంబర్ ప్రకటించడంతో అధికార పార్టీ ఓవరాక్షన్‌కి చెక్ పడినట్టైంది. టీడీపీ దూకుడుతో ఓటర్ల మూడ్ వేగంగా మారుతోంది.గురువారం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రంగంలోకి దిగుతున్నారు. టీడీపీ యువ నేతలు కూడా వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇవన్ని టీడీపీకి ప్లస్ గా మారాయంటున్నారు.
అటు బీజేపీ-జనసేన సైతం ప్రచారంతో హోరెత్తిస్తోంది. రత్నప్రభ గెలుపు కోసం పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీని ఏకి పారేశారు. పవన్ ప్రచారం తర్వాత బీజేపీ గ్రాఫ్ కొంత పెరిగిందంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తిరుపతి ప్రచారానికి వస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రోడ్ షో కు మంచి స్పందన వచ్చింది. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో బీజేపీకి ఎంతో కొంత క్షేత్ర బలం ఉంటుందనేది ఆ మేరకు అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలమనేది బీజేపీ లెక్క.
ఇక అభ్యర్థుల పరంగానూ అందరికంటే బలహీనమైన కేండిడేట్ వైసీపీ అభ్యర్థి గురుమూర్తే అంటున్నారు. ఆయనకు ఉన్న అర్హతల్లా పాదయాత్రలో జగన్‌కు పాద సేవ చేయడమే. జగన్ కాళ్లకు మసాజ్ చేసినంత ఈజీ కాదు ఓటర్లను మేనేజ్ చేయడం. ఎవరేమిటో వారికి బాగా తెలుసు. మాజీ ఎంపీ టీడీపీ అభ్యర్థి పినబాక లక్ష్మి సీనియర్ మోస్ట్ లీడర్. ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిల్లీలో గట్టిగా పోరాడిన నేత. అలాంటి స్ట్రాంగ్ లీడర్ మళ్లీ తిరుపతి ఎంపీ బరిలో నిలిచారు. ఆమె గెలుపు కోసం టీడీపీ శ్రేణులు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. పనబాక లక్ష్మి ముందు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి చాలా వీక్ కేండిడేట్‌గా తిరుపతివాసులు భావిస్తున్నారు. అందులోనూ గురుమూర్తి తిరుపతి కోసం చేసిందేమి లేదు. అటు, వైసీపీ హయాంలో తిరుమల ప్రతిష్ట బాగా దిగజారుతోంది. ఆ ప్రభావం ఎన్నికలపై పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో.. గురుమూర్తికి గెలిచే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఆశించిన మేరకు లేదని పార్టీ వర్గాల సమాచారం. ఇంటెలిజెన్స్ నివేదికలూ ఇదే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లాయట. తిరుపతిలో ఈసారి గత మెజార్టీ కూడా కష్టమేనని.. ఓడి పోయే అవకాశాలూ ఉన్నాయని నివేదికలు ఇచ్చాయని తెలుస్తోంది. దీంతో.. నష్ట నివారణా చర్యల్లో భాగంగా సీఎం జగన్ తానే స్వయంగా తిరుపతిలో ప్రచారం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 14న తిరుపతి ప్రచార బరిలో దిగబోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి సీఎం జనంలోకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ ఇప్పటి వరకూ జరిగిన ఎలాంటి ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. తిరుపతిలోనూ ప్రచారం చేయాల్సిన అవసరం లేదని భావించినా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేకపోవడంతో తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బరిలో దిగక తప్పని పరిస్థితి సీఎం జగన్‌రెడ్డిది.