దేశానికి తాళాలు! లాక్‌డౌన్ దిశగా అడుగులు..
posted on Apr 8, 2021 8:59AM
ముంబై, ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు, రాయపూర్.. ఇలా ఒక్కో రాష్ట్రం, ఒక్కో నగరం లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. క్రమంగా దేశమంతా కరోనా గుప్పిట్లోకి జారుకుంటోంది. ఒక్క రోజులోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులతో కొవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఓ వైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతుండగా.. మరోవైపు లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ, 144 సెక్షన్లూ అంతే వేగంగా అమలు చేస్తున్నారు. ఇలా కొవిడ్ కట్టడికి డబుల్ బ్యారెల్ గన్‌తో యుద్దం చేస్తున్నారు.
కరోనా ఉద్ధృతితో కర్ణాటక ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. బెంగళూరు నగర పరిధిలో బుధవారం నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, నివాస సముదాయాల్లోని ఈత కొలనులు, జిమ్‌లు, పార్టీ హాళ్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరులో ఒక్క రోజులోనే 4,266 కేసులు నమోదు కాగా.. వారిలో 26మంది చనిపోవడంతో కర్ణాటక ప్రభుత్వం నగరంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.
ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించింది అక్కడి ప్రభుత్వం. ఢిల్లీ సమీపంలోని పంజాబ్‌లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆ రాష్ట్రంలోనూ రాత్రి కర్ఫ్యూ ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది అమరీందర్‌సింగ్ ప్రభుత్వం. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఉద్యోగులందరూ విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. పంజాబ్‌లో ఎలాంటి రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని ఆంక్షలు విధించారు. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నేతలతో పాటు ఇతరులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే పంజాబ్‌లో విద్యాసంస్థలు మూసి వేశారు.
మరోవైపు, పంజాబ్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్‌నూ వేగవంతం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. రోజుకు 2 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుతం రోజుకు 90,000 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక, ప్రతిరోజూ జరిపే కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని 50,000కు చేర్చాలని, పాజిటివ్ పేషెంట్ల ట్రేసింగ్ కూడా చురుగ్గా జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఇక చిన్న రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోనూ కరోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది. రాయపూర్ జిల్లాలో శుక్రవారం నుంచి 10 రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్ ప్రకటించారు. 9వ తేదీ రాత్రి 6 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 6 గంటల వరకూ పూర్తి కోవిడ్-19 కంటైన్‌మెంట్ జోన్ చర్యలు అమలు చేయనున్నట్టు జిల్లా యంత్రాగం తెలిపింది. లాక్‌డౌన్ సమయంలో జిల్లా సరిహద్దులన్నీ మూసివేస్తున్నట్టు రాయపూర్ జిల్లా కలెక్టర్ ఎస్.భారతి దాసన్ చెప్పారు.
ఇలా ఒక్కో స్టేట్.. ఒక్కో సిటీ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తూ దేశానికి అనధికారికంగా తాళాలు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజు వారీ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో మనకూ త్వరలోనే లాక్‌డౌన్ కానీ, మరింత కఠిన ఆంక్షలు కానీ రావొచ్చంటున్నారు. అవి తప్పాలంటే.. ప్రజలంతా కొవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిందే.