ఇంటి రక్షణలో తూముకూరు పోలీసులు.. మనకేవి అలాంటి వసతులు!
posted on Apr 7, 2021 @ 2:37PM
సెలవుల్లో ఊరెళ్లుతున్నారా? పెళ్లికి బంధువుల ఇంటికి వెళుతున్నారా? మరేదైనా పని కోసం కొన్ని రోజులు ఇల్లు వదిలిపెట్టాలా? మరి, ఇంట్లో ఎవరూ లేకపోతే దొంగలు పడతారనే భయం ఉంటుంది కదా? కాని కర్ణాటక రాష్ట్రంలోని తూమకూరు జిల్లా జనాలకు మాత్రం అలాంటి భయమేమి లేదు. అందుకంటే దొంగల భయం లేకుండా ఎక్కడి పోలీసులు ఉపాయం ఆలోచించారు. మీరు నిశ్చింతగా ఊరెళ్లండి.. మీరు వచ్చే వరకూ మీ ఇంటి రక్షణ బాధ్యతలు మావంటూ భరోసా ఇస్తున్నారు. జస్ట్ మాటలే కాదు, టెక్నాలజీ సాయంతో తాళం వేసి ఉన్న ఇంటికి గట్టి సెక్యూరిటీ అరేంజ్ చేస్తున్నారు. లాక్డ్ హౌజ్ మానిటరింగ్ సిస్టమ్-ఎల్‌హెచ్ఎమ్‌ఎస్ పరిజ్ఞానంతో ఇంటిని సురక్షితంగా ఉంచుతున్నారు.
ఇందుకోసం ముందుగా ఎల్‌హెచ్ఎమ్‌ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకూ ఇంట్లో ఉండరో సమీప పోలీస్ స్టేషన్‌కు మెసేజ్ ఇవ్వాలి. వెంటనే పోలీసులు మీ ఇంటికొచ్చి.. ఇంట్లో ఎల్‌హెచ్ఎమ్‌ఎస్ కెమెరాలు ఫిక్స్ చేస్తారు. వాటిని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిస్తారు. తాళం వేశాక.. ఇంట్లో ఏవైనా కదలికలు కనిపిస్తే.. వెంటనే పెద్ద శబ్దంతో సైరన్ మోగుతోంది. కంట్రోల్ రూమ్‌కూ మెసేజ్ వెళ్తుంది. వెంటనే పోలీసులు అలర్ట్ అవుతారు. క్షణాల్లో ఆ ఇంటికి చేరుకుంటారు.
లాక్డ్ హౌజ్ మానిటరింగ్ సిస్టమ్ తో తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనం జరిగే ఛాన్సెస్ దాదాపు ఉండదంటున్నారు తూమకూరు పోలీసులు. 8 నెలల క్రితం ఈ ఎల్‌హెచ్ఎమ్‌ఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు పోలీసులు. ఇప్పటి వరకూ దాదాపు 400 కుటుంబాలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఈ సేవలు పూర్తిగా ఉచితం. ఇందుకోసం పోలీసులు ఒక్క రూపాయి కూడా తీసుకోరు. దీంతో.. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలనే భయమే ఉండటం లేదు అక్కడి ప్రజలకు.
కర్ణాటక రాష్ట్రం తూమకూరు జిల్లా పోలీసులు ఇంత అద్బుతమైన ఉపాయం చేయగా.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఊదరగొట్టే తెలంగాణలో కానీ, బెస్ట్ పోలీసింగ్ అంటూ బిల్డప్ కొట్టే ఏపీలో కానీ.. ఇలాంటి సదుపాయం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు హడావుడి చేయడం తప్ప ప్రజలకు పనికొచ్చే ఇలాంటి ప్రయత్నాలు చేయరనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. ప్రజల కోసం కాకుండా పాలకుల కోసమే ఇక్కడి పోలీసులు ఎక్కువ పని చేస్తారని.. వారి అడుగులకు మడుగులు ఒత్తుతారని అంటారు.
తెలంగాణలో సీసీకెమెరాలు మనమే పెట్టుకోవాలి. కమ్యూనిటీ కెమెరాల పేరుతో బలవంతంగా మనతోనే వీధుల్లో కెమెరాలు పెట్టిస్తారు పోలీసులు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలంటేనే కాస్త భయపడాల్సిన పరిస్థితి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో కామన్. ఇక కర్ణాటక స్టేట్ తూమకురు జిల్లాలో అమలవుతున్న లాక్డ్ హౌజ్ మానిటరింగ్ సిస్టమ్-ఎల్‌హెచ్ఎమ్‌ఎస్ విధానం మన దగ్గర సాధ్యమేనా? మన పోలీసులు ఆ విధంగా ప్రజాసేవ చేయగలరా? తూమకూరు విధానాన్ని తెలుగు రాష్ట్రాలు అందిపుచ్చుకోగలవా?.. చూడాలీ మరీ..