మల్లారెడ్డి ప్లేస్ లో పల్లా! ఆడియో లీక్ వెనుక?
posted on Apr 7, 2021 @ 5:14PM
తెలంగాణలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తారని టాక్.. ఇంతలోనే మంత్రి మల్లారెడ్డి ఆడియో కాల్ లీక్.. ఓ వెంచర్ విషయంలో వాటా కావాలంటూ మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు సంబంధించిన ఆ ఆడియో వైరల్.. మంత్రి మల్లారెడ్డి ఆడియో లీక్ తర్వాత ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. కేసీఆర్ కేబినెట్ లో మార్పులకు, మంత్రి మల్లారెడ్డి ఆడియో లీక్ కావడానికి లింక్ ఉందనే ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి మంత్రి పదవికి ఎసరు పెట్టే కుట్రలో భాగంగానే... కొందరు టీఆర్ఎస్ నేతల డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందనే చర్చ జరుగుతోంది.
ఓ వెంచర్ లో విషయంలో వాటా కావాలంటూ మంత్రి మల్లారెడ్డి స్వయంగా ఆయనే బెదిరింపులకు దిగారు. సర్పంచ్‌లకు వాటాలు ఇస్తే.. ఎమ్మెల్యే, మంత్రులకు ఇవ్వారా అంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు చెప్పి పొట్టు పొట్టు చేయిస్తాం.. ఏమైనా బిచ్చమెత్తుకోవాల్నా.. వాటా ఇచ్చే వరకు వెంచర్‌ను ఆపేయండి అంటూ సదరు మంత్రి హుకుం జారీ చేశారు. దీనికి సంబంధించిన ఆడియోనే లీకై కలకలం రేపింది. మంత్రి మల్లారెడ్డి ఆడియో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రచ్చగా మారింది. మంత్రి మల్లారెడ్డి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
గతంలోనూ ఇలానే జరిగింది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గెలవగానే మంత్రివర్గ విస్తరణపై ప్రచారం జరిగింది. కవితను కేబినెట్ లో తీసుకునేందుకు ఎవరో ఒక మంత్రిని తప్పిస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. ఈ సమయంలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి రాసలీలలు బయటికి రావడం పెద్ద దుమారమే రేపింది. వివాదంలో చిక్కుకున్న ఆ మంత్రిని తప్పించి కవితకు కేబినెట్ లో బెర్త్ ఇస్తారని భావించారు. కవితకు కేబినెట్ బెర్త్ కోసం.. గులాబీ నేతలే ఆ మంత్రికి సంబంధించిన ఫోటోలు లీక్ చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే కవిత ఒక్కరినే కేబినెట్ లోకి తీసుకుంటే విమర్శలు వస్తాయని భావించిన కేసీఆర్.. గంగుల ప్లేస్ లో కవితను తీసుకునే సాహసం చేయలేకపోయారని చెబుతారు.
ఇప్పుడు మల్లారెడ్డి విషయంలోనూ గంగల తరహాలోనే జరిగిందని అంటున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి రెండో సారి గెలిచారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న పల్లా.. అధికార పార్టీ గెలవడం అసాధ్యమనుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకుని సత్తా చాటారు. ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత పల్లాకు మంత్రివర్గంలో చోటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో ప్రస్తుతం ఖాళీలు లేవు కాబట్టి... పల్లాను తీసుకోవాలంటే ఎవరో ఒక మంత్రిని తొలగించాలి. దీంతో పల్లాకు బెర్త్ కోసం మల్లారెడ్డిని కేబినెట్ నుంచి తొలగిస్తారనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి బెదిరింపుల ఆడియో లీక్ కావడంతో.. దీని వెనక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
మంత్రివర్గంలో మార్పులు చేస్తే నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డిని తొలగించవచ్చంటున్నారు. వేముల జూనియర్ అయినా మంత్రివర్గంలో చోటు కల్పించారు కేసీఆర్. అయితే ఆయన పనితీరు ఆశించనంతగా లేదని అభిప్రాయంలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుతోనూ వేములకు మంచి సంబంధాలు లేవంటున్నారు. జిల్లాలో ఉన్న సీనియర్ నేతలను మంత్రి పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు పార్టీ అధిష్టానానికి చాలా సార్లు వెళ్లాయంటున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని కవితపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ రెడ్డి ప్లేస్ లో కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇందూరు నేతలు కేసీఆర్ ను కోరినట్లు చెబుతున్నారు.
గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న గంగుల కమలాకర్ ను మార్చవచ్చంటున్నారు. గంగులను మారిస్తే.. ఆయన సామాజిక వర్గానికే చెందిన దాస్యం వినయ్ భాస్కర్ కు అవకాశం ఉంటుందంటున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కొప్పుల ఈశ్వర్ కు గండం ఉండే అవకాశం ఉంది. కొప్పుల స్థానంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కేబినెట్ లోకి తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. కేబినెట్ ఆశతోనే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బాల్క సుమన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన సురభీ వాణిదేవీ మండలి చైర్మెన్ లేదా డిప్యూటీ చైర్మెన్ ఖావడం ఖాయమంటున్నారు. వాణిదేవికి మండలి చైర్మెన్ ఇస్తే.. గుత్తా సుఖేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే నల్గొండ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డికి గండం ఉన్నట్లే.
మొత్తంగా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్.. తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించడం ఖచ్చితంగా జరుగుతుందనే అభిప్రాయమే మెజార్టీ టీఆర్ఎస్ నేతల నుంచి వ్యక్తమవుతోంది.