అత్తింటి వారు..చెట్టుకు కట్టేసి కొట్టారు..
posted on Apr 7, 2021 @ 3:37PM
అతని పేరు లక్ష్మణ్. వయసు 26 సంవత్సరాలు. పెయింటర్ గా పనిచేస్తున్నాడు. ఎల్లమ్మబండలో ఉండే మేనత్త ఇంటికి వెళ్ళినప్పుడు. అక్కడ భవాని అనే అమ్మాయిని చూశాడు. ప్రేమించాడు. అప్పటికే భవాని కి మరొకరితో విడాకులు అయ్యాయని పెద్దలు చెప్పారు.. అయిన సరే చేసుకుంటాను అని పెద్దలను ఒప్పించాడు. భవాని ని 2020 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు కాపురం బాగానే సాగింది. తర్వాత లక్ష్మణ్ ఏ పని చేయడం లేదు. గాలికి తిరుగుతున్నాడని భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఇంతలో భవానీ గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్లింది.
చేసేది ఏమిలేక లక్ష్మణ్ కూడా అత్తారింట్లో చేరాడు. ఒకటి కాదు, రెండు కాదు నాలుగు నెలలుగా లక్ష్మణ్ అత్తగారింటి వద్దే ఉంటున్నాడు. నెల రోజుల క్రితం పాప పుట్టింది. మార్చి 31న పాప ఫంక్షన్ చేశారు. అదే రోజు రాత్రి భవానీ తల్లిదండ్రులు, బంధువులు పని విషయంలో లక్ష్మణ్‌ను నిలదీశారు. మాటామాటా పెరిగింది. లక్ష్మణ్ అక్కడి నుంచి అలిగి ఇంటి దారి పట్టాడు. ఇంతలో అత్తింటి వారు లక్ష్మణ్‌ను పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. రాత్రి మొత్తం అలాగే, కట్టేసి ఉంచారు. మరునాటి ఉదయం కాలకృత్యాలు తీర్చుకుంటానని చెప్పడంతో కట్లు విప్పారు. అక్కడి నుంచి తప్పించుకున్న లక్ష్మణ్ యూసుఫ్‌గూడ అంజయ్యనగర్‌కు వచ్చి తల్లిదండ్రులు, బాబాయ్ కొడుకు సంపత్ కు జరిగిన విషయాన్ని పూస గుచ్చినట్లు చెప్పాడు. ఒంటి మీద వాళ్ళు కొట్టిన దెబ్బలు చూపించాడు. ఆ రోజంతా అదే దిగులుతో ఉన్నాడు. రాత్రి లక్మన్ ఇంట్లో బయటకు వెళతానని చెప్పి, తిరిగి రాలేదు. బాధలో ఉన్నాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు.
కట్ చేస్తే.. లక్ష్మణ్ బాబాయి రాము ఉండే ఇంట్లోని సెల్లార్ నుంచి దుర్వాసన వస్తుండడాన్ని రాము భార్య కళ గమనించింది. వెళ్లి చూడగా లక్ష్మణ్ ఫ్యాన్‌కు మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితికి చేరింది. లక్ష్మణ్ సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.