కేసీఆర్ సభ రద్దవుతుందా?

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. శనివారం ఒక్క రోజే లక్షా 52 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా భయంకరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజుకు 3 వేలకు పైగానే కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో గతంలో ఎప్పుడు లేనంతగా కేసులు వచ్చాయి. దీంతో జనాల్లో భయాందోళన నెలకొంది. కరోనా తీవ్రత పెరగడంతో ఈనెల 14న నాగార్జున సాగర్ లో సీఎం కేసీఆర్ తలపెట్టిన బహిరంగ సభపై సందిగ్థత నెలకొంది.తిరుపతిలో ఏపీ సీఎం జగన్ ఎన్నికల కరోనా కారణంగా రద్దు కావడంతో.. నాగార్జున సాగర్ లో తలపెట్టిన కేసీఆర్ సభపై చర్చ జరుగుతోంది. కరోనా తీవ్రత దృష్ట్యా బహిరంగసభను కేసీఆర్ రద్దు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నెల 14న హాలియాలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న బహిరంగ సభను రద్దు చేసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.  కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 14న కేసీఆర్‌ సభకు కలెక్టర్‌, ఎస్పీ అనుమతి ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో కరోనా కారణంగా సీఎం జగన్ సభ రద్దు చేసుకున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్‌ ఓటమి భయంతో రెండో సారి సభ పెడుతున్నారని, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని కేసీఆర్‌ సభ రద్దు చేసుకోవాలని జీవన్‌రెడ్డి కోరారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 14న హాలియాలో సీఎం సభ ఏర్పాటు ఖాయమైంది. సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 17న ఉండగా, ప్రచార గడువు ముగియటానికి దాదాపు 24 గంటల ముందు జరిగే సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొనబోతున్నారు.

కలికాలం పోలీసులు... వీళ్లకు రూల్స్ వర్తించవు 

హైదరాబాద్ పోలీసులు మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. తాము చెప్పే నీతులు జనాలకే గాని తమకు వర్తించవంటూ మరోసారి రుజువు చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే పొద్దున లేస్తే ట్రాఫిక్ నిబంధనలపై నెట్టింట ఊదరగొట్టే పోలీసులు.. వారే నిబంధనలను ఉల్లంఘించడం చర్చనీయాంశమైంది. సామాన్యుడికి బోధించే ముందు పోలీసులు తమ సిబ్బందికి అవగాహన కల్పించాలంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  హైదరాబాద్ లో తాజాగా ముగ్గురు మహిళా పోలీసులు బైక్ పై వెళుతున్న ఫోటో వైరల్ గా మారింది. బైక్‌పై ముగ్గురు ప్రయాణించడమే పెద్ద తప్పు. అందులోని ఇద్దరూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. అంతేనా, మధ్యలో కూర్చున్న ఆమె, డ్రైవింగ్ చేస్తున్న వారి చెవిలో ఫోన్ పెట్టి మరి సహకరిస్తుంది. ఇక హెల్మెట్ ఉందా..? అంటే అదీ లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పోలీస్ సిబ్బందిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్  ట్వీట్ చేశారు. కలికాలం పోలీసులు అంటూ ఆయన ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు.   ద్విచక్ర వాహనంపై ముగ్గురు మహిళా పోలీసులు వెళుతూ... ఫోన్ మాట్లాడుతున్న ఫొటోను దాసోజు శ్రవణ్  ట్వీట్ చేయగా అది వైరల్‌గా మారింది. తన ట్వీట్‌కు రాష్ట్ర డీజీపీని ట్యాగ్ చేశారు దాసోజు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పెద్ద ఎత్తున నెటిజన్లు రీట్వీట్లు చేస్తూ... ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తీరును విమర్శిస్తున్నారు. 

ఏపీలో అరాచక పాలన.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల మధ్య మంచి సంబంధాలున్నాయి. ఏపీ సీఎం జగన్ తనకు అత్యంత సన్నిహితుడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. చాలా సార్లు ఓపెన్ గానే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ ను ప్రశంసిస్తూ ప్రకటనలు చేస్తుంటారు. టీఆర్ఎస్ పాలన బాగుందంటూ వైసీపీ ప్రజా ప్రతినిధులు... ఏపీలో జగన్ అద్భుతంగా పని చేస్తున్నారంటూ గులాబీ లీడర్లు స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. కాని ఇప్పడు మాత్రం సీన్ మారినట్లు కనిపిస్తోంది. ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగన్ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మంలో నిర్వహించిన సంకల్ప సభలో కేసీఆర్ ను టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న షర్మిల.. దొర పాలనంటూ కేసీఆర్ పై తీరుపై విరుచుకుపడింది. కేసీఆర్‌ హయాంలో పెన్షన్లు లేవు, కార్పోరేషన్లకు నిధులు లేవు. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ?' అంటూ షర్మిల సీఎంపై విమర్శలు గుప్పించారు. 'ప్రజా సమస్యలు వినే ఓపిక ఈ దొరలకు ఉందా? సచివాలయంలో అడుగుపెట్టని ఇలాంటి సీఎం దేశంలో ఎవరూ లేరు. తాను అడుగుపెట్టని సచివాలయం ఎందుకని కూల్చేశాడు. ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నాడో అర్థం కావట్లేదు. సింగరేణి కార్మికుల మైనింగ్‌ సమస్య తీరిందా? కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు మీకు పట్టవా?..' అంటూ ఘాటుగా ప్రశ్నించారు షర్మిల.  వైఎస్ షర్మిల తనను తాను తెలంగాణవాది అని చెప్పుకోవడంపై ఖమ్మం జిల్లా సత్తుపల్లి  టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్రంగా స్పందించారు.  షర్మిల ఎప్పటికీ ఆంధ్రావాదియే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను విమర్శించే స్థాయి ఆమెకు లేదని మండిపడ్డారు. పదువులకు ఆశపడి ఎవరో డైలాగులు రాసిస్తే... షర్మిల వాటిని చదువుతున్నారని సండ్ర వెంకట వీరయ్య ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అసలు ప్రజాస్వామ్యం లేదని... అక్కడ అరాచక పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. షర్మిల తన అన్న మీద పోరాటం చేయలేక తెలంగాణకు వచ్చి పోరాటం చేస్తాననడం,ప్రశ్నించే గొంతుక అవుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సినిమా స్క్రిప్ట్,డైలాగులు చదువుతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర ఆరోపించడం కలకలం రేపుతోంది. పార్టీ పెద్దలకు తెలియకుండా జగన్ సర్కార్ పై సండ్ర ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అంటున్నారు. ఇటీవల కాలంలో ఏపీ సర్కార్ తో కేసీఆర్ కు సఖ్యత కొంత చెడిపోయిందని తెలుస్తోంది. బీజేపీ డైరెక్షన్ లో తెలంగాణలో షర్మల పార్టీ వస్తుందని భావిస్తున్నారట కేసీఆర్. షర్మిలకు జగన్ అండదండలు ఉన్నాయని నమ్మకంగా చెబుతున్నారట. షర్మిల పార్టీతో తమకు ఇంతకాలం ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీ, క్రిస్టియన్, దళిత ఓట్లకు గండి పడే అవకాశం ఉందని గులాబీ బాస్ ఆందోళనలో ఉన్నారంటున్నారు. అందుకే ఇకపై షర్మిలతో పాటు జగన్ కు టీఆర్ఎస్ టార్గెట్ చేస్తుందని చెబుతున్నారు. 

క్వారంటైన్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్! 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయిలో జరుగుతోంది. గురువారంతో ప్రచార గడువు ముగియనుంది. అయినా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించడం లేదు. ఒకరోజు రోడ్ షా నిర్వహించిన పవన్.. మళ్లీ ప్రచారానికి రావడం లేదు. అటు వకీల్ సాబ్ సినిమా విడుదలై.. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కలెక్షన్లలో కొత్త రికార్డులు స్పష్టిస్తుందని చెబుతున్నారు. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలను జగన్ సర్కార్ రద్దు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ నేతలు సీరియస్ స్పందించారు. చివరకి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వకీల్ సాబ్ కు మద్దతుగా జగన్ సర్కార్ తీరును ఎండగట్టారు. ఇంత జరుగుతున్నా జనసేనాని మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.  అయితే జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో హోం క్వారంటైన్‌లో ఉంటున్నారని తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యక్తిగ‌త సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారట. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువమంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజులుగా ఆయన సిబ్బందిలో ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు అని జనసేన తెలిపింది.  ప్ర‌స్తుతం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధతిలోనే జ‌న‌సేన‌ పార్టీ కార్య‌క‌లాపాలను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు.ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుని నెగ‌టివ్ అని తేలితే మ‌ళ్లీ ప్ర‌త్య‌క్షంగా ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొనే అవ‌కాశం ఉంది. సోమవారం బీజేపీ-జనసేన సంయుక్తంగా విజయ యాత్రను ప్రారంభించనున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేనాధిపతి పవన్ కల్యాణ్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ హాజరు కాబోతున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.ఈ సభకు పవన్ కల్యాణ్ హాజరు కావడంపై అనుమానాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన నేపథ్యంలో ఆయన ఈ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం లేదని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 14 రోజుల క్వారంటైన్ పూర్తి అయ్యాకే పవన్ కల్యాణ్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీజేపీ-జనసేన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడే అవకాశం  ఉంది.

లోకేష్ దెబ్బకు జగన్ అబ్బా! 

తిరుపతి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సభ రద్దే ఇప్పుడు ప్రధానంగా మారింది. సీఎం పర్యటన వాయిదాపైనే తిరుపతి రాజకీయమంతా సాగుతోంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీకి ఇదొక బ్రహ్మాస్తంగా మారగా... అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రం డిఫెన్స్ లో పడేసింది. నారా లోకేష్ విసిరిన సవాల్ కు భయపడే.. జగన్ తిరుపతి రాకుండా పారిపోయారనే ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు. తిరుపతిలో సీఎం జగన్ సభ కన్ఫామ్ కాగానే నారా లోకేష్ ఆయనకు సవాల్ విసిరారు.  జగన్ నువ్వు తిరుపతికి 14న వస్తున్నావంట… నిజంగా మీ బాబాయిని నువ్వు చంపకపోతే తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రమాణం చేయగలవా? అని లోకేష్ సవాల్ విసిరారు. ఇప్పుడు జగన్ సభ రద్దు కావడంతో .. లోకేష్ సవాల్ ప్రకారం ప్రమాణం చేయకపోతే జనాలకు రాంగ్ మెసేజ్ వస్తుందనే భయంతోనే జగన్ .. తన పర్యటనను కరోనా సాకుతో రద్దు చేసుకున్నారని తమ్ముళ్లు విమర్శిస్తున్నారు.  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటన రద్దుపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్నమొన్నటి వరకు కరోనా లేదు, గిరోనా లేదు ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన జగన్.. నేడు అదే కరోనా పేరు చెప్పి తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని, ఇది పిరికితనం కాక మరేంటని ఎద్దేవా చేశారు. జగన్ విచిత్రమైన వ్యక్తి అని, ఆయన రివర్స్‌లో పనిచేస్తారని విమర్శించారు.వివేకానందరెడ్డి హత్య కేసులో ఎక్కడ ప్రమాణం చేయాల్సి వస్తుందోనన్న భయంతోనే జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని అన్నారు. ఆయన హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ప్రమాణం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అచ్చెన్నాయుడు అన్నారు. 'మీ తిరుపతి ఎన్నిక‌ల‌ సభ ఎందుకు వాయిదా వేశారు ముఖ్యమంత్రి గారూ, కరోనా భయంతోనేనా? మరి మిగతా నాయకుల సభలకు జనం తండోప తండాలుగా వస్తున్నారు. అదే నిజమైతే, ఎన్నికలు వాయిదా వెయ్యాలిగా? అసలు మీ భయం, కరోనా గురించా, లేక "బాబాయిని చంపిందెవరని" జనం నిలదీస్తారనా? తెగేదాక‌ లాక్కండి సార్, పబ్లిక్ సార్' అని టీడీపీ నేత  వ‌ర్ల రామ‌య్య విమ‌ర్శ‌లు గుప్పించారు. మరోవైపు  ఇంటెలిజెన్స్ సర్వేలో వైసీపీ కేండిడేట్ గురుమూర్తికి గెలుపు అవకాశాలు తక్కువేనంటూ నివేదికలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. తనకు పాదసేవ చేశాడనే ఏకైక కారణంతో ప్రజలకు పెద్దగా పరిచయంలేని ఫిజియోథెరపిస్టు గురుమూర్తిని పోటీలో నిలపడంపై ఓటర్లు పెదవి విరిచారు. ప్రచారంలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు టీడీపీ ఎన్నికల ప్రచారంలో దుమ్ము రేపుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు తిరుపతిలోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్‌లకు తిరుపతిలో అడుగడుగునా ప్రజలు నుంచి విశేష స్పందన వస్తోంది. దీంతో గురుమూర్తి గెలుపు కష్టసాధ్యం కావడంతో జగన్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఒకవేళ తాను ప్రచారం నిర్వహించినా వైసీపీ అభ్యర్థి ఓడిపోతే తన పరువు పాతాళానికి పడిపోతుందని భయపడుతున్నారట. అందుకే కరోనా కేసులను సాకుగా చూపి.. తిరుపతికి రాలేనంటూ లేఖ రాసి.. హమ్మయ్యా అని జగన్ చేతులు దులిపేసుకున్నారని భావిస్తున్నారు.  

వైసీపీ ఎంపీలు రాజీనామా?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు త్వరలో రాజీనామా చేయబోతున్నారా? తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక వేదికగా వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారాయి. వైసీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు మంత్రి పెద్దిరెడ్డి. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం జగన్ పాల్గొంటారని గతంలో షెడ్యూల్ వచ్చింది. ఈనెల 14న జగన్ సభకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే  తిరుపతి పర్యటనను సీఎం జగన్ రద్దు చేసుకున్నారని శనివారం ప్రకటన వచ్చింది. కరోనా ఉధృతి కారణంగా సీఎం సభ రద్దైందని వైసీపీ ప్రకటించింది. అయితే దీని రాజకీయ రచ్చ జరుగుతోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విసిరిన సవాల్ కు భయపడే జగన్ తిరుపతి రావడం లేదనే చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందని నిఘా వర్గాలు నివేదిక ఇవ్వడం వల్లే జగన్ ప్రచారానికి రావడం లేదని మరికొందరు నేతలు విమర్శిస్తున్నాయి. టీడీపీ నేతల ఆరోపణలకు కౌంటరిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి. కరోనా ఉధృతి కారణంగానే జగన్ సభ రద్దైందని చెప్పారు. తిరుపతిలో వైసీపీకి భారీ మెజార్టీ రావడం ఖాయమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నామని ప్రకటించారు. అందుకు చంద్రబాబు సిద్దమా అని ప్రశ్నించారు. తిరుపతిలో వైసీపీ ఓడిపోతే... వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని ప్రకటించారు మంత్రి పెద్దిరెడ్డి. టీడీపీ ఓడిపోతే.. మీ పార్టీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు.  మంత్రి పెద్దిరెడ్డి సవాల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. తిరుపతి లోక్ సభ పరిధిలో చంద్రబాబు ప్రచారానికి భారీ స్పందన వస్తోంది. నారా లోకేష్ రోడ్ షోలకు జనాలు తరలివస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రసంగాలకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి సవాల్ ను చంద్రబాబు స్వీకరిస్తే.. తిరుపతి ఉప ఎన్నిక మరింత రంజుగా మారే అవకాశం ఉంది.   

బస్టాండ్ లోనే మహిళకు నిప్పు

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. బస్డాండులోనే ఓ మహిళకు నిప్పంటించాడు దుండగుడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం రోజుకూలీ అయిన ముత్తు.. శాంతి అనే మహిళతో సహజీవనం చేస్తూ బస్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపైనే నివసించేవారు. ఈ క్రమంలో కోయంబేడు మార్కెట్‌లో పనిచేసే మరో వ్యక్తితో శాంతి సన్నిహితంగా మెలగుతుండడాన్ని చూసి ముత్తు జీర్ణించుకోలేకపోయాడు అతడితో సన్నిహితంగా ఉండడం మానుకోవాలని ముత్తు పలుమార్లు శాంతిని హెచ్చరించాడు. అతడి మాటలను ఆమె పట్టించుకోకపోవడంతో మరింత రగిలిపోయిన ముత్తు ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. బస్టాండ్‌ని ప్లాట్‌ఫాంపై గత రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పంటించాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హఠాత్ పరిణామంతో షాక్‌కు గురైన ప్రయాణికులు వెంటనే తేరుకుని మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించి వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చెన్నై బస్టాండ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

ఏపీలో దళితుల జీవనం అధ్వాన్నం! ఎన్జీవో షాకింగ్ రిపోర్ట్ 

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తోంది. 23 నెలల పాలనలో ఎన్నో వివాదాలు... కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు. అయినా తన తీరు మార్చుకోవడం లేదు జగన్ సర్కార్. సంక్షేమ పాలనలో తాము దేశంలోనే ముందున్నామని చెబుతోంది.ముఖ్యంగా దళిత ద‌ళిత సామాజిక వ‌ర్గాల ‌కు.. తాము ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటోంది వైసీపీ సర్కార్. కీల‌క‌మైన ప‌ద‌వులు.. హోదాలు వారికి ఇస్తున్నామ‌ని స్వ‌యంగా సీఎం జ‌గ‌నే ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే జ‌గ‌న్ చెబుతున్న‌ట్టు వైసీపీ పాలనసో ద‌ళితులు సంతోషంగా ఉన్నారా..  ద‌ళితుల‌కు ఏపీలో ర‌క్ష‌ణ ఉందా? అంటే.. కాద‌నే అంటున్నాయి.. అంత‌ర్జాతీయ సంస్థ‌లు. అమెరికాకు చెందిన `ఎన్ జీవో` ఇటీవ‌ల విడుద‌ల చేసిన నివేదిక‌లో ఏపీకి సంబంధించిన ప‌లు అంశాలు కీల‌కంగా మారాయి. ఈ మానవహక్కుల నివేదిక లో ప్రత్యేకంగా భారతదేశంలోని పరిస్థితులపై దృష్టి సారించింది. ఏపీలో దళితుల స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న వివక్ష, లాక‌ప్ డెత్‌, విశాఖ ఎల్‌జీ లో లీకేజీ, పోర్టులో జరిగిన ప్రమాదాలతోపాటు అనేకానేక అంశాలను ప్రముఖంగా ప్రస్తావించింది. మానవహక్కులు, మైనారిటీ కోటా కింద రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఎదుర్కొన్న అనేకానేక సంఘటనలను విశ‌దీక‌రించింది. `ఎన్ జీవో`  నివేదిక ప్రకారం.. గత ఏడాది జూలై 20న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల వరప్రసాద్‌ను ఓ గొడవలో పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతన్ని బాగా కొట్టి గుండుగీయించారన్న ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది జూలై 21న 18 ఏళ్ల ఎరిచెర్ల కిరణ్‌ అనే దళిత యువకుడు ప్రకాశం జిల్లాలో పొలీసు కస్టడీలో ఉండగా మరణించారు. ఈ సంఘటనకు మూడు రోజుల ముందే అతను మద్యం సేవించి వాహనం నడపడంతోపాటు కరోనా నిబంధనలను పాటించలేదని, మాస్క్‌ ధరించలేదన్న అభియోగాలపై స్టేషన్‌కు తీసుకొచ్చారు. అత‌నిని కొట్ట‌డం వ‌ల్లే.. మ‌ర‌ణించాడ‌ని ప‌రోక్షంగా ప్ర‌భుత్వం అంగీక‌రించి.. ఎస్సైపై కేసు న‌మోదు చేసింది. దళితులు ఇప్పటికీ ఏపీలో తమ కులం కారణంగా కొన్ని పాఠశాలల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారని `ఎన్ జీవో తన నివేదికలో పేర్కోంది.  పాఠశాలల్లో ఉదయం జరిగే ప్రేయర్‌లో పాల్గొననివ్వడం లేదని.. తరగతి గదుల్లో వెనక బెంచీల్లో కూర్చోమం టున్నారని.. లేదా బలవంతంగా వారితో టాయిలెట్లను కడిగిస్తున్నారనియ... కానీ వాటిని వాడుకోనివ్వరని ఉంది. దళిత విద్యార్థుల హోమ్‌ వర్క్‌ నివేదికలను టీచర్లు చూడటం లేదన్న రిపోర్టులు కూడా ఉన్నాయి. కొన్నిచోట్ల వారికి మధ్యాహ్న భోజనం నిరాకరిస్తున్నారని, అగ్రవర్ణ పేద విద్యార్థులతో కాకుండా ప్రత్యేకంగా కూర్చోవా లని వారిని కోరుతున్నారని అమెరికా ఎన్ జీవో తన నివేదికలో వెల్లడించింది. అమెరికా  ఎన్‌జీవో వెల్ల‌డించిన నివేదిక‌లను బ‌ట్టి.. జ‌గ‌న్ పాల‌న‌లో ద‌ళితుల ప‌రిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధ‌మ‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

భారత్ లో కరోనా కల్లోలం.. కారణాలు ఇవేనట! 

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతేడాది కరోనా తీవ్రతను దాటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా లక్షా 50 వేలకు పైగా కేసులు నమోదుకాగా 794 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 1,32,05,926 మందికి కరోనా సోకగా.. 1,68,436 మంది మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులు వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలో  కొత్తగా 55, 411 కరోనా కేసులు నమోదుకాగా 309 మంది మరణించారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఒక్కరోజే 9,327 మంది కరోనా బారినపడగా.. 50 మంతి మృతి చెందారు. గుజరాత్‌లో కొత్తగా గుజరాత్‌లో 5,011 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 49 మంది మృతిచెందారు. తమిళనాడులో కొత్తగా 5,989 మంది కరోనా బారిన పడగా.. 23 మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటకలో కొత్తగా 6,955 కేసులు నమోదుకాగా 36 మృతిచెందారు. ఛత్తీస్‌గడ్‌లోనూ కరోనా కేసులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక్కడ కొత్తగా 14,098 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 97 మంది మరణించారు. భారత్‌లో కొవిడ్‌-19 కేసులు భారీగా పెరగడానికి అనేక కారణాలను ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రస్తావిస్తున్నారు. కరోనాలో కొత్త రకాలు, ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పొంచి ఉన్న జనాభా ఎక్కువగా ఉండటం, ఎన్నికలు, ఇతర బహిరంగ కార్యక్రమాలు, అజాగ్రత్త, టీకాల కార్యక్రమం మందకొడిగా సాగడం ఇందుకు కారణమవుతున్నాయని చెప్పారు. టీకా పొందినప్పటికీ జాగ్రత్తలను కొనసాగించాల్సిందేనని ప్రజలకు సరిగా తెలియజేయకపోవడం కూడా ఈ విజృంభణకు కారణమే. భారత్‌లోని ప్రముఖ వైరాలజిస్టులు షాహిద్‌ జమీల్, టి.జాకొబ్‌ జాన్‌లు దీనిపై ఆసక్తికరమైన విశ్లేషణలు చేశారు. రాబోయే కొద్ది నెలల్లో వైరస్‌ కొత్త ఉత్పరివర్తనలపై టీకాలు ఎలా పనిచేస్తాయన్నదానిపైనే భవిష్యత్‌లో కొవిడ్‌ తీరుతెన్నులు ఉంటాయని చెప్పారు.  మొదటి ఉద్ధృతి తర్వాత కూడా.. కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్నవారు భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారని జమీల్‌ తెలిపారు. మొదటి ఉద్ధృతి తర్వాత అనేక మందిలో అలసత్వం పెరిగిందని చెప్పారు. తాజా విజృంభణకు ఇదే ప్రధాన కారణమన్నారు డాక్టర్ జమీల్.  టీకా పొందాక కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అధికారులు సరిగా ప్రచారం చేయలేదన్నారు డాక్టర్లు. దేశంలో కొవిడ్‌ పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని జమీల్‌ చెప్పారు. జనవరి మధ్యలో టీకాలు మొదలుపెట్టిన సమయంలో రోజువారీ ఇన్‌ఫెక్షన్లు తక్కువగా ఉన్నాయన్నారు. ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు సహా అర్హులైన కొందరు టీకాలపై విముఖత చూపారు. మార్చి మొదటినుంచే కేసుల సంఖ్య పెరగడం మొదలుపెట్టినప్పటికీ 60ఏళ్లు పైబడినవారిలోనూ పలువురు వ్యాక్సిన్లపై ఆసక్తి చూపలేదు. ఇప్పుడు వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. మరోపక్క దేశంలో 0.7 శాతం మంది మాత్రమే టీకాకు సంబంధించిన రెండు డోసులను తీసుకున్నారు. 5 శాతం మందికి ఒక డోసు అందింది. అందువల్లే వ్యాక్సినేషన్‌ ఫలితాలు పెద్దగా కనిపించడంలేదని వివరించారు.   కరోనా కొత్త రకాలు కూడా తాజా ఉద్ధృతికి దోహదపడి ఉంటాయని జమీల్, జాన్‌లు చెప్పారు. ‘‘ప్రజల్లో అలసత్వం పెరిగిన సమయంలోనే వైరస్‌లో కొత్త రకాలు వచ్చి పడ్డాయి. ఫలితంగా మొదటి ఉద్ధృతితో పోలిస్తే రెండో విజృంభణలో వైరస్‌ వ్యాప్తి దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంది. ఈ అంశంలో మనకు దిశానిర్దేశం కొరవడింది’’ అని జాన్‌ పేర్కొన్నారు. పంజాబ్‌లో వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో బ్రిటన్‌ రకం వైరస్‌ల వాటా 80 శాతం ఉందన్నారు. దీనికితోడు రెండు ఉత్పరివర్తనలు కలిగిన ఒక కొత్త రకం వైరస్‌.. భారత్‌లో ఆవిర్భవించిందని చెప్పారు. మహారాష్ట్రలో జన్యుక్రమాలను పరిశీలించిన కొత్త కేసుల్లో 15-20 శాతం వాటాను ఇదే ఆక్రమించిందని తెలిపారు. ఈ రెండు కాక.. దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ రకాలు కూడా ఉన్నాయన్నారు. బ్రిటన్‌ రకం.. 50 శాతం ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు.    ఇలా చేస్తే బెటర్ ఉద్ధృతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 45 ఏళ్లు పైబడినవారికి మాత్రమే టీకాలను ఇస్తూ.. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 18ఏళ్లు పైబడినవారందరికీ టీకా ఇవ్వాలని జమీల్‌ కోరారు. వ్యాక్సిన్ల సరఫరాకు అనుగుణంగా ఆ కార్యక్రమాన్ని సమతౌల్యం చేసుకోవాలన్నారు. నెలకు కోటి డోసుల మేర కొవిషీల్డ్, 30 లక్షల డోసుల మేర కొవాగ్జిన్‌ టీకాలను పంపిణీ చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని చెప్పారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్, స్పుత్నిక్‌ వి టీకాలకూ అత్యవసర వినియోగ అనుమతినిస్తే వ్యాక్సిన్ల లభ్యత పెరుగుతుందన్నారు. 

చంద్రబాబు, లోకేష్ పై కేసు

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికతో ఏపీ రాజకీయాలు రచ్చగా మారాయి. ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేల్చుతున్నారు నేతలు. వ్యక్తిగత దూషణలు, పరస్పర సవాళ్లతో కాక రేపుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ పై కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై శనివారం కేసునమోదైంది. తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నికలో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురుమూర్తిపై టీడీపీ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో అనుచిత పోస్ట్ చేశారంటూ వాళ్లపై కేసు పెట్టారు. ఫేస్‌బుక్‌ ఖాతాలో అనుచిత పోస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై ఎస్పీ ఎస్టీ కేసు క‌ట్టాల‌ని వైసీపీ నేతలు ఏపీ డీజీపీని శుక్రవారం కోరారు. చంద్రబాబు, లోకేష్ పై చ‌ర్యలు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు, లోకేష్‌లపై విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఐటీ యాక్ట్‌ కింద శనివారం కేసు నమోదు చేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్‌.. డీజీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేయగా. ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బాబు, లోకేష్‌లపై కేసు నమోదు చేశారు. ఇక టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపైనా కేసు నమోదు చేసింది సీఐడీ. తిరుపతి బైపోల్‌ సందర్భంగా.. ఈనెల 7న దేవినేని ఉమ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఆ ప్రెస్‌ మీట్‌లో ఆయన చూపించిన డిజిటల్‌ డాక్యుమెంట్‌ ఫోర్జరీ అంటూ సీఐడీ కేసు బుక్‌ చేసింది. ఓ ట్యాబ్‌లో ఆయన చూపించిన వీడియోని ఫోర్జరీ అని.. అది చూపి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. 

ఈఎస్ఐ కేసులో మంత్రి పీఏ అరెస్ట్

తెలంగాణలో సంచలనం స్పష్టించిన ఈఎస్ఐ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మళ్లీ దూకుడు పెంచారు. హైదరాబాద్ లో సోదాలు నిర్వహించారు. ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి. డీడీ కాలనీలో నివాసం ఉంటున్న  నాయిని నరసింహారెడ్డి దగ్గర గతంలో పీఏగా పని చేసిన ముకుందరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ముకుంద రెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ రైడ్స్‌ను మొత్తం అధికారులు వీడియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దగ్గర పీఏగా ముకుందరెడ్డి పని చేస్తున్నారు. మాజీ హోంశాఖ మంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు భారీగా నగదు, నగలు గుర్తించారు. నకిలీ నోట్ల కట్టలతో పాటు రూ.కోటికి పైగా విలువైన నగలు, బ్లాంకు చెక్కులు, ఆస్తుల దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు, నగలను గుర్తించారు. నాయిని మాజీ పీఎస్ ముకుంద రెడ్డి బంధువు వినయ్ రెడ్డి ఇంట్లోనూ భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. ఏడు డొల్ల కంపెనీల నిర్వాహకుడు బుర్ర ప్రమోద్ రెడ్డి ఇంట్లో‌నూ నగలు నగదు స్వాధీనం చేసుకున్నారు. డొల్ల కంపెనీల వెనుక కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది.  ఈఎస్ఐ కుంభకోణంలో గతంలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో ఏకకాలంలో 10 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించి.. ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. నాయిని కుమారుడు దేవేందర్‌రెడ్డి, అల్లుడు శ్రీనివాస్‌రెడ్డిని ఈడీ విచారించింది. నాయిని నర్సింహారెడ్డి మాజీ పీఎస్ ముకుంద రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అలాగే మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఇతర నిందితుల ఇళ్ళల్లోనూ ఈడీ సోదాలు చేపట్టింది. ఈఎస్‌ఐ స్కామ్‌లో మనీ లాండరింగ్ పాల్పడినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. దేవికారాణి మనీ ల్యాండరింగ్ పాల్పడినట్లు ఆధారాలు ఉండగా, ఇప్పటికే 25 మంది అరెస్ట్ చేసింది.   

వకీల్ సాబ్ కు చంద్రబాబు సపోర్ట్

వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. వైసీపీ సర్కార్ పై విపక్షాలన్ని విరుచుకుపడుతున్నాయి. మాములుగా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే.. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది. గతంలో చాలా సినిమాలకు ఈ అవకాశం వచ్చింది. కాని పవన్ కల్యాణ్ వకీల్ సాబ్‌ పై కక్ష కట్టిన జగన్ సర్కార్.. బెనిఫిట్ షోలు రద్దు చేసింది. టికెట్ల బుకింగ్ ముగిశాకా బెనిఫిట్ షోలు రద్దు చేశారు. గత నెలలో విడుదలైన ఉప్పెన సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచారు. ఇప్పుడు వకీల్ సాబ్ కు మాత్రం జగన్ సర్కార్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు.  వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుందని, రాజకీయ కక్షను సినిమా మీద చూపిస్తున్నారని పవన్ అభిమానులు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  జగన్ సర్కార్ తీరును ఎండగడుతూ పవన్ కల్యాణ్ కు అండగా నిలిచారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పవన్ కల్యాణ్ సినిమాని అడ్డుకుంటారా? అని, హైకోర్టు అనుమతి ఇస్తే హౌస్ పొజిషన్‌కి వెళతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మీద అభిమానంతో తాను మాట్లాడటం లేదని, ధర్మం, న్యాయం కోసం అడుగుతున్నానన్నారు. సూళ్లూరు‌పేట రోడ్ షోలో ప్రసంగించిన చంద్రబాబు.. జగన్ రెడ్డికి భయపడితే ఇంట్లో నుంచి కూడా రానని చెప్పారు. సొంత బాబాయిని చంపేస్తే నిందితులను శిక్షించాలనే ఆలోచన కూడా రాదా? ఎన్నికలకి ముందు వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని సాక్షిలో బ్రేకింగ్స్ ఇచ్చారు.. సాక్ష్యాలు తారుమారు చేశారని ఆరోపించారు. ఆయన కుమార్తె ఫోన్ చేసి మృతిపై అనుమానాలున్నాయని అన్నారు.. విచారణలో గొడ్డలితో నరికి చంపేశారు. నేను, నా మనుషులు వివేకను చంపేశానని అన్నారు.. చిన్నాన్నని చంపిన వ్యక్తులని కాపాడే సీఎంకి మిగిలిన వాళ్లు ఓ లెక్కా?. నారా లోకేశ్ తిరుపతిలో ప్రమాణం చేద్దాం రమ్మంటే తోకముడిచారు.’’ అని చంద్రబాబు విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నిక చరిత్ర సృష్టించబోయే ఎన్నిక అన్నారు చంద్రబాబు. టీడీపీకి అవకాశం ఇవ్వాలని  కోరారు. ‘‘మీ ఉత్సాహం, కేరింతలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది. సూళ్లూరుపేటకి ఓ ప్రత్యేకత ఉంది. రాజ్యాంగం రాసిన వారు ఇక్కడే పుట్టారు. జగన్ అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదని రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నాడు. నాకేం సీఎం పదవి కొత్తకాదు. నా రికార్డు ఎవరూ బద్దలు కొట్టలేరు. తొమ్మిదేళ్లు సమైక్యాంధ్రకి, అయిదేళ్లు నవ్యాంధ్రకి సీఎంని చేశారు. కసిగా కష్టపడి నవ్యాంధ్రని అభివృద్ధి చేసుకున్నాం. 2029 నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ చేయాలనుకున్నాం. రెండేళ్లు అయింది వైసీపీ వచ్చి. నాడు ముద్దులు పెట్టి, ఇప్పుడు గుద్దుకుంటూ వస్తున్నాడు. అందర్నీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ రెడ్డి‌. మీ ఓటు ద్వారా రాష్ట్రాన్ని కాపాడుకునే అవకాశం వచ్చింది. పనబాక లక్ష్మిని మీరంతా ఆశీర్వదించాలి. పార్లమెంట్‌లో టీడీపీ బలాన్ని మరింత పెంచండి.’’ అని చంద్రబాబు కోరారు. 

తంతే ఎక్కడ పడతావో చూస్కో.. రేవంత్ పై సుమన్ ఫైర్

నల్గొండ జిల్లా  నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచార గడువు సమీపిస్తున్న కొద్ది నేతల మాటల్లో తీవ్రత పెరుగుతోంది. వ్యక్తిగత దూషణలతో కాక రేపుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో మంట రాజేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  రేవంత్ రెడ్డి కొడంగల్ లో తంతే మల్కాజిగిరిలో పడ్డాడని, ఇప్పుడు అక్కడ తంతే ఇంకెక్కడ పడతాడో చూసుకోవాలని బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ కు పదవులు ఓ లెక్క కాదని, ఉద్యమం చేసి తెలంగాణ సాధించారని వెల్లడించారు. కేసీఆర్ ఉద్యమం చేస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావ్? అంటూ రేవంత్ పై మండిపడ్డారు. పెద్దవూరలో మీడియాలో మాట్లాడిన బాల్క సుమన్... కొడంగల్ లో ఘోర పరాజయం పాలైనప్పటికీ రేవంత్ కు సిగ్గు రాలేదని విమర్శించారు.  ఆంధ్రా పాలకుల తొత్తుగా పనిచేసిన రేవంత్ కు టీఆర్ఎస్, కేసీఆర్ పేరెత్తే హక్కులేదన్నారు. పెద్దల గురించి అవాకులు చెవాకులు పేలుతూ   రేవంత్ రెడ్డి శునకానందం అనుభవిస్తున్నారని సుమన్ అన్నారు. రేవంత్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని, చిప్పకూడు తినడం తథ్యమని చెప్పారు. గతంలో పెయింటర్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో చెప్పాలని ప్రశ్నించారు. మైకు దొరికితే చాలు కుక్కలాగా మొరుగుతుంటాడని విమర్శించారు. 'నేనొక్క పిలుపు నిస్తే కార్యకర్తలు, అభిమానులు నీ సంగతేంటో చూస్తారు' అని సుమన్ హెచ్చరించారు. పెద్దవూర మండల కాంగ్రెస్ ప్రచార ఇంచార్జ్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి. కరోనాతో రెండు వారాల పాటు ఇంట్లోనే ఉన్న రేవంత్ రెడ్డి.. శుక్రవారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించారు. పెద్దవూర మండంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి.  

మంత్రి, ఎమ్మెల్యే వాగ్వాదం.. 

వాళ్ళు ఇద్దరు ఒకే పార్టీ నాయకులు. ఒకరు మంత్రి అయితే, మరొకరు ఎమ్మెల్యే. ఏ పార్టీ వారైనా ప్రతిపక్షం వారిని విమర్శించుకుంటారు. కానీ మాత్రం సొంత పార్టీ వారి పైనే విమర్శలు కురిపించుకున్నారు. వారు ఎవరో కాదు మీరే చూడండి.    డీసీసీబీ మల్టీ సర్వీసెస్ సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. డోర్నకల్ నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని రెడ్యానాయక్ విమర్శించారు. నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎర్రబెల్లి కల్పించుకుని మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని రెడ్యానాయక్‌ను ప్రశ్నించారు. తాను మంత్రి పదవి ఎవరి దగ్గర గుంజుకోలేదని, దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనకు మంత్రి పదవి ఇచ్చారని రెడ్యానాయక్‌ తెలిపారు. ‘నీకు త్వరలోనే మంత్రి పదవి వస్తుంది’’ అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ‘‘మీరుండగా నాకు ఎలా వస్తుంది’’ అని రెడ్యానాయక్ ప్రశ్నించారు. రెడ్యానాయక్, ఎర్రబెల్లి సంభాషణపై రాజీకయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  

వకీల్ సాబ్ పై వైసీపీ వార్! కలెక్షన్లు తగ్గేనా? 

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌  'వకీల్‌సాబ్‌' సినిమాపై ఏపీలో పొలిటికల్ వార్ సాగుతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జనసైనికులకు మధ్య యుద్దమే నడుస్తోంది. ఏప్రిల్‌ 9న వకీల్ సాబ్ సినిమా విడుదలైంది. హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ను సాధిస్తూ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. తొలి రోజు రికార్డ్ కలెక్షన్ వచ్చాయంటున్నారు. సినిమా సూపర్ హిట్ అంటూ చర్చ జరిగినా..  తొలి రోజు సాయంత్రానికే  మరోలా ట్రెండ్ అయింది. వకీల్ సాబ్ డిజాస్టర్ అంటూ కొన్ని సీన్లను ట్రోల్ చేసి పడేశారు.  వకీల్ సాబ్ మీద వెంటనే నెగెటివ్ ట్రెండ్ ప్రచారం కావడంలో వైఎస్ జగన్ అభిమానులు ఉన్నారని తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తల ట్రోలింగుతో మొదటి రోజుతో పోల్చితే.. రెండవ రోజుకు వకీల్ సాబ్ కలెక్షన్లు కొంత తగ్గాయంటున్నారు.  రాజకీయంగా తమకు ప్రత్యర్థిగా ఉన్న పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగుకు పాల్పడుతున్నారు. వకీల్ సాబ్ కలెక్షన్లు తగ్గించడమే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురు అమ్మాయిలకు న్యాయం చేస్తారు లాయర్ గా పవన్ కల్యాణ్. అయితే సినిమాలో ముగ్గురు అమ్మాయిలకు న్యాయం చేసిన పవన్ కల్యాణ్.. నిజ జీవితంలో మాత్రం ముగ్గురు అమ్మాయిలను మోసం చేశారంటూ వైసీపీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పవన్ వివాహలకు సంబంధించి గతంలో ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు. సినిమాలో  పవన్ కల్యాణ్ డైలాగులకు కౌంటర్లుగా మీమ్స్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.  అంతేకాదు గతంలో పవన్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన పూనమ్ కౌర్ పేరుతో  ఉన్న ఫేక్ ట్వీట్లను వైరల్  చేశారు. అందులో పూనమ్ కౌర్..  పవన్ కళ్యాణ్‌ను దారుణంగా ట్రోల్ చేసినట్టుంది. మంచి సినిమాలు చేస్తే.. మంచి పాత్రలు పోషిస్తే.. లోపల ఉన్న లక్షణాలు పోతాయా? అని చేసిన కర్మ ఊరికే పోతుందా? అని రకరకాలు ట్వీట్లు వేసింది. కానీ అవి తాను వేయలేదని అవన్నీ ఫేక్ అని పూనమ్ క్లారిటీ ఇచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎవరు చేసినా ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ డిఫేమింగ్ ఆర్గనైజ్డ్ ట్రెండ్ ఏంటో? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కుళ్ళు రాజకీయాలు? అమ్మాయిలను డిఫేమ్ చేసి రాజకీయాలు చేస్తే తప్పు కాదు. అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లెమ్ ఎవరికి అంటూ ప్రశ్నించింది. సినిమా - రాజకీయాల మధ్య సంబంధం అనేది ప్రజలకు ఉపయోగపడాలి. . సినిమా- రాజకీయం కలిసి కాపురం చెయ్యకపోతే ఫీల్ అయ్యేది మాత్రం చూస్తున్న జనాలు. అందుకే కుళ్లు రాజకీయాలు మానేయాలి అంటూ పునమ్ ఫైరైంది.  వకీల్ సాబ్ సినిమాకు మొదటి నుంచి అడ్డంకులే స్పష్టిస్తోంది జగన్ రెడ్డి సర్కార్. మాములుగా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే.. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది. గతంలో చాలా సినిమాలకు ఈ అవకాశం వచ్చింది. కాని పవన్ కల్యాణ్ వకీల్ సాబ్‌ పై కక్ష కట్టిన జగన్ సర్కార్.. బెనిఫిట్ షోలు రద్దు చేసింది. ఇందు కోసం ఏపీలోని అధికారులు కొన్ని జీవోలను విడుదల చేశారు. టికెట్ల బుకింగ్ ముగిశాకా బెనిఫిట్ షోలు రద్ద చేయడం రచ్చగా మారింది. అంతేకాదు గతంలో చాలా సినిమాలకు మూడు రోజుల పాటు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చారు. గత నెలలో విడుదలైన ఉప్పెన సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచారు. ఇప్పుడు వకీల్ సాబ్ కు మాత్రం జగన్ సర్కార్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు.  ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెట్టి.. అంతకు మించి అమ్మినా, పెంచినా.. థియేటర్ లైసెన్స్‌లు క్యాన్సిల్ చేస్తామని అధికారులు బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుందని, రాజకీయ కక్షను సినిమా మీద చూపిస్తున్నారని అభిమానులు డా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ తీరుపై  వకీల్ సాబ్ సినిమా టిక్కెట్లకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు కొందరు ఏపీ హైకోర్టు‌ను ఆశ్రయించారు. కోర్టు వారికి సానుకూలంగా తీర్పును ఇస్తూ ఆర్డర్స్ జారీ చేసింది.. మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చారు. ఏపీలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్స్‌కు, అలాగే ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చారు.  వైసీపీ ప్రభుత్వం పవన్ మీద కక్ష సాధిస్తోందని ఫ్యాన్స్  అంటుంటే.. సినిమాటోగ్రఫీ యాక్ట్‌ ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. 'మీకు దురద ఉందని, మోజు ఉందని తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తే షో వెయ్యరు సునీల్ గారు' అంటూ ఎద్దేవా చేశారు. స్పెషల్ షోకు పర్మీషన్ ఇవ్వలేదని సునీల్ దియోధర్ ఏడుస్తున్నారని.. అసలు ఆ షోకు ఆ టికెట్ రేటు ఎంతో తెలుసా అని ప్రశ్నించారు పేర్నీ నాని. అయితే ఏం దురద వచ్చిందని గతంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారని పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. గత నెలలో విడుదలైన సినిమా టికెట్లు పెంచుకునేలా ఎందుకు అవకాశం ఇచ్చారో మంత్రి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రిగారి నీతులు అందరికి వర్తిస్తాయా లేక కొందరికేనా అంటూ సెటైర్లు వేస్తున్నారు జన సైనికులు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా.. వకీల్ సాబ్ రికార్డులను ఆపలేరని చెబుతున్నారు. 

జగన్‌కి ఓటమి భయమా? అందుకే తిరుపతి పర్యటన రద్దా?

ఈ నెల 14న ముఖ్యమంత్రి జగన్ తిరుపతి పర్యటన. 10 రోజుల క్రితమే ప్రకటన వెలువడింది. సీఎం వస్తారంటూ వైసీపీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగుతానన్నారు. కానీ, అంతలోనే ఏమైందో ఏమో గానీ, కరోనా సాకుతో తిరుపతి ప్రచారం నుంచి సైడ్ అయిపోయారు జగన్‌రెడ్డి.  నిజంగా కరోనా కేసులే కారణమా? వారం క్రితమూ కొంచెం అటూఇటూగా ఇన్నే కేసులు ఉన్నాయి. అయినా, పర్యటన వాయిదా వేసుకోలేదు.ఇటీవలే పరిషత్ ఎన్నికలు జరిగాయి. వైసీపీ నేతలంతా జోరుగా ప్రచారం చేశారు. అప్పడు లేని సమస్య ఇప్పుడే వచ్చిందా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడే సడెన్‌గా సీఎం జగన్ ఎందుకు తిరుపతి టూర్‌కు డుమ్మా కొట్టినట్టు? అనే అనుమానం ప్రజల్లో.  ఓటమి భయమే జగన్‌ను తిరుపతి వచ్చేలా టెంప్ట్ చేసిందని.. ఇప్పుడు అదే ఓటమి భయం సీఎంను తిరుపతి టూర్‌కు డుమ్మా కొట్టేలా చేసిందని అంటున్నారు.  ఇంటెలిజెన్స్ సర్వేలో వైసీపీ కేండిడేట్ గురుమూర్తికి గెలుపు అవకాశాలు తక్కువేనంటూ నివేదికలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. తనకు పాదసేవ చేశాడనే ఏకైక కారణంతో ప్రజలకు పెద్దగా పరిచయంలేని ఫిజియోథెరపిస్టు గురుమూర్తిని పోటీలో నిలపడంపై ఓటర్లు పెదవి విరిచారు. ప్రచారంలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు టీడీపీ ఎన్నికల ప్రచారంలో దుమ్ము రేపుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు తిరుపతిలోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్‌లకు తిరుపతిలో అడుగడుగునా ప్రజలు నుంచి విశేష స్పందన వస్తోంది. టీడీపీలో గెలుపు ధీమా పెరిగింది.  అటు, బీజేపీ-జనసేన కూటమి సైతం ప్రచారంలో దూసుకుపోతోంది. రత్నప్రభకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేశారు. కమలనాథులు క్షేత్ర స్థాయిలో చాపకింద నీరులా ప్రచారం చేసుకుపోతున్నారు. టీడీపీ, బీజేపీలో హోరాహోరీగా పోటీపడుతుండగా.. వైసీపీ చాలా వెనకబడింది. అయినా, 5లక్షల మెజార్టీ అంటూ అధికార పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. గురుమూర్తి గెలుపు కష్టసాధ్యం కావడంతో జగన్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఒకవేళ తాను ప్రచారం నిర్వహించినా వైసీపీ అభ్యర్థి ఓడిపోతే తన పరువు పాతాళానికి పడిపోతుందని భయపడుతున్నారట. అందుకే, ఎందుకైనా మంచిదని తిరుపతి ప్రచారం విషయంలో పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. కరోనా కేసులను సాకుగా చూపి.. తిరుపతికి రాలేనంటూ లేఖ రాసి.. హమ్మయ్యా అని చేతులు దులిపేసుకున్నారని భావిస్తున్నారు.

జలం కోసం జగన్‌తో జగడమేనా? చెల్లికి అంత సీనుందా?

చెల్లమ్మ పార్టీ పెడితే అన్నయ్యకు సంబరముండాలి. కానీ, షర్మిలమ్మ పార్టీ పెట్టక ముందే జగనన్నకు వార్నింగ్‌లు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏమాత్రం వెనకాడనంటూ హెచ్చరిస్తోంది. "మాట మీద నిలబడే వైఎస్ఆర్ బిడ్డగా చెప్తున్నా.. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, ఏ పనినైనా అడ్డుకుంటా" అంటూ ఖమ్మం సభ సాక్షిగా ఇటు ఏపీకి, అటు జగన్‌కు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది వైఎస్ షర్మిల.  అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్‌తో సఖ్యతగా మెదిలారు జగన్. ఏళ్లుగా నడుస్తున్న జల జగడాలకు ముగింపు పలకాలని భావించారు. మంత్రులు, అధికారులు తదతర మందీమార్బలంతో ప్రగతిభవన్ వెళ్లి మరీ, మీటింగుల మీద మీటింగులు పెట్టుకున్నారు. తీరా తుదకు వచ్చేసరికి అంతా తుస్సుమంది. జల జగడం మళ్లీ మొదటికొచ్చింది. కేసీఆర్‌తో జగన్‌కు నీళ్ల పంచాయితీ మళ్లీ మొదలైంది.  కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కడుతోంది తెలంగాణ. రోజుకు 2 టీఎంసీలు లిఫ్ట్ చేయడం ఆ ప్రాజెక్ట్ లక్ష్యం. అటు, ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ పదే పదే అడ్డుపుల్ల వేస్తోంది. పోతిరెడ్డిపాడు వివాదంతో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. కృష్ణా జలాల కోసం ఇరు రాష్ట్రాల మధ్య వార్‌ మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ తీసుకున్న నిర్ణయం కాంట్రవర్సీకి కారణమైంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ సర్కార్‌ మండిపడుతోంది. అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టులు ఎలా కడతారని  కేసీఆర్ ఫైర్‌ అయ్యారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజుకుంది. తెలంగాణ సర్కార్‌ ఆరోపణలపై ఏపీ సీఎం జగన్ కూడా సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. తమకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు తమ భూభాగంలో ప్రాజెక్టు కట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఏపీకి కేటాయించిన నీటిని తీసుకోవడానికే పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటున్నామన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి నీళ్లులేని పరిస్థితి ఉందన్నారు. దీనిపై మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని కేసీఆర్‌ను కోరారు జగన్. ఇలా ఏపీ, తెలంగాణ మధ్య వాటర్ వార్ జరుగుతున్ననేపథ్యంలో.. త్వరలోనే కొత్త పార్టీతో రాజకీయాల్లోకి రానున్న షర్మిల.. మొదట్లోనే నీటి మంటను రాజేవారు. అన్న ప్రాసనలోనే ఆవకాయ పచ్చడి అన్నట్టు.. తొలి సభలోనే జల జగడాన్ని మరింత రాజేశారు. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, ఏ పనినైనా అడ్డుకుంటానంటూ పరోక్షంగా ఏపీకి, జగన్‌కి వార్నింగ్ ఇచ్చారు. జగన్‌నే ఎదిరించే ధైర్యమా చెల్లెలికి? ఏపీ నోటి కాడి నీటిని అడ్డుకునే సాహసమా షర్మిలకి? ఏపీకి చెందిన వైఎస్సార్ కూతురికి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరికి.. ఆంధ్రప్రదేశ్‌పై ఎందుకంత ధ్వేషం? తెలంగాణ రాజకీయాల్లో రాణించాలంటే ఆంధ్రకు అన్యాయం చేయడానికి సిద్ధమవ్వాలా? ఏ కృష్ణా జలాల కోసమైతే కేసీఆర్‌తో జగన్ పోరాడాలని అనుకుంటున్నారో.. అవే కృష్ణా వాటర్‌ను ఏపీకి దక్కకుండా అడ్డుకోవడానికి అన్నతో చెల్లి ఫైటింగ్ చేస్తుందా? షర్మిలకు అంత సీన్ ఉందా? జగన్‌తో తలపడేంత ధైర్యం ఉందా? అంత సాహసానికి తెగిస్తుందా? రాఖీ కట్టిన అన్నయ్యను రచ్చ కీడుస్తుందా? చెల్లే కదాని జగనన్న తగ్గుతారా? తగ్గేదేలే అంటూ తుదకంటూ పోరాడుతారా? లేక, ఇదంతా అన్నాచెల్లెల్లు కలిసి ఆడుతున్న రాజకీయ డ్రామానా?

బస్సు లో 3 కోట్లు.. కిలో బంగారం..  

కర్నూలు పంచలింగాల చెక్‌పోస్టు  వద్ద రూ.3.05కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సులో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు తరలిస్తుండగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును పోలీసులు సీజ్‌ చేశారు. డబ్బు తరలిస్తున్న బెంగళూరుకు చెందిన చేతన్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని రామచంద్ర వైద్య కళాశాలకు చెందిన నగదుగా నిందితుడు చెప్పినట్టు  కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. మరో బస్సులో కిలో బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఇంటర్నేషనన్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో 1.36 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానంలోని వాష్ రూమ్ క్లీన్ చేస్తుండగా విమాన సిబ్బంది బంగారాన్ని గుర్తించారు. వెంటనే సిబ్బంది.. కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు విమానంలో బంగారం ఎవరు దాచారనే విషయంపై ఆరా తీస్తున్నారు.    

సీఎం జగన్ తిరుపతి పర్యటన రద్దు.. ఎందుకంటే...

సీఎం జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. కొవిడ్ కేసుల కారణంగా తను తిరుపతి పర్యటనను క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.  కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున తాను తిరుపతి రాలేకపోతున్నానని లేఖలో తెలిపారు. 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించారు. అందులో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్లు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లాలో కూడా ఒక్కరోజులోనే 292 కేసులు వచ్చాయన్నారు. ఇవాళ కరోనా బులెటిన్‌ చూశాక.. తిరుపతి నియోజకవర్గ ప్రజలకు లేఖ రాస్తున్నా అన్నారు.  ‘‘మీరంతా నా వాళ్లే.. నేను సభకు హాజరైతే వేలాది మంది వస్తారు. మళ్లీ కోవిడ్‌ కేసులు పెరిగే ప్రమాదం ఉంది’’ అని లేఖలో రాశారు. బాధ్యతగల సీఎంగా తిరుపతిలో సభ రద్దు చేసుకుంటున్నానని తెలిపారు. ఇటీవల తాను రాసిన లేఖలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ వివరించానన్నారు. వాటిని గమనించి తన సోదరుడు గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.