ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
posted on Apr 7, 2021 @ 1:16PM
దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఏకంగా 630 మంది మృతి చెందారు. ఒక్క రోజులో ఇంత మంది చనిపోవడం ఇదే రికార్డు. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ గఢ్ లో కరోనా తీవ్రత అత్యంత దారుణంగా తయారైంది. బెంగళూరు, ఢిల్లీలోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్యయంగా ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. కరోనా నిబంధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు.
కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీ హైకోర్టు కరోనా కట్టడికి పలు సూచనలు చేసింది. మాస్క్‌ను సురక్షణ కవచంగా పేర్కొంటూ, ఎవరైనా సరే కారులో ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నప్పటికీ వారు కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. మాస్క్ అనేది కోవిడ్-19 వైరస్‌ను అడ్డుకుంటుందని తెలిపింది. కాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం నైట్‌కర్ఫ్యూను విధించింది. కరోనా వైరస్ చైన్ తెగ్గొట్టేందుకు నైట్ కర్ఫ్యూ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఢిల్లీలో మాస్క్ పెట్టుకోని వారి నుంచి రెండు వేల రూపాయల జరిమానా వసూలు చేస్తున్నారు.