టీఆర్ఎస్ లో టీడీఎల్పీ విలీనం
posted on Apr 7, 2021 @ 7:38PM
తెలంగాణలో తెలుగు దేశం పార్టీ అధికార పార్టీలో విలీనం అయింది. టీఆర్ఎస్ లో తెలంగాణ టీడీపీ శాసనాసభా పక్షాన్ని విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు ప్రకటించారు. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శాసనసభా వ్యవహరాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో మెచ్చా నాగేశ్వరరావు సమావేశమయ్యారు. అనంతరం మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి లేఖ అందించారు. టీడీపీ శాసనాసభా పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌కి లేఖ ఇచ్చారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగు దేశం పార్టీ నుంచి ఇద్దరు గెలిచారు.సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వర్ రావు గెలిచారు. అయితే గెలిచిన కొన్ని రోజుల నుంచే టీఆర్ఎస్ కు మద్దతుగా ఉంటున్నారు సండ్ర. అధికారికంగా టీఆర్ఎస్ లో చేరకపోయినా.. ఆ పార్టీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు. గతంలోనే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరిగినా... మెచ్చా ఖండించారు.తాను తెలుగు దేశం పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. అయితే కొంత కాలంగా మాత్రం మెచ్చా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
తాజాగా మెచ్చా నాగేశ్వరరావు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన మెచ్చా... టీఆర్ఎస్ లో చేరారు. బుధవారం అసెంబ్లీ స్పీకర్ ను కలిసి టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు లేఖ ఇచ్చారు. లేఖను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కల్సి స్పీకర్‌కు అందించారు మెచ్చా నాగేశ్వరరావు.