ఇదిగో కోబ్రా కమెండో ఫోటో.. మరి, విడుదల?
posted on Apr 7, 2021 @ 4:29PM
ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్‌లో కోబ్రా కమాండర్ మిస్సింగ్. అతను మా దగ్గరే బందీగా ఉన్నాడంటూ మావోయిస్టుల స్టేట్‌మెంట్. ఇదిగో సాక్షం అంటూ కోబ్రా కమాండర్ రాకేశ్‌సింగ్ ఫోటో రిలీజ్ చేశారు మావోయిస్టులు.
అడవిలో తాటాకుల గుడిసె. నేలపై ప్లాస్టిక్ కవర్. కోబ్రా యూనిఫాం వేసుకొని.. కింద కూర్చొని.. కులాసాగా కనిపిస్తున్నాడు ఆ కమెండో. మావోయిస్టుల చెరలో బందీగా ఉన్నాననే భయం అతని కళ్లల్లో కనిపించడం లేదు. ధైర్యంగా, క్షేమంగా ఉన్నాడు రాకేశ్‌సింగ్.
చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే బందీగా ఉన్న జవాన్‌ను విడిచిపెడతామని షరతు పెట్టారు మావోయిస్టులు. వాళ్లు విడుదల చేసిన లేఖలో మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ‘ఆపరేషన్ ప్రహార్-3’ పేరుతో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, దేశంలో హక్కుల ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రభుత్వాలు, పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. పోలీసుల కూంబింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని మావోలు లేఖలో డిమాండ్ చేశారు.
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భీకర కాల్పుల తర్వాత కోబ్రా యూనిట్‌కు చెందిన రాకేశ్వర్‌సింగ్ అనే జవాన్ కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన బందీగా ఉన్న ఫోటోను విడుదల చేశారు మావోయిస్టులు. చర్చలకు మధ్యవర్తులు ఎవరో చెబితే విడుదలపై ప్రకటన చేస్తామని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో పోలీసుల కూంబింగ్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ సరిహద్దుల్లోనే అప్పగించే యోచనలో మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది.