క్వారంటైన్ తో ప్రచారానికి డుమ్మా! వకీల్ సాబ్ పై రాజకీయ రచ్చ 

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఏపీలో రాజకీయ కాక రేపుతోంది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. లోక్ సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా.. నియోజకవర్గానికే మంత్రిని ఇంచార్జ్ గా నియమించారు సీఎం జగన్. మండలానికో ఎమ్మెల్యేను మోహరించడంతో వారంతా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న రత్నప్రభ ప్రచారం మాత్రం మిగితా పార్టీలంతా స్పీడుగా సాగడం లేదని అంటున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్  ఒక రోజు రోడ్ షో నిర్వహించి..  మళ్లీ తిరుపతి వైపు చూడటం లేదు. ప్రచార గడువు ముగుస్తున్న సమయంలో పవన్ హోం క్వారంటైన్ లో ఉన్నారని జనసేన ప్రకటన విడుదల చేయడంతో బీజేపీ ఒక్కసారిగా షాకైంది.  తన వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా సోకినందున డాక్టర్ల సలహా మేరకు పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లో ఉన్నారని జనసేన చెబుతోంది. అయితే కరోనా సాకుతో పవన్ కల్యాణ్ కావాలనే క్వారంటైన్ లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. తిరుపతిలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం ఇష్టం లేకే వకీల్ సాబ్ అలా ఉండిపోయారని సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. కరోనా భయపెడుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. తిరుపతిలో ప్రచారం చేసిన కొందరు టీడీపీ నేతలకు కరోనా నిర్ణారణ అయినా.. చంద్రబాబు మాత్రం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రోడు షోలు నిర్వహిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా జోరుగా జనాల్లోకి వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సాకుతో పవన్ కల్యాణ్.. తిరుపతి ప్రచారానికి దూరంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.  తిరుపతి ఉప ఎన్నిక విషయంలో మొదటి నుంచి బీజేపీ-జనసేన మధ్య విభేదాలు వచ్చాయి. తిరుపతిలో తామే పోటీ చేయాలని జనసేన గట్టిగా ప్రయత్నించింది. గత ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకంటే తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ లెక్కలన్నీ ముందేసింది. ఢిల్లీకి వెళ్లి మరి పవన్ కల్యాణ్... బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. తిరుపతిలో పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. తర్వాత ఏమైందో ఏమో పవన్ వెనక్కి తగ్గారు. తిరుపతిలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పారు. పోటీపై పవన్ వెనక్కి తగ్గడంపైనా పలు రకాల చర్చలు జరిగాయి. ఏపీ జనాలు బీజేపీపై గుర్రుగా ఉన్నందువల్లే తిరుపతిలో జనసేన పోటీ చేయలేదనే చర్చ జరిగింది. కొన్ని రోజుల తర్వాత బీజేపీతో జనసేనాని తెగతెంపులు చేసుకుంటారని చెప్పారు. ఇందుకు అనుగుణంగానే ఏపీలో రాజకీయ పరిణామాలు జరుగుతూ వచ్చాయి. కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు.. బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పార్టీలు అవగాహనతో బరిలో నిలిచాయి. గోదావరి జిల్లాలో మంచి ఫలితాలు కూడా సాధించాయి. వకీల్ సాబ్ సినిమా విషయంలోనూ ఏపీ సర్కార్ తీరును ఎండగట్టారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ పై వైసీపీ కక్ష కట్టిందని మండిపడ్డారు.  తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీకి దూరంగా ఉండటమే బెటరన్న ఆలోచనకు పవన్ వచ్చారంటున్నారు. అందుకే కరోనాను సాకుగా చూపి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ దూరంగా ఉంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.   పవన్ కల్యాణ్ తాజా సినిమా వకీల్ సాబ్ వివాదం ఏపీలో రాజకీయంగా దుమ్ము రేపుతోంది. మూవీ రిలీజ్‌కు ముందే వకీల్ సాబ్‌కు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ సర్కారు. బెనిఫిట్ షోలు రద్దు చేసింది. సినిమా టికెట్ల రేట్లను పెంచకుండా చేసి రివేంజ్ తీసుకుంది. ఇది కూడా పవన్ కల్యాణ్ తిరుపతి ప్రచారానికి రాకుండా ఉండటానికి కారణమంటున్నారు. రాజకీయ వివాదాలతో తన సినిమా ఇబ్బందులో పడితే... సినిమా యూనిట్ కు నష్టాలు వచ్చే అవకాశం ఉందని కూడా పవన్ భావించారని అంటున్నారు. అందుకే తిరుపతి ప్రచారానికి దూరంగా ఉంటున్నారని అంచనా వేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.  ఆంధ్రప్రదేశ్  బీజేపీలో రెండు వర్గాలున్నాయనే ప్రచారం ముందునుంచి సాగుతోంది. ఇందులో ఓ వర్గం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా ఉంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. టీడీపీపై ఆరోపణలు చేయడం ఈ వర్గం పని. వైసీపీకి అనుకూలంగా ఉండే వర్గం... తిరుపతిలో పవన్ కల్యాణ్ ప్రచారం చేయకుండా కుట్రలు చేస్తుందని అంటున్నారు. వాళ్లే పవన్ కల్యాణ్ ప్రచారానికి రాకుండా ఎత్తులు వేశారని చెబుతున్నారు. 

వారంలో 9 లక్షల కరోనా కేసులు.. మరో టీకాకు కేంద్రం అనుమతి 

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. రెండో దశలో మరింత వేగంగా విరుచుకుపడుతోంది. కేవలం వారం రోజుల్లోనే దేశంలో 9లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత  ఆరు రోజులుగా నిత్యం లక్షకు పైనే  కేసులు వస్తున్నాయి. ఏప్రిల్‌ 5 నుంచి ఏప్రిల్‌ 11 వరకు.. ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా 9,38,650 కొత్త కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 1.34లక్షల కేసులు వెలుగుచూస్తున్నాయి. అంతక్రితం వారంతో పోలిస్తే గతవారం కొత్త కేసుల సంఖ్య 70శాతం పెరిగింది. దేశంలో తొలిసారి ఏప్రిల్‌ 4న రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఆ తర్వాత ఏప్రిల్‌ 5 మినహా గత ఆరు రోజులుగా  లక్షపైనే కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో వైరస్‌ పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్కడ ఆదివారం ఒక్కరోజే 62వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కొత్త కేసుల్లో 83శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌లలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.    దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 12లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12,01,009 క్రియాశీల కేసులున్నాయి. ఏప్రిల్‌ 5 నాటికి 7.41లక్షలుగా ఉన్న యాక్టివ్‌ కేసులు వారం రోజుల్లోనే నాలుగున్నర లక్షలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా తొలి దశ తీవ్రంగా ఉన్న గతేడాది సెప్టెంబరులో యాక్టివ్‌ కేసుల సంఖ్య గరిష్ఠంగా 10.17లక్షలకు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టి.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న 1.33లక్షలకు పడిపోయింది.  దేశంలో 24 గంటల్లో మరో 903 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1.70లక్షలు దాటింది. ఒక రోజులో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం గతేడాది అక్టోబరు తర్వాత మళ్లీ ఇప్పుడే.  కరోనా తొలి దశ సమయంలో గతేడాది సెప్టెంబరులో అత్యధికంగా 1200ల రోజువారీ మరణాలు నమోదయ్యాయి. అంతక్రితం వారంతో పోలిస్తే మరణాల సంఖ్య కూడా 70శాతం పెరగడం కలవరపెడుతోంది.  ప్రపంచవ్యాప్తంగా ఆదివారం 6.32లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. భారత్‌లో ఆ సంఖ్య 1,68,912గా ఉంది. మొత్తం కేసుల్లో ఇది దాదాపు 27శాతానికి సమానం. ప్రపంచవ్యాప్తంగా తాజాగా నమోదవుతున్న ప్రతి ఆరు కరోనా కేసుల్లో ఒకటి భారత్‌లోనే ఉండటం ఆందోళనకరం. మొత్తం కేసుల పరంగా బ్రెజిల్‌ను దాటేసి భారత్‌ రెండో స్థానానికి చేరింది. వరల్డో మీటర్‌ గణాంకాల ప్రకారం.. అమెరికాలో అత్యధికంగా 3.19కోట్ల మందికి వైరస్‌ సోకగా.. భారత్‌లో ఆ సంఖ్య 1.35కోట్లుగా ఉంది. బ్రెజిల్‌లో 1.34కోట్ల మంది వైరస్‌ బారినపడ్డారు.    భారత్‌లో మరో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి లభించింది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటం, వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత ఉండటంతో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన చేసిన ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు. డీజీసీఐ అనుమతి లభిస్తే, దేశంలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనికా కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ తర్వాత అనుమతి లభించిన మూడో వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ అవుతుంది.   రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసి, విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ‘స్పుత్నిక్‌ వి’ టీకాపై మనదేశంలో రెండు, మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ఇటీవలే ఆ సంస్థ నిర్వహించింది. ఆ పరీక్షల భద్రత, ఇమ్యునోజెనిసిటీ సమాచారాన్ని ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలికి అందజేసిన డాక్టర్‌ రెడ్డీస్‌‌.. టీకా ఉత్పత్తి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకుంది. సోమవారం ఈ డేటాను కేంద్ర నిపుణుల బృందం విశ్లేషించి, అత్యవసర వినియోగానికి సిఫారసు చేసింది.    

ఫేక్ ఎమ్మార్పీ స్టిక్కర్లతో సేల్.. ఏపీలో మందుబాబులు నిలువు దోపిడి 

ఆంధ్రప్రదేశ్ లో మందు బాబులు నిలువు దోపిడికి గురవుతున్నారు. జగన్ సర్కార్ కాసుల దందాతో ఇప్పటికే మద్యం రేట్లు డబుల్ అయ్యాయి. అసలే అధిక ధరలతో జేబుకు చిల్లుపడుతుంటే.. ఇప్పుడు నకిలీ ఎమ్మార్పీలతో మందబాబులను నిండా ముంచేస్తున్నారు. వైఎస్ జగన్ సర్కార్ రాగానే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. గతంలో మద్యం దుకాణాలను ప్రవేట్ వ్యక్తులు నడిపగా..  ప్రభుత్వమే నడపడంతో పాటు ధరలను పెంచుతూ కొత్త పాలసీని తీసుకువచ్చింది. మద్యం దుకాణాల సంఖ్యను 4,383 షాపు ల నుండి 2,900 షాపులకు తగ్గించింది.  ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాతే అసలు కథ ప్రారంభమైంది.  ప్రభుత్వ మద్యం దుకాణాలలోని సిబ్బంది అక్రమాలకు తెర తీశారు, మొదట్లో బ్రాండెడ్ మద్యాన్ని బార్లకు, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తు కాసులు దండుకున్నారు. ఇప్పుడు ఆ పరిధిని కూడా దాటుకొని కొత్త దందాకు తెరతీశారు. నకిలీ ఎమ్మార్పీలతో  మందుబాబులను అడ్డంగా దోచుకుంటున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న చీప్ లిక్కర్ బాటిళ్లపై సొంత ఎమ్మార్పీ స్టిక్కర్లు అంటిస్తూ వస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం తమిరశ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. అక్కడ మద్యం షాపుల్లో కొత్త ఎమ్మార్పీ రేట్లతో లిక్కర్ సేల్ చేస్తున్నారు. దరలు ఒక్కసారిగా పెరగడంతో కొందరు మందుబాబులు ప్రశ్నించినా... రేటు పెరిగింది కావాలా వద్దా అంటూ బుకాయిస్తూ వచ్చారు మద్యం షాపు సిబ్బంది.  అయితే ఇటీవల ఓ వ్యక్తి  దర తేడాను గమనించారు. ఇతర గ్రామాలకు తమిరశ షాపులో రూ.40 తేడా ఉంది. దీనిపై నిలదీయగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో అతను ఈ విషయం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. గుడివాడ నుంచి వచ్చిన ఎక్సైజ్ అధికారులు దాడుల చేయగా.. 9 వేల ఎమ్మార్పీ స్టిక్కర్లు లభించాయి. దీంతో ఆరుగురు వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేశారు. నకిలీ ఎమ్మార్పీ అంశంపై విచారణ చేయగా ఇది చాలాకాలంగా జరుగుతుందని నిర్ధారణకు వచ్చారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. కొత్త లిక్కర్ పాలసీ ఎక్సైజ్ అధికారులు, మద్యం షాపులు నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. పలు చోట్ల షాపులు తగ్గడం, బార్లలో ధరలు ఎక్కువ ధరలు ఉండటంతో ప్రభుత్వ మద్యం షాపులపైనే మందుబాబులు ఆధారపడుతున్నారు. దీన్నే ఎక్సైజ్ సిబ్బంది అలుసుగా తీసుకొని జనాన్ని దోచేస్తున్నారు. ఒక్కో షాపు రోజుకు రూ.12 వేల వరకు ఆన్ ఆఫీషియల్‌గా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం అంతా ఎక్సైజ్ అధికారుల సాయంతోనే జరుగుతున్నట్లు సమాచారం. ఈ అక్రమ సంపాదనలో స్థానిక ఎక్సైజ్ సిబ్బందికి వాటాలు వెళ్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలకు కూడా అక్రమ సంపాదనలో వాటా వెళుతుందనే ప్రచారం జరుగుతోంది.   

చావడానికైనా సిద్ధం.. వీహెచ్ సంచలనం

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కోసం చావడానికైనా తాను సిద్ధమని ప్రకటించారు. గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని తక్షణమే తమకు ఇవ్వాలంటూ సోమవారం తన ఇంట్లోనే ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పోలీసులు, కేసీఆర్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు వీహెచ్.  అంబేద్కర్ విగ్రహం విషయంలో రెండేళ్లుగా పోరాడుతున్నారు హనుమంతరావు. చాలా సార్లు అరెస్ట్ కూడా అయ్యారు. 2019 ఏప్రిల్ 12న పంజాగుట్టలో తాను అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించానని.. ఏప్రిల్ 13న విగ్రహాన్ని కూల్చేశారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి అంబేడ్కర్ విగ్రహాన్ని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని, అప్పటి నుంచి అక్కడే ఉందన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్‌లో పెడతారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంత జరిగినా ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు మాట్లాడటం లేదని వాపోయారు. షర్మిల రాజన్న రాజ్యమంటుందని, కానీ అది కాంగ్రెస్ రాజ్యమన్నారు. రాజ్యాంగ అధినేతకు తెలంగాణలో దిక్కు లేదని, విగ్రహం ఇచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు. 

తెలంగాణ మంత్రికి కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఎవరీని వదలడం లేదు వైరస్. నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు కరోనా సోకింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి వైరస్ నిర్దారణ అయింది. తాజాగా ఓ మంత్రికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.  గత రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో మంత్రి టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా సోకిందన్న విషయాన్ని  స్వయంగా మంత్రే వెల్లడించారు. గత రెండు, మూడు రోజులుగా వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.  తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 2,251 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ వల్ల ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,29,529కి చేరుకుంది. కరోనాతో మొత్తం 1,765 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 21,864 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 3,05,900 మంది రికవరీ అయినట్లు సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసినహెల్త్ బులిటెన్‎లో పేర్కొంది. మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్ రావు స్పందించారు. తెలంగాణలో 4 లక్షల 64 వేల డోసుల స్టాక్ ఉందన్నారు. సోమవారం రాత్రికి తెలంగాణాకు 3 లక్షల 62 వేల డోసులు రానున్నాయి. మరో ఐదు రోజులకు సరిపడా వ్యాక్సిన్ స్టాక్ ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 22 లక్షల 14, 270 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్ రావు  తెలిపారు. 

ఎంపీ కుటుంబాన్ని జగన్ అవమానించారు! 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు టీడీపీ నేతలు.  దళితుల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్‌కు లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ముఖ్యమంత్రి దళితుల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలను వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. తిరుపతి దళిత ఎంపీ దుర్గా ప్రసాద్ చనిపోతే.. ఆయన  కుటుంబాన్ని జగన్ పరామర్శించలేదని ఆరోపించారు.   సిట్టింగ్ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఇచ్చే ఆనవాయితీని కూడా పట్టించుకోలేదని నక్కా ఆనందబాబు. దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకుని బెదిరించారని, ఎమ్మెల్సీ ఇస్తాం పొండి అని చెప్పి పంపారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఫిజియో తెరపి చేస్తున్న ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో వారిపైనే  కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.  తిరుమలలో ఓ కార్యక్రమంలో నారాయణస్వామిని నిల్చో బెట్టి  జగన్ అవమానించారని, దళితుల హక్కులను కాలరాస్తున్నారని నక్కా ఆనందబాబు విమర్శించారు. ఆర్థిక సమానత్వం పేరుతో రిజర్వేషన్‌ను తొలగించాలని సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దళిత విద్యార్థుల కోసం చంద్రబాబు రూ. 1050 కోట్లు ఇస్తే... దాన్ని ముఖ్యమంత్రి జగన్ రూ. 750 కోట్లకు కుదించారన్నారు. స్టడీ సర్కిళ్లు ఉన్నపుడు దళిత పిల్లలు ఐఎఎస్, ఐపిఎస్ అయ్యేవారని, ఉన్న మూడు స్టడీ సర్కిళ్లను ప్రభుత్వం మూసివేసిందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అవమానించటం అంటే అంబేద్కర్‌ను అవమానించటమేనని, దళిత సంఘాలు ఆలోచించుకోవాలని, తిరుపతి ఉప ఎన్నికలో సీఎం జగన్‌కు బుద్ధి చెప్పాలని నక్కా ఆనంద్ బాబు పిలుపు ఇచ్చారు. తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే.. అప్పుడు ఆ పార్టీకి ప్రజలంటే భయం పుట్టుకొస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాన్ని దోచుకునే బందిపోటు ఏదైనా ఉందటే అది వైసీపీ ప్రభుత్వమేనని తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచడమేనా మీ రాజన్న రాజ్యమంటూ? అంటూ జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై విద్యుత్ భారాన్ని రూ. 40వేల కోట్లు చేసిందని.. టీడీపీ హయాంలో రూ. 200 బిల్లు వస్తే.. ఇప్పుడు ఏకంగా 2వేలు వస్తోందని ఆయన మండిపడ్డారు. స్లాబుల పేరుతో మాయ చేసి రూ.1500 కోట్లు భారం మోపారని.. గ్రామాల్లో అనధికార కోతలు విధిస్తూ ప్రజల్ని జగన్ సర్కార్ వేధిస్తోందని.. రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు లేకుండా చేస్తున్నారంటూ గోవిందరెడ్డి ధ్వజమెత్తారు.  

వకీల్ సాబ్ పై ట్విట్టర్ వార్..నాగబాబు ఎంట్రీతో హీట్

ఏపీలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం హాట్ హాట్ గా సాగుతుండగా... అదే స్థాయిలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై పొలిటికల్ వార్ కాక రేపుతోంది. వకీల్ సాబ్ బెనిఫిట్ షోల రద్దు, టికెట్ రేట్ల పంపుకు అనుమతి నిరాకరణ వ్యవహారంపై వైసీపీ, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా నటుడు, పవన్ సోదరుడు నాగేంద్రబాబు వార్ లోకి ఎంటరయ్యారు. వకీలా సాబ్ సినిమా, పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేసిన మంత్రి పేర్నినానిని టార్గెట్ చేశారు నాగబాబు.  ట్విట్టర్ ద్వారా ఘాటు విమర్శలు గుప్పించారు. “మీకు ఏమి అయ్యింది నాని గారు.మీరు కారోనా వాక్సిన్ తో పాటు రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి.ఇట్స్ అర్జంట్.please సెండ్ రాబిస్ వాక్సిన్ to మిస్టర్ నాని.స్టేట్ transposrt మినిస్టర్.వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పెరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ.” అంటూ నాగబాబు కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. నాగబాబు కు ట్విట్టర్ ద్వారానే కౌంటరిచ్చారు మంత్రి పేర్ని నాని.  “పరోపకారి పాపన్న నాగబాబు గారు, పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు రాబిస్ వాక్సిన్ తక్షణ అవసరం వెంటనే వెతికి వేయించండి. ఆలస్యమైతే మీకు కూడా అవసరమౌతుంది. అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు” అంటూ మంత్రి ట్వీట్ చేశారు. నాగబాబు, పేర్ని నాని కౌంటర్లు సాగుతుండగానే.. జనసేన, వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రాజకీయాలను సినిమాతో ముడిపెట్టి కక్ష సాధిస్తున్నారని జనసేన ఆరోపిస్తుంటే.. ఒక్కరి కోసం రూల్స్ మార్చంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది. దీంతో ఏపీలో ఎప్పుడూ లేని విధంగా ఓ స్థాయిలో పొలిటికల్ రచ్చ జరుగుతోంది.  వకీల్ సాబ్ రిలీజ్ రోజున బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ తిరుపతిలోని ఓ సినిమా థియేటర్ కు వెళ్లగా.., అక్కడ షో రద్దుకావడంతో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మండిపడ్డారు. కుట్రపూరితంగానే వకీల్ సాబ్ షోలు రద్దు చేశారని మండిపడ్డారు. మరోవైపు తొలి మూడు రోజులు టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లగా.. ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పువచ్చింది. దీంతో వైసీపీ ప్రభుత్వం వకీల్ సాబ్ పై కక్షసాధింపుకు పాల్పడుతుందని జనసేన, బీజేపీ కార్యకర్తలకు ఆరోపించారు. వీటిపై స్పందించిన మంత్రి పేర్ని నాని.. వకీల్ సాబ్ ఓ పాచిపోయిన సినిమా అంటూ తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు టికెట్ రేట్లు పెంచి జనాల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. 

ఏటీఎం సెంటరే.. స్టడీ రూమ్.. 

ఈ రోజుల్లో తల్లిదండ్రులు బలవంతం చేస్తే కానీ చదవరు. కానీ ఇతను మాత్రం ఒక వైపు ఉద్యోగం చేస్తున్నాడు. మరో వైపు చదువుతున్నాడు. అది ఏ స్టడీ సెంటరో, స్టడీ హలో కదండీ బాబు. తాను ఉద్యోగం చేసే ఏటీఎం సెంటరే తన స్టడీ రూమ్. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియా లో  వైరల్ గా మారింది. ఇతని ఏకాగ్రత, పట్టుదలకు నెటిజన్లు నీ డెడికేషన్‌ లెవల్‌కి నా సలాం కొడుతున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో మాత్రం చదవుకు కావాల్సింది ఆసక్తి, శ్రద్ధ మాత్రమేనని చాటి చెబుతోంది. లక్ష్యాన్ని చేరకోవాలంటే కావాల్సింది ఏకాగ్రత, పట్టుదలేనని నిరూపిస్తూ ఓ యువకుడు తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూనే తనకిష్టమైన చదువును కోనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. తన కుటుంబానికి చదివించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఓ యువకుడు ఏటీఎం కేం‍ద్రంలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. చేసే పని చిన్నదా పెద్దదా అనేది ఆలోచించకుండా తన కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అయితే రాత్రి పూట కస్టమర్ల తాకిడి పెద్దగా ఉండదు కాబట్టి ఆ సమయంలో ఖాళీగా ఉండడం కన్నా చదువుకోవడం బెటర్‌ అని భావించాడు. ఇంకేముంది ఏటీఎం కేంద్రంలోనే చదవడం మొదలు పెట్టాడు. చదవాలనే కోరిక ఉంటే చాలు కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని చదుకునే వీలుంటుందని నిరూపించాడు. ఈ ఫోటోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతా‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి విద్యార్థి ఉన్నాడా అంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు ఇలా ఏకాగ్రతతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు. కలెక్టర్లు. ఐపీఎస్ అయిన వారు కూడా ఇలా సెక్యూరిటీ గార్డ్ లుగా పని చేశారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. చినిగిన చొక్కా అయినా తొడుకో గానీ.. ఒక మంచి పుస్తకం కొనుకో అన్నారు. పూర్వం కొంత మంది ఎసి రూముల్లో చదివితే. ఇంకొంత మంది వీధి దీపాల కింద చదువుకున్నారు. ఎసిలో చదివిన వాళ్ళు, వీధి దీపాల కింద చదివిన వాళ్ళు చాలా మంది మేధావులు అయ్యారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. చదువుకోవాలంటే ఎసి తప్పని సరిగా మారింది చాలా మంది పిల్లలలు.. మా పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రులు కూడా పిల్లలను గారాబం చేస్తున్నారు.. అయినా పిల్లలో చదువు పట్ల మార్పు రావడం లేదు. చదవమని ఎంత ఫోర్స్ చేసిన, ఎన్ని అవకాశాలు కల్పించిన చదవడం లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు.  ఇది ఇలా ఉంటే స్టడీ రూమ్స్ అని, స్టడీ లైబ్రరీ అని రకరకాల పేర్లు పెట్టి డబ్బులు దడ్డుకుంటున్నారు చాలా మంది. చదువును వ్యాపారం చేసి జేబులు నింపుకుంటున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు  అయితే ఓకే ,  మరి డబ్బులు లేనివాళ్ళ పటిస్థితి ఏంటి..?       

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం 

దేశంలో కరోనా పంజా విసురుతోంది. రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో రోజూ మూడు వేలకు పైగానే కొత్త కేసులు వస్తున్నాయి.  ఏపీ సచివాలయంలో కరోనా ఉద్యోగులను కలవరపెడుతోంది. చాలామంది సచివాలయ ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడ్డారని తెలుస్తోంది. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారు సెలవులు పెట్టుకుని సెల్ఫ్‌ క్వారంటైన్‌ లో ఉన్నట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. సచివాలయంలోని మున్సిపల్‌, పరిశ్రమలు, మైనింగ్‌శాఖల్లో 9 మంది ఉద్యోగులు కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల్లో సగం మందికి పైగా వారాంతాల్లో హైదరాబాద్‌ వెళ్లి వస్తుండడంతోనే ఏపీ సచివాలయంలో కేసులు పెరిగాయని అంటున్నారు. గతంలో సచివాలయంలో వారానికి రెండు రోజులు ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేసేవారని, ఇపుడు చేయకపోవడంతో కొన్ని సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఉద్యోగులు ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకోవడంతో ఏ ఉద్యోగి కరోనా బారిన పడ్డారన్న సంగతిపై క్లారిటీ లేదంటున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.  సచివాలయంలో కేసులు పెరుగుతున్నప్పటికీ.. కోవిడ్‌ నిబంధనలు ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా సందర్శకులు లోపలికి వచ్చాక నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకున్నాం కదా…ఏమీ కాదన్నట్టు వ్యవహరిస్తున్నారట. ఇలాంటి నిర్లక్ష్యం వల్లే కరోనా విజృంభిస్తోందని భావిస్తున్నారు. 

సాగర్ పై  లేటెస్ట్ సర్వే.. టీఆర్ఎస్- కాంగ్రెస్ హోరాహోరీ 

తెలంగాణలో ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. పల్స్ టుడే లెటెస్ట్ సర్వేలో సంచలన ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో నిర్వహించిన సర్వేల్లో నాగార్జున సాగర్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడకగానే అనిపించింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కారుకు ఆధిక్యత కనిపించింది. తాజా సర్వేలో మాత్రం కాంగ్రెస్- టీఆర్ఎస్ మధ్య నున్నానేనా అన్నట్లుగా పోరు సాగుతోందని తేలింది.  నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై వరుసగా సర్వేలు నిర్వహిస్తోంది పల్స్ టుడే. సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ నేతృత్వంలోని పల్స్ టుడే ప్రతినిధులు.. నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించి అక్కడి ఓటర్ల నాడి తెలుసుకున్నారు. గ్రామాల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా అంచనా వేశారు. ఇప్పటివరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పల్స్ టుడే మూడు సర్వేలు నిర్వహించింది. అయితే తొలి రెండు సర్వేలకు.. తాజాగా వచ్చిన మూడో సర్వేకు చాలా తేడా వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కాకముందు నిర్వహించిన మొదటి సర్వేలో టీఆర్ఎస్ కు ఏకపక్షంగానే ఫలితం వచ్చింది. వారం క్రితం నిర్వహించిన రెండో సర్వేలోనూ కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డి కంటే... దాదాపు 8 నుంచి 10 శాతం ఓట్ల లీడ్ నోముల భగత్ కు కనిపించింది. తాజాగా చేసిన సర్వేలో మాత్రం సీన్ మారిపోయింది. కాంగ్రెస్- టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉందని తేలింది.  నాగార్జున సాగర్ లోని ఆరు మండలాలు ఉండగా.. గత సర్వెల్లో కాంగ్రెస్ రెండు, టీఆర్ఎస్ కు నాలుగు మండలాల్లో లీడ్ కనిపించింది. లేటెస్ట్ సర్వేలో మాత్రం కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ప్రస్తుతం రెండు పార్టీలు చెరో మూడు మండలాల్లో లీడ్ లో ఉన్నాయని పల్స్ టుడే సర్వేలో తేలింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లుగా ఉన్న యాదవుల ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్ కు పడే అవకాశం ఉందని పల్స్ టుడే సర్వే అంచనా వేసింది. రెడ్డి సామాజిక వర్గ ఓటర్లలో మెజార్టీ జానారెడ్డికే పడతాయని వెల్లడించింది. నియోజకవర్గంలో బలమైన వర్గంగా ఉన్న లంబాడీల నుంచి అభ్యర్థిని బరిలోకి దింపినా.. లంబాడాల ఓట్లు ఆ పార్టీకి పెద్దగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని సర్వే ఫలితాలతో వెల్లడవుతోంది. దళిత సామాజిక వర్గ ఓటర్లు కాంగ్రెస్, టీఆర్ఎస్ కు సమంగానే ఉండే అవకాశం ఉంది.  అయితే గిరిజన ఓట్లను ఈసారి అన్ని పార్టీలు పంచుకునే అవకాశం కనిపిస్తోంది. గతంలో జానారెడ్డికి ట్రైబల్ ఓట్లు వన్ సైడ్ గా పడేవని... ఈసారి మాత్రం టీఆర్ఎస్ కూడా భారీగానే లంబాడీల ఓట్లను సాధిస్తుందని పల్స్ టుడే నిర్వాహకులు కంబాలపల్లి కృష్ణ వివరిస్తున్నారు. గత రెండు సర్వేలో పోలిస్తే.. కాంగ్రెస్ బలపడానికి గల కారణాలను వివరించారు కృష్ణ. సాగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలను ఇంచార్జులుగా నియమించారు కేసీఆర్. దీంతో వారంతా తమ అనుచరులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. స్థానిక నేతల కంటే బయటివారి హడావుడే ఎక్కువగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. స్థానిక నేతలను సంబంధం లేకుండానే బయటినుంచి వచ్చిన టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలను కూడా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలతో స్థానిక టీఆర్ఎస్ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు పల్స్ టుడే సర్వే గుర్తించింది. వారంతా అధికార పార్టీకి హ్యాండ్ ఇవ్వవచ్చని అంచనా వేస్తోంది.  ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న నేతల్లో ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్ లో ఉన్నవారే. జానారెడ్డికి అనుచరులుగా పని చేసిన వారే. సాగర్ ఎన్నికను సవాల్ గా తీసుకున్న జానా రెడ్డి.. పాత కాంగ్రెస్ నేతలతో  టచ్ లోకి వచ్చారంటున్నారు. టీఆర్ఎస్ తీరుపై గుర్రుగా ఉన్న పాత కాంగ్రెస్ నేతలు... లోపాయకారీగా జానారెడ్డికి మద్దతుగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. బీజేపీ బలహీనం కావడం కూడా కాంగ్రెస్ కు కలిసివచ్చిందని కంబాలపల్లి కృష్ణం అంచనా వేస్తున్నారు. రవినాయక్ కోసం స్థానిక బీజేపీ నేతలెవరు ఇష్టంగా ప్రచారం చేయడం లేదు. టీఆర్ఎస్ ను ఓడించాలనే కసితో వాళ్లంతా జానారెడ్డికి ఓటు వేయవచ్చని భావిస్తున్నారు. టికెట్ రేసులో ఉన్న కడారి అంజయ్య యాదవ్ గులాబీ గూటికి చేరడం... కంకణాల నివేదితా రెడ్డి అసంతృప్తిగా ఉండటం బీజేపీకి బాగా మైనస్ అయిందంటున్నారు. బీజేపీ వీక్ కావడంతో... ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మొత్తం కాంగ్రెస్ కు మళ్లే అవకాశాలు ఉండటం కూడా జానారెడ్డికి ప్లస్ గా మారిందని పల్స్ టుడే అంచనా వేస్తోంది.  నియోజవర్గంలో స్థానికత అంశం కూడా కొంత ప్రభావం చూపే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందుకే సంక్షేమ పథకాలనే నమ్ముకుని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ కేవలం జానారెడ్డి చరిష్మాపైనే ఆధారపడి ఉంది. బీజేపీకి గతంలో కంటే ఓట్లు పెరుగుతాయని.. కాని పోటీలో ఉండే ఛాన్స్ మాత్రం లేదు, మొత్తంగా సాగర్ లో గత రెండు వారాల కంటే కాంగ్రెస్ పుంజుకున్నా... ఇప్పటికికూడా కొంత ఎడ్జ్ నోముల భగత్ కే ఉందని పల్స్ టుడే అంచనా వేసింది. అయితే చివరి మూడు రోజుల ప్రచారం, సీఎం కేసీఆర్ సభ తర్వాత పరిణామాలు మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. 

భార్యను కొడుతూ.. భర్త మృతి. 

వారి పేర్లు ప్రసాద్‌, ఉషారాణి. వారిది పెద్దల అంగీకారంతో జరిగిన పెళ్లి. వారికీ పెళ్ళై 13 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు కుమారులు. కుమార్తెలు. ప్రసాద్ మాత్రం మద్యానికి బానిసై  నిత్యం ఇంట్లో గొడవ పడేవాడు. మద్యం మత్తులో భార్యను కొడుతూ అదుపుతప్పి భవనంపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎవడి పాపాన వాడే పోతాడంటే ఇదే కావచ్చు మరి.    చైతన్యపురి ఇన్‌స్పెక్టరు రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రసాద్‌ (34) తాపీమేస్త్రీ. కొన్నేళ్ల క్రితం భార్య ఉషారాణి పిల్లలతో నగరానికి వచ్చి కొత్తపేటలో అద్దెకు ఉంటున్నాడు. మద్యానికి బానిసైన ప్రసాద్‌ తరచూ భార్యతో గొడవపడేవాడు. శనివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న ప్రసాద్‌ భార్యపై దాడి చేసే క్రమంలో అదుపుతప్పి అద్దెకు ఉండే 2వ అంతస్తు నుంచి మొదటి అంతస్తులో పడిపోవడంతో తలకు బలమైన గాయమై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పంచనామా అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.  ప్రసాద్‌ మద్యానికి అతిగా ఖర్చు చేయడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దీంతో భార్య ఉషారాణి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో మృతదేహాన్ని తీసుకురాలేని దుస్థితి. చైతన్యపురి పోలీసులు రూ.500 ఇచ్చి భార్యా పిల్లలకు భోజనం ఏర్పాటుచేశారు. దహన సంస్కారాలు చేయడానికి కూడా స్తోమత లేక భార్యా పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మృతుడి తల్లితండ్రి కూడా ముందుకు రాకపోవడంతో పోస్టుమార్టం అనంతరం ఉస్మానియా ఆసుపత్రి శవాగారంలో మృతదేహాన్ని ఉంచారు.    

సుప్రీంకోర్టులో సగం మందికి కరోనా! దేశంలో మహమ్మారి పంజా 

దేశంలో కరోనా మహమ్మారి మరింత తీవ్రమైంది. ఏ రోజుకారోజు కరోనా కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బంది మహమ్మారి బారిన పడ్డారు.  శనివారం ఒక్క రోజే 44 మంది సిబ్బంది కరోనా పాజిటివ్‌గా తేలింది. సిబ్బందిలో చాలా మందికి కరోనా సోకడంతో సుప్రీంకోర్టులో కలకలం రేపుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు రూముతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చేశారు. కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్ బాధితులుగా మారడంతో ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసులను విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. కోర్టు బెంచ్‌లన్నీ సోమవారం  గంట ఆలస్యంగా కేసుల విచారణను ప్రారంభించాయి. గతంలో కొంతమంది న్యాయమూర్తులు కరోనా బారినపడినా ఆ తర్వాత కోలుకున్నారు.  దేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఇంతకాలం మహారాష్ట్రనే పీడించిన మహమ్మారి.. చాపకింద నీరులా దేశం మొత్తం విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 904 మంది చనిపోయారు. ఒక్క రోజులో ఇంత మంది మరణించడం ఇదే రికార్డ్.  ఆదివారం దేశవ్యాప్తంగా  11,80,136 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,68,912 మందికి పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తంగా వైరస్ బారిన పడినవారి సంఖ్య కోటీ 35లక్షలకు చేరగా.. లక్షా 70వేలకు పైగా మరణాలు సంభవించాయి. కరోనా విజృంభణ తీవ్రంగా ఉండటంతో..బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 12,01,009కి చేరాయి. మొత్తంగా కోటీ 20లక్షల మందికిపైగా కొవిడ్‌ను జయించగా.. ఆ రేటు 90.44 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు టీకా డోసులు తీసుకున్నవారికి సంఖ్య 10,45,28,565కి చేరింది.   కరోనావైరస్‌ రెండో దశకు మహారాష్ట్ర కేంద్రంగా మారింది. ఆదివారం మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 63,294 మందికి వైరస్ సోకింది. 349 మంది చనిపోయారు. అక్కడ ప్రస్తుతం 5,67,097 క్రియాశీల కేసులున్నాయి.  గతంలో ఎన్నడూ లేని తీవ్రత కనిపిస్తుండటంతో మహారాష్ట్ర ఆంక్షలను తీవ్రతరం చేసింది. లాక్‌డౌన్ విధింపుపై ఏప్రిల్ 14న ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దేశ రాజధాని దిల్లీ పరిస్థితి అలాగే ఉంది. అక్కడ అత్యధికంగా 10,774 కొత్త కేసులు వెలుగుచూశాయి. 48 మంది మరణించారు. కొవిడ్ తీవ్రత నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ విధించేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా లేదని చెప్పిన ఆయన.. ఒకవేళ ఆసుపత్రి వ్యవస్థ కుప్పకూలితే లాక్‌డౌన్ తప్పదని వివరించారు. గత దశలకంటే నాలుగో దశలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోందని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.    

మాస్క్ తో వేలాది ప్రాణాలు సేఫ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎలా కట్టడి చేయాలన్న దానిపై సైంటిస్టులు నిరంతరంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కీలకమైన విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయడంలో మాస్కులు ధరించడమే అత్యంత కీలకమని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కొవిడ్‌ మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో మాస్కులు ధరించడం వల్ల వచ్చే ఆగస్టు నాటికే అమెరికాలో దాదాపు 14వేల మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని తాజాగా జరిపిన అధ్యయనంలో అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ.. మాస్కులు ధరించడం వంటి కీలక జాగ్రత్తలపై నిర్లక్ష్యం చేయవద్దని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు.   కొవిడ్ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కు ధరించడం వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడుకోవచ్చనే అంశంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌, ఎవాల్యుయేషన్‌(ఐహెచ్‌ఎంఈ) ఓ అంచనా వేసింది. దీని ప్రకారం, 2021 ఆగస్టు నాటికి అమెరికాలో కొవిడ్‌ మరణాలు 6,18,523కు చేరుకోవచ్చని లెక్కగట్టింది. ఒకవేళ అమెరికాలో 95శాతం జనాభా మాస్కు ధరిస్తే మాత్రం.. ఇందులో కనీసం 14వేల మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని అంచనా వేసింది. తద్వారా కొవిడ్‌ మరణాల సంఖ్యను 6,04,413కు తగ్గించవచ్చని ఐహెచ్‌ఎంఈ పేర్కొంది.   ఆగస్టు నాటికి అమెరికా జనాభాలో ఎక్కువ మంది వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ.. కొవిడ్‌ కంటే ముందున్న పరిస్థితులు ఏర్పడడం వల్ల ఈ మరణాల సంఖ్య 6,97,573కు పెరగవచ్చని ఐహెచ్‌ఎంఈ అంచనా వేసింది. విస్తృత వేగంతో వ్యాప్తి చెందే కరోనా వైరస్‌లో కొత్త రకాలు వెలుగుచూడడం కరోనా మరణాల సంఖ్య పెరుగుదలకు కారణమని తెలిపింది. ముఖ్యంగా బ్రిటన్‌, బ్రెజిల్‌ రకానికి చెందిన వైరస్‌పై వ్యాక్సిన్‌ల పనితీరు ఇంకా పూర్తిస్థాయిలో తెలియలేదని.. అందువల్ల వైరస్‌ ఉద్ధృతి తగ్గే అవకాశం కనిపించడం లేదని పేర్కొంది. ఇలాంటి సమయంలో ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకున్నా.. మరింత అప్రమత్తంగా ఉండాలని ఐహెచ్‌ఎంఈ సూచించింది.  

వకీల్ సాబ్ కు బిగ్ షాక్

వకీల్ సాబ్ సినిమా బంపర్ హిట్టైందన్న సంతోషంలో ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీకి సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది జనసేన. తమ ఉమ్మడి అభ్యర్థి రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ గెలుపు కోసం జన సైనికులు తీవ్రంగానే పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలింగ్ కు ఐదు రోజుల ముందు పవన్ కల్యాణ్ కు షాకిచ్చారు సీనియర్ నేత.  జనసేన పార్టీకి మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం రాజీనామా చేశారు. గంగాధరం  జనసేన పార్టీలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా పని చేసి, ప్రస్తుతం ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాక.. మొదటగా ఆయనకు మద్దతుగా నిలిచింది మాదాసు గంగాధరే.  పార్టీ పెట్టిన కొత్తలో పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు మాదాసు. జనసేన రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు.  జనసేన పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, రాజీనామా చేశార మాదాసు గంగాధరం. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగుదేశంకు అనుకూలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా, ఆయన వాటిని ఖండించడం లేదని అన్నారు. దీంతో ఆయన మౌనం నిజాన్ని అంగీకరించినట్టుగా భావిస్తున్నారని అన్నారు.తాను పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఓటర్లకు పవన్ అండగా నిలవలేదని, సినిమాలు, రాజకీయాలు వేరని, వాటి మధ్య తేడా తెలియని వారితో తాను పని చేయలేనని అన్నారు. ప్రజలు ఆశించినట్టుగా జనసేన పని చేయడం లేదని మాదాసు ఆరోపించారు.    

రాజీనామాలకు సిద్ధమన్న చంద్రబాబు

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారమంతా రాజీనామా సవాళ్ల చుట్టే తిరుగుతోంది. తిరుపతి ఎన్నికపై టీడీపీ అధినేత చంద్రబాబుకు.. మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి సవాల్ విసిరారు. అయితే పెద్దిరెడ్డి రాజీనామా సవాల్ పై స్పందించారు చంద్రబాబు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలంతా రాజీనామా చేయాలని.. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు కూడా రాజీనామా చేస్తారన్నారు. అప్పుడు దిల్లీ వెళ్లి పోరాటం చేయొచ్చన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా గతంలో తాముచేసిన అభివృద్ధే కనిపిస్తోందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలకు వైకాపా ప్రభుత్వం స్వస్తి పలికిందని.. కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. తెదేపా, వైకాపా పాలనపై చర్చకు ధైర్యముందా? అని చంద్రబాబు సవాల్‌ విసిరారు.   తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో ఓటడిగే అర్హత వైసీపీకి లేదని  చంద్రబాబు విమర్శించారు.ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరు, వెంకటగిరిలో నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన మాట్లాడారు. డబ్బు తీసుకుని ఓట్లేస్తే హక్కులు కోల్పోతారని చెప్పారు. బెదిరించే వాలంటీర్లను ఎదిరించాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైకాపా గెలిస్తే అక్రమాలకు లైసెన్స్‌ ఇచ్చినట్లేనని చెప్పారు.   తిరుపతి పర్యటనను సీఎం జగన్ రద్దు చేసుకోవడంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విసిరిన సవాల్ కు భయపడే జగన్ తిరుపతి రావడం లేదనే చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు.టీడీపీ నేతల ఆరోపణలకు కౌంటరిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి. కరోనా ఉధృతి కారణంగానే జగన్ సభ రద్దైందని చెప్పారు. తిరుపతిలో వైసీపీకి భారీ మెజార్టీ రావడం ఖాయమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నామని ప్రకటించారు. అందుకు చంద్రబాబు సిద్దమా అని ప్రశ్నించారు. తిరుపతిలో వైసీపీ ఓడిపోతే... వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని ప్రకటించారు మంత్రి పెద్దిరెడ్డి. టీడీపీ ఓడిపోతే.. మీ పార్టీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు.   

టీకా వేసుకుంటేనే ఆఫీసులోకి ఎంట్రీ

కరోనా మహమ్మారి  రోజురోజుకు పంజా విసురుతుండటంతో తెలంగాణ సర్కార్ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులంతా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆదేశించింది. వ్యాక్సిన్‌ వేయించుకుంటేనే కార్యాలయాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగులంతా ఈ నెల 15లోపు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించింది. 30వేల మంది సిబ్బందికి వ్యాక్సిన్‌ వేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.   కొవిడ్‌ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి చేసింది. మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మాస్క్‌ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధించాలని డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం దాదాపు 6 వందల వరకు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో మరో ఆరు వందల కేసులు వచ్చాయి. రాబోయే రెండు వారాల్లో కరోనా తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. 

వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూపిలిపాళెంలో వైసీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సభలో  ఎమ్మెల్యే వరప్రసాద్ తీరును మత్స్యకారులు తీవ్రంగా ఎండగట్టారు. సముద్ర ముఖద్వారం, తమిళనాడు బోట్ల సమస్యలని ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే సమావేశం నుంచి వెళ్లిపోవాలంటూ పెద్దపట్టున మత్స్యకారులు నినాదాలు చేశారు. వద్దని వారించబోయిన నేతలతో వాగ్వివాదానికి దిగారు. ఎన్నికలప్పుడే తమపై ప్రేమ పుట్టుకొస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు సాక్షిగా ఎమ్మెల్యేపై స్థానిక మత్స్యకారులు మండిపడ్డారు. ఎమ్మెల్యేపైకి దూసుకువచ్చిన మత్స్యకారులను ఇతర నేతలు అడ్డుకున్నారు. మంత్రి, ఎంపీ ఎంతగా వారించినా.. ఎమ్మెల్యేపై ఆరోపణలు అపలేదు స్థానికులు. సమావేశం రసాభసగా మారడంతో కార్యక్రమాన్ని మమా అనిపించి అక్కడి నుంచి మంత్రి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ అక్కడి నుంచి వెళ్లిపోయారు.   

మాస్క్ మస్ట్.. లేకుంటే వెయ్యి ఫైన్ 

తెలంగాణలోవేల సంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోంది. ఇకపై మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానాగా వడ్డిస్తారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్-2005, కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సర్కారు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.బహిరంగ ప్రదేశాల్లోనూ, ప్రయాణాల్లోనూ, పనిచేసే ప్రదేశాల్లోనూ మాస్కు తప్పనిసరి అని సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తాజా ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలంటూ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణలో అనూహ్యంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 1,759 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 20,184 యాక్టివ్‌ కేసులున్నారు. 13,366 మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌‌లో చికిత్స తీసుకుంటారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 551 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరకడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ పడకలు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆపరేషన్ థియోటర్ లో ఎలుకలు.. రోగులకు అనంత కష్టాలు

ఆంధ్రప్రదేశ్ లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అనంతపురం జిల్లా ప్రభుత్వాస్పత్రి దుర్భరంగా తయారైంది.అనంతపురం జిల్లా ఆస్పత్రిలో రోగులకు కొత్త సమస్య వచ్చిపడింది. ఎక్కడపడితే అక్కడకు ఎలుకలు వచ్చి ఇక్కట్లు కలిగిస్తున్నాయి. ఆర్థో విభాగం ఆపరేషన్ థియేటర్‌లో విద్యుత్ బోర్డు ప్యూజ్‌లోకి వెళ్లిన ఎలుక షాక్‌తో చనిపోయింది. మమూలుగా రోజుకు పదుల సంఖ్యలో ఆర్థో విభాగం ఆపరేషన్ థియేటర్‌లో శస్త్ర చికిత్సలు జరుగుతాయి. అధునాతన యంత్రాలు ఏర్పాటు చేశారు. అలాంటి థియేటర్‌లో ఎలుకలు యధేచ్ఛగా తిరగడం ఆందోళన కలిగిస్తోంది.  ఆరు నెలలుగా ఎలుకలు థియేటర్‌లోకి ప్రవేశించి విద్యుత్ వైర్లతోపాటు యంత్రాలకు సంబంధించిన వైర్లను కొరికేసాయి. దీంతో యంత్రాలు పనిచేయకుండా పోతున్నాయని ఆ విభాగానికి చెందిన డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఎలుకలు కారణంగా యంత్రాలు పనిచేయకుండాపోతే పరిస్థితి ఏంటని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల వ్యవహారంపై అలజడి రేగడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు.