సాగర్ పై లేటెస్ట్ సర్వే.. టీఆర్ఎస్- కాంగ్రెస్ హోరాహోరీ
posted on Apr 12, 2021 @ 11:36AM
తెలంగాణలో ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. పల్స్ టుడే లెటెస్ట్ సర్వేలో సంచలన ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో నిర్వహించిన సర్వేల్లో నాగార్జున సాగర్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడకగానే అనిపించింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కారుకు ఆధిక్యత కనిపించింది. తాజా సర్వేలో మాత్రం కాంగ్రెస్- టీఆర్ఎస్ మధ్య నున్నానేనా అన్నట్లుగా పోరు సాగుతోందని తేలింది.
నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై వరుసగా సర్వేలు నిర్వహిస్తోంది పల్స్ టుడే. సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ నేతృత్వంలోని పల్స్ టుడే ప్రతినిధులు.. నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించి అక్కడి ఓటర్ల నాడి తెలుసుకున్నారు. గ్రామాల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా అంచనా వేశారు. ఇప్పటివరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పల్స్ టుడే మూడు సర్వేలు నిర్వహించింది. అయితే తొలి రెండు సర్వేలకు.. తాజాగా వచ్చిన మూడో సర్వేకు చాలా తేడా వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కాకముందు నిర్వహించిన మొదటి సర్వేలో టీఆర్ఎస్ కు ఏకపక్షంగానే ఫలితం వచ్చింది. వారం క్రితం నిర్వహించిన రెండో సర్వేలోనూ కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డి కంటే... దాదాపు 8 నుంచి 10 శాతం ఓట్ల లీడ్ నోముల భగత్ కు కనిపించింది. తాజాగా చేసిన సర్వేలో మాత్రం సీన్ మారిపోయింది. కాంగ్రెస్- టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉందని తేలింది.
నాగార్జున సాగర్ లోని ఆరు మండలాలు ఉండగా.. గత సర్వెల్లో కాంగ్రెస్ రెండు, టీఆర్ఎస్ కు నాలుగు మండలాల్లో లీడ్ కనిపించింది. లేటెస్ట్ సర్వేలో మాత్రం కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ప్రస్తుతం రెండు పార్టీలు చెరో మూడు మండలాల్లో లీడ్ లో ఉన్నాయని పల్స్ టుడే సర్వేలో తేలింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లుగా ఉన్న యాదవుల ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్ కు పడే అవకాశం ఉందని పల్స్ టుడే సర్వే అంచనా వేసింది. రెడ్డి సామాజిక వర్గ ఓటర్లలో మెజార్టీ జానారెడ్డికే పడతాయని వెల్లడించింది. నియోజకవర్గంలో బలమైన వర్గంగా ఉన్న లంబాడీల నుంచి అభ్యర్థిని బరిలోకి దింపినా.. లంబాడాల ఓట్లు ఆ పార్టీకి పెద్దగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని సర్వే ఫలితాలతో వెల్లడవుతోంది. దళిత సామాజిక వర్గ ఓటర్లు కాంగ్రెస్, టీఆర్ఎస్ కు సమంగానే ఉండే అవకాశం ఉంది.
అయితే గిరిజన ఓట్లను ఈసారి అన్ని పార్టీలు పంచుకునే అవకాశం కనిపిస్తోంది. గతంలో జానారెడ్డికి ట్రైబల్ ఓట్లు వన్ సైడ్ గా పడేవని... ఈసారి మాత్రం టీఆర్ఎస్ కూడా భారీగానే లంబాడీల ఓట్లను సాధిస్తుందని పల్స్ టుడే నిర్వాహకులు కంబాలపల్లి కృష్ణ వివరిస్తున్నారు. గత రెండు సర్వేలో పోలిస్తే.. కాంగ్రెస్ బలపడానికి గల కారణాలను వివరించారు కృష్ణ. సాగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలను ఇంచార్జులుగా నియమించారు కేసీఆర్. దీంతో వారంతా తమ అనుచరులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. స్థానిక నేతల కంటే బయటివారి హడావుడే ఎక్కువగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. స్థానిక నేతలను సంబంధం లేకుండానే బయటినుంచి వచ్చిన టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలను కూడా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలతో స్థానిక టీఆర్ఎస్ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు పల్స్ టుడే సర్వే గుర్తించింది. వారంతా అధికార పార్టీకి హ్యాండ్ ఇవ్వవచ్చని అంచనా వేస్తోంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న నేతల్లో ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్ లో ఉన్నవారే. జానారెడ్డికి అనుచరులుగా పని చేసిన వారే. సాగర్ ఎన్నికను సవాల్ గా తీసుకున్న జానా రెడ్డి.. పాత కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వచ్చారంటున్నారు. టీఆర్ఎస్ తీరుపై గుర్రుగా ఉన్న పాత కాంగ్రెస్ నేతలు... లోపాయకారీగా జానారెడ్డికి మద్దతుగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. బీజేపీ బలహీనం కావడం కూడా కాంగ్రెస్ కు కలిసివచ్చిందని కంబాలపల్లి కృష్ణం అంచనా వేస్తున్నారు. రవినాయక్ కోసం స్థానిక బీజేపీ నేతలెవరు ఇష్టంగా ప్రచారం చేయడం లేదు. టీఆర్ఎస్ ను ఓడించాలనే కసితో వాళ్లంతా జానారెడ్డికి ఓటు వేయవచ్చని భావిస్తున్నారు. టికెట్ రేసులో ఉన్న కడారి అంజయ్య యాదవ్ గులాబీ గూటికి చేరడం... కంకణాల నివేదితా రెడ్డి అసంతృప్తిగా ఉండటం బీజేపీకి బాగా మైనస్ అయిందంటున్నారు. బీజేపీ వీక్ కావడంతో... ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మొత్తం కాంగ్రెస్ కు మళ్లే అవకాశాలు ఉండటం కూడా జానారెడ్డికి ప్లస్ గా మారిందని పల్స్ టుడే అంచనా వేస్తోంది.
నియోజవర్గంలో స్థానికత అంశం కూడా కొంత ప్రభావం చూపే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందుకే సంక్షేమ పథకాలనే నమ్ముకుని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ కేవలం జానారెడ్డి చరిష్మాపైనే ఆధారపడి ఉంది. బీజేపీకి గతంలో కంటే ఓట్లు పెరుగుతాయని.. కాని పోటీలో ఉండే ఛాన్స్ మాత్రం లేదు, మొత్తంగా సాగర్ లో గత రెండు వారాల కంటే కాంగ్రెస్ పుంజుకున్నా... ఇప్పటికికూడా కొంత ఎడ్జ్ నోముల భగత్ కే ఉందని పల్స్ టుడే అంచనా వేసింది. అయితే చివరి మూడు రోజుల ప్రచారం, సీఎం కేసీఆర్ సభ తర్వాత పరిణామాలు మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.