మరో మహిళతో భార్య పెళ్లి చేసిన భర్త.. 

ఒక వైపు ప్రపంచం సైన్స్ తో ముందుకు పరుగెడుతుంటే.. మరో వైపు మూఢ విశ్వాసంతో వెనక్కి వెళ్తుంది మన భారత దేశం. మూఢనమ్మకాలను ప్రాణం పొసే సంఘటనలు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లా లో నిధుల కోసం పసి పిల్లవాడిని ఉత్తర ప్రదేశ్ కి తీసుకెళ్లి నరబలి ఇవ్వాలనుకున్నారు. అది కనుమరుగు కాకముందుకే మదన పల్లిలో లో  మరో ఘటన జరిగింది. చదువుకుని, సమాజంలో ఉన్నత హోదా ఉన్నవాళ్లే మూఢ నమ్మకాలతో  తమ పిల్లలను వారే చంపుకున్నారు. తాజాగా మరో ఘటన జరిగింది. కన్నా బిడ్డలనే కడతేర్చే యత్నం చోటు చేసుకుంది. అతీతశక్తులు వస్తాయని కుమారులకు చిత్రహింసలు. భర్తతో భార్య, మరో వివాహిత కలిసి బలి ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు.     అతని పేరు రామలింగం. ఆమె పేరు రంజిత. ఇద్దరికీ పెళ్లి అయింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. రామలింగం చీరల వ్యాపారం చేసేవాడు. ఆ తరుణం లోనే ఇందుమతి అనే మరో మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. చాటుగా సంసారం సంసారం పెట్టకుండా.. అదే ప్రాంతంలో వేరే ఇంట్లో ఉంచాడు. ఈ సమయంలో ఇందుమతి స్నేహితురాలు ధనలక్మి అప్పుడపుడు ఇంటికి వాస్తు ఉండేది. ఈ నేపధ్యం లో రామలింగం మొదటి భార్య రంకితతో ధనలక్ష్మి కి పరిచయం అయింది.  కట్ చేస్తే.. రంజిత, ధనలక్ష్మి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి పెద్ద ఎవరో కాదు.. రంజిత భర్త రామలింగం. అదేంటి మొగుడు.. పెళ్ళానికి మరో పెళ్లి చేయడం ఏంటి..? అది మహిళతో పెళ్లి చేయడం ఏంటి..? అని  అనుకుంటున్నారా.. ఈ దరిద్య్రానికి కారణం ఏంటో మీరే చూడండి..   రంజిత ఇంటికి వచ్చిపోతున్న ధనలక్ష్మి ని గమనించిన రామలింగం తన మనసులో ఏం అనుకున్నాడో గానీ.. మీరిద్దరూ శివుడు పార్వతుల ఉన్నారని చెప్పేవాడు. కొన్నాళ్లకు ఆ మాట వాళ్ళ కూడా నిజం అనుకున్నారు.. అందుకే పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్నారు. ఇక అంటే ముహూర్తం ఫిక్స్ చేశాడు. వారి వివాహానికి రామలింగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అంతే పిల్లల ముందే పెళ్లి చేసుకున్నారు. అక్కడితో ఆగలేదు.. అతీతశక్తులు వస్తాయని నమ్మకం తో ధనలక్ష్మి ని నాన్న అని, రామలింగాన్ని మామ అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. స్కూల్ కి కూడా పంపకుండా ఇంట్లో పనులన్నీ పిల్లలతో చేయించారు. శానిటైజర్ తాగించడం. ఒంటికి కారం పూసి మండుటెండలో పడుకోబెట్టడం వంటి దారుణాలకు పూనుకున్నారు.. చివరికి ఆ పిల్లలని నరబలి ఇవ్వడానికి తెగించారు. ఈ  విషయం వారి మాటల ద్వారా గ్రహించిన పిల్లలు ఇద్దరు, వెంటనే తమ తాత ఇంటికి పారిపోయి జరిగిన విషయాన్ని చెప్పారు. తర్వాత ఈరోడ్‌ ఎస్పీ తంగదురైకు ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు... రంజిత, ధనలక్ష్మి, రామలింగంలను ప్రశ్నిస్తున్నారు. పిల్లల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే... చిత్తూరు జిల్లా మదనపల్లెలో సొంత తల్లిదండ్రులే తమ కన్న కూతుళ్లను హత్య చేసినలాంటి ఘటననే పునరావృతం అయ్యేది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా రంగంపాళ్యం రైల్‌నగర్ చోటుచేసుకుంది.    

కరోనా వస్తే జీవితాంతం నరకమేనా! 

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ ఉధృతి మొదటి దశ కంటే భయంకరంగా ఉంది. పలు రాష్ట్రాల్లో హాస్పిటల్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. వైరస్ లోడు ఎక్కువగా ఉంటుండటంతో ఎక్కువ మంది ఆక్సిజన్ అవసరం అవుతోంది. దేశంలో కరోనా మరణాలు కూడా ఆందోళన కల్గిస్తున్నాయి.  కరోనా గురించి మరో ఆందోళనకరమైన వార్త బయటికి వచ్చింది. క‌రోనా సోకి ఎలాగోలా కోలుకున్న‌ప్ప‌టికీ వైర‌స్ ప్ర‌భావంతో చాలా మందికి ఇత‌ర స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. దీనిపై ప‌రిశోధ‌న‌లు చేసిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ప‌లు కొత్త విష‌యాల‌ను గుర్తించారు. కరోనా సోకి కోలుకున్న‌ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నాడీ సమస్యలు లేదా మానసిక జబ్బుల బారినపడుతున్నార‌ని తేల్చారు. క‌రోసా సోకిన‌ ఆరు నెలల్లోనే ఏకంగా సుమారు 34 శాతం మందిపై ఆ ప్ర‌భావం క‌న‌ప‌డింది. క‌రోనా నుంచి కోలుకున్న 17 శాతం మందిలో ఆందోళన, 14 శాతం మందిలో మూడ్‌ మారిపోయే సమస్యలు ఎదుర‌వుతున్నాయి. 13 శాతం మంది మొట్టమొదటిసారి మానసిక సమస్యల‌ను ఎదుర్కొంటున్నారు.  మెదడులో రక్తస్రావం 0.6 శాతం, పక్షవాతం 2.1 శాతం, మతిమరుపు 0.7 శాతం మందిలో క‌న‌ప‌డుతున్నాయి. క‌రోనా తీవ్ర‌త అధికంగా ఉండి కోలుకున్న వారిలో నాడీ సమస్యల వంటి దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు ప్రధానంగా క‌న‌ప‌డుతున్నాయి. ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కన్నా క‌రోనా చాలా ప్రమాదకరమ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. ఫ్లూతో పోల్చి చూస్తే కరోనా ప్ర‌భావం వ‌ల్ల నాడి, మానసిక సమస్యల ముప్పు 44 శాతం అధికంగా ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. శ్వాసకోశ జబ్బులతో పోలిస్తే క‌రోనా వ‌ల్ల ఆరోగ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావం ముప్పు 16 శాతం అధికంగా ఉంద‌ని చెప్పారు. కరోనాకు సంబంధించి మరో షాకింగ్ విషయం బయటికి వచ్చింది. ఇంతకాలం కరోనా వైరస్‌ యువతను ఏం చేయదులే అనే భరోసాలో ఉండగా.. సెకండ్‌వేవ్‌లో పరిస్థితి తల్లకిందులైంది. ప్రస్తుతం యువతే ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరుతున్నవారిలో 45 ఏళ్ల లోపు వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా యువతే చికిత్స తీసుకుంటున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి.  గత ఏడాది కరోనా బాధితులలో అధిక శాతం మంది 50 ఏళ్లపైబడిన వారే ఉండేవారు. ఆస్పత్రుల్లో చేరేవారు, వెంటిలేటర్‌ అవసరమయ్యేవారు.. 60 ఏళ్లు పైబడినవారే ఎక్కువగా ఉండేవారు. వారిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా  ఉండేది. ఇప్పుడు అదే పరిస్థితి 40 ఏళ్లలోపువారిలో కూడా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. 25 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలోకూడా ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తోందని వారు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మాకు ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో ఉండడమే ఇందుకు కారణమని వైద్యులు తెలిపారు. చాలామంది తమ స్నేహితులతో దగ్గరగా మసలడం, ఆలింగనం చేసుకోవడం, చేతులు కలిపి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోవడం, ఒకే బైక్‌పై ఇద్దరు, ముగ్గురు ప్రయాణం చేయడం, మాస్కులు పెట్టుకోకపోవడంతో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. సిగరెట్‌ను షేర్‌ చేసుకోవడం వల్ల వైరస్‌ నేరుగా ఒకరి నుంచి మరొకరి నోటిలోకి ప్రవేశిస్తోంది. దీనివల్ల వైరల్‌ లోడ్‌ కూడా ఎక్కువగా ఉంటోంది. ఒకరికొకరు దగ్గరగా ఉన్నప్పుడు పాజిటివ్‌ వ్యక్తులు దగ్గితే.. ఆ తుంపర్లు నేరుగా ఎదుటి వ్యక్తి ముక్కులోకి, నోటిలోకి ప్రవేశిస్తున్నాయి. వైరస్‌ అత్యంత వేగంగా ఊపరితిత్తులకు పాకుతోంది.

నిప్పుతో పెట్టుకోవద్దు.. చండ్ర నిప్పులు 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో విశ్వరూపం చూపిస్తున్నారు చంద్రబాబు. నెల్లూరు జిల్లా గూడూరు సభలో సీఎం జగన్ పై నిప్పులు కురిపించారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారని, ఇదే చివరి అవకాశం కావాలని చంద్రబాబు అన్నారు. కరోనాను ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయిందని,  ఏ సహాయం చేయలేదని  విమర్శించారు. కరోనాతో సహజీవనం చేయాలని, బ్లీచింగ్ వేస్తే పోతుందని జగన్ జనజీవన వ్యవస్థని నాశనం చేశాడని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో మద్యం షాపులు తెరిచారని, చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలాపెట్టాడని చంద్రబాబు మండిపడ్డారుయ  రాష్ట్రంలో మద్యం ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ సొంత బ్రాండ్లు పెట్టి, సొంత షాపుల్లో అమ్ముతున్నాడంటే అంతకన్నా దారుణం ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు తెలుగు దేశం పాలనలో నీతివంతమైన పాలన అందించామని చెప్పారు. రాజకీయాల్లో రూపాయి ఆశించకుండా నిప్పులా బతుకుతున్నానని.. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నిప్పుతో పెట్టుకుంటే మాడి మసైపోతారని చంద్రబాబు హెచ్చరించారు.  ఇసుకను కమీషన్ల కోసం సొంత మనుషులకిచ్చారన్నారు చంద్రబాబు. ప్రస్తుతం రాష్ట్రంలో  ఇసుక దొరికే పరిస్థితి లేదన్నారు. ఇసుక ధరలకి రెక్కలొచ్చాయి. ఇసుక దొరక్క 45 లక్షల మంది ఉపాధి కోల్పోయి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. సహజ వనరులని దోచేస్తున్నారు.. సిమెంట్ ధరలను అప్పట్లో నియంత్రించాం. జగన్‌కి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బ్రహ్మాండంగా ఇళ్లు నిర్మిస్తే, రెండేళ్లుగా అతీ, గతీ లేదు. నిత్యవసర సరుకుల ధరలు, కూరగాయలు అన్నీ రేట్లు పెరిగిపోయాయి.’’ అని చంద్రబాబు గూడురు రోడ్ షోలో ఆగ్రహం వ్యక్తం చేశారు.   

సాగర్ లో టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు!

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించడానికే వ్యూహాలు రచిస్తూనే.. ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టేందుకు ఎత్తులు వేస్తున్నాయి. పార్టీల పోటాపోటీ ప్రచారాలతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. సాగర్ లోనూ దుబ్బాక బైపోల్ లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి ఉప ఎన్నిక గత నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా పోరాడాయి. పోలింగ్ కు ముందు రోజూ వరకూ ఎవరికి ఎడ్జ్ ఉందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే పోలింగ్ రోజు ఉదయం ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దుబ్బాకలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరారన్నది దాని సారాంశం. ఈ వార్త నియోజకవర్గంలో చర్చగా మారింది. పోలింగ్ పైనా ప్రభావం చూపింది. సీన్ కట్ చేస్తే దుబ్బాక ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి వెయ్యికి పైగా ఓట్లతో విజయం సాధించారు.   నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలోనూ అలాంటి ప్రచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. జానారెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీ మారుతున్నారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. జానారెడ్డి తెలంగాణలో అత్యంత సీనియర్ రాజకీయ నేత. మంత్రిగా ఎక్కువ కాలం పనిచేసి నేతగా ఆయనది ఉమ్మడి రాష్ట్రంలోనే రికార్డ్. గతంలో సీఎల్పీ నేతగా కూడా పని చేశారు. అలాంటి నేత పార్టీ మారుతారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ప్రచారం చేయడంపై జనాల్లోనూ చర్చ జరుగుతోంది. కేసీఆర్ వ్యతిరేక ఓటంతా తమకు దక్కేలా ... దుబ్బాకలో అమలు చేసిన వ్యూహాన్నే సాగర్ లోనే బీజేపీ అమలు చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి.  జానారెడ్డి పార్టీ మారుతారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.  జానారెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం చేయడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లో  చేరుతున్నారంటూ తప్పుడు వీడియోను విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్ల లబ్ధి పొందారని భట్టీ విమర్శించారు.  సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటూ ఉన్నత విలువలు, ఆదర్శప్రాయమైన రాజకీయాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి జానారెడ్డి అని భట్టి కొనియాడారు. అలాంటి వ్యక్తిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత చౌకబారుగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  జానారెడ్డి గురించి తెలిసిన ఏ ఒక్కరూ బండి సంజయ్ మాటలను విశ్వసించరని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ గెలవకుండా టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాకుండా చేసేందుకు అధికార టీఆర్ఎస్ తో  కలిసి బీజేపీ ఆడుతున్న నాటకమని ప్రజలు గుర్తించారన్నారు. సాగర్‌ ఉప ఎన్నికలో ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అధికార పార్టీకి ఎన్నికలు వ్యాపారంలా మారిపోయాయని.. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడకు  వెళ్లి నేతలను కొనుగోలు చేయడం పరిపాటిగా మారిపోయిందని విక్రమార్క విమర్శించారు.    

రాజకీయ రేవ్ పార్టీ వేదికగా అసెంబ్లీ! రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ 

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత విశ్వరూపం చూపించారు. కరోనా సోకడంతో రెండు వారాల పాటు హోం ఐసోలేషన్ లో ఉన్న రేవంత్ రెడ్డి.. గత మూడు రోజులుగా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తున్నారు. మంగళవారం సాగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి... సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు.  దివంగత నోముల నర్సింహయ్యను కేసీఆర్ రాజకీయంగా బలహీనం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టిఆర్ఎస్ లో చేరిన తరువాత నోముల నర్సింహయ్య ను రాజకీయంగా కెసిఆర్ సమాధి చేశారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి , చంద్రబాబు ఉన్నప్పుడు శాసనసభలో ప్రజల సమస్యలపై నోముల నర్సింహయ్య కొట్లాడే వారన్నారు. నోముల  టిఆర్ఎస్ పార్టీలో చేరి 2018 లో గెలిచిన తర్వాత శాసనసభలో రెండు సంవత్సరాలలో ఒక్క సారి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. నర్సింహయ్య టిఆర్ఎస్ లో చేరిన తర్వాతనే ప్రజల నుండి కనుమరుగై పోయారన్నారు రేవంత్ రెడ్డి.  నోముల నర్సింహయ్యను మంత్రి ఎందుకు చేయలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఆలుగడ్డలు అమ్ముకునే తలసాని శ్రీనివాస్ యాదవ్ ని  మంత్రి చేశారని విమర్శించారు. ఉప ఎన్నిక కోసం నోముల నర్సింహయ్య కుటుంబానికి తప్పించి మిగతా అందరి పేర్లు కెసిఆర్ పరిశీలించారన్నారు. దీని ద్వారా ఆయన ఆత్మకు శోభించ లేదా అని నిలదీశారు.  చివరి నిముషంలో నోముల నర్సింహయ్య కొడుకుకి టికెట్ ఎనౌన్స్ చేశారన్నారు. నాగార్జునసాగర్లో జానారెడ్డి గెలుపు ఖాయమైంది కాబట్టే నోముల నర్సింహయ్య కొడుకుకి చివరి నిమిషంలో టికెట్ ఇచ్చారని విమర్శించారు. నాగార్జునసాగర్ ఓటమిని నోముల నర్సింహయ్య కుటుంబం ఖాతాలో వెయాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి.  రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు రాజకీయ ప్రత్యర్దులయిన రాజకీయ సంప్రదాయం కాపాడటానికి కృషి చేశారన్నారు రేవంత్ రెడ్డి.  26 మంది ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పై పీజేఆర్ ఒంటికాలితో పోరాటం చేశారన్నారు. తెలంగాణకు పెద్దన్న పాత్ర పోషించింది జానారెడ్డి కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణను సాధించింది జానారెడ్డే అన్నారు. శాసనసభను కేసిఆర్ కల్లు కాంపౌండ్ లా మార్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  శాసనసభలో చర్చ లు లేవు.. ప్రజల సమస్యలు పరిష్కారాలు లేవని విమర్శించారు. రాజకీయ రేవ్ పార్టీ వేదికగా శాసనసభను కేసీఆర్ మార్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  గులాబీ వనంలో  కేసీఆర్ గంజాయి మొక్కలను పెంచి పోషించారన్నారు రేవంత్ రెడ్డి. గులాబీ వనంలో ఉన్న గంజాయి మొక్కలను, చీడపీడలను జానారెడ్డి ఎత్తిచూపుతాడని కెసిఆర్ కక్ష కట్టారని ఆరోపించారు. అందుకే ఆయనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జానారెడ్డి సవాల్ ను ఒప్పుకోకుండా ఎందుకు తప్పించుకు తిరిగారో సాగర్ లో సభలో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతుందని నిఘా వర్గాలు నివేదిక ఇవ్వడం వల్లే కెసిఆర్ రెండోసారి బహిరంగ సభకు వస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.  

తిరుపతిలో అలజడికి కుట్ర! 

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తిరుపతి సభపై జరిగిన రాళ్ల దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.  టీడీపీ సభలో అలజడి స్పష్టించాలని చూడటంపై తమ్ముళ్లు భగ్గుమంటున్నారు.తిరుపతి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. డిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను తెలుగు దేశం పార్టీ ఎంపీలు కలిశారు. సోమవారం తిరుపతిలో నిర్వహించిన చంద్రబాబు సభలో జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌ వినతిపత్రం అందజేశారు.  తిరుపతి ఉపఎన్నికలో కేంద్ర బలగాల పర్యవేక్షణలో పోలింగ్‌ నిర్వహించాలని టీడీపీ ఎంపీలు కోరారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2లక్షల నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయని.. రెండు అదనపు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంలోని వాలంటీర్లను భాగస్వాములను చేయకుండా చూడాలని సీఈసీని కోరారు తెలుగు దేశం పార్టీ ఎంపీలు. మరోవైపు తిరుపతి టీడీపీ సభలో రాళ్ల దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు నోటీసు ఇచ్చామని అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణా టాటా తెలిపారు. ఘటనపై వెంటనే ఆధారాలు ఇవ్వాలని ఆయనకు నోటీసు ఇచ్చామని చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఐజీ మాట్లాడారు.  చంద్రబాబు ప్రచార సభకు సరిపడా భద్రత కల్పించామని డీఐజీ చెప్పారు. రాళ్ల దాడి ఘటనలో పోలీసులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. అవి సరికాదన్నారు. చంద్రబాబు సభకు ఎలాంటి అంతరాయం కలగలేదని చెప్పారు. ఆయన ప్రచార వాహనానికి ఏ నష్టం జరగలేదన్నారు. దాడిపై ఆధారాలు ఇవ్వాలని ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలనూ కోరినట్లు డీఐజీ చెప్పారు.     

పోటీ నుంచి తప్పుకుంటా! జానారెడ్డి సంచలనం

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక తెలంగాణలో కాక రేపుతోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ బరిలో ఉన్నా... ప్రస్తుతం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ సాగుతుందని తెలుస్తోంది. ఆ రెండు పార్టీల ముఖ్య నేతలంతా సాగర్ లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. గురువారం సాయంత్రంతో ప్రచారం ముగియనుండగా... బుధవారం హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభకు కొన్ని గంటల ముందు.. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జానా రెడ్డి సంచలన ప్రకటన చేశారు.   సీఎం కేసీఆర్‌కు జానారెడ్డి సవాల్‌ విసిరారు. ఎల్‌ఎల్‌సీ-2లో 7వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరూపిస్తే సాగర్ ఉప ఎన్నికల పోటీ నుంచి తాను తప్పుకుంటానని ప్రకటించారు. కాంగ్రెస్‌ హయాంలోనే 90శాతం వరద కాలువ పనులు పూర్తయ్యాయని జానారెడ్డి తెలిపారు.హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీగా విభజించి అన్ని అనుమతులు తెచ్చామని ఆయన పేర్కొన్నారు. సాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌పై లిఫ్ట్‌లపై కేసీఆర్‌ ఏనాడూ సమీక్ష చేయలేదని ఆయన విమర్శించారు. తన ఆలోచన ఫలితమే లెఫ్ట్‌ కెనాల్‌పై లిఫ్ట్‌లు అని జానారెడ్డి తెలిపారు.  టీఆర్‌ఎస్‌ వచ్చాక ఎన్నికలు కలుషితమయ్యాయని జానారెడ్డి వ్యాఖ్యానించారు. తనపై టీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలకు జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సాగర్‌లో ఏం చేశారని టీఆర్ఎస్‌కు ఓటేయాలని జానారెడ్డి ప్రశ్నించారు. ఉపఎన్నిక ఏకగ్రీవం కోసం కేసీఆర్‌ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని జానారెడ్డి తెలిపారు. కేసీఆర్‌ తనను అడిగి ఉంటే నోముల కుటుంబం కోసం పోటీ నుంచి తప్పుకునేవాడిని జానారెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ వచ్చాక ఎన్నికలు కలుషితమయ్యాయని జానారెడ్డి అన్నారు. డబ్బు, మద్యం, తప్పుడు హామీలతో ఓటర్లను మభ్యపెడుతున్నారని జానారెడ్డి విమర్శించారు.  మరోవైపు  కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా హాలియాలో కేసీఆర్‌ సభ నిర్వహిస్తున్నారని ఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్ కుమార్‌తో ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్‌ వాహనాల్లో మద్యం, డబ్బు తరలిస్తున్నారని ఉత్తమ్ తెలిపారు. కేంద్ర బలగాలతో సాగర్ ఉప ఎన్నిక నిర్వహించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. సాగర్‌లో స్థానికేతర నాయకులను తక్షణమే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు. సీఎం ఒత్తిడితో అధికారులు ఎన్నికల నిబంధనలు పాటించడం లేదని ఉత్తమ్ ఆరోపించారు. కలెక్టర్‌కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంమని ఆయన ఫిర్యాదు చేశారు. 

ఆక్సిజన్ అందక 13 మంది మృతి! దేశంలో దారుణ పరిస్థితులు

కరోనా మహమ్మారి పంజా విసురుతుండటంతో దేశంలో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే హాస్పిటల్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. హాస్పిటల్స్ లోఆక్సిజన్ కొరత సమస్యగా మారింది. సకాలంలో ఆక్సిజన్ అందక ఐసీయూలో ఉన్న కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఒక్క రోజే ఆక్సిజన్ కొరతతో 13 మంది చనిపోవడం కలకలం రేపుతోంది.  ఆక్సిజన్ కొరత వల్ల ఆసుపత్రిలో ఏడుగురు రోగులు మరణించిన దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో జరిగింది. ముంబై నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని నాలాసోపరలోని వినాయక హాస్పిటల్ లో ఏడుగురు రోగులు ఆక్సిజన్ కొరతతో మరణించారని మృతుల బంధువులు ఆరోపించారు. తమ బంధువుల మృతికి ఆక్సిజన్ కొరత, వైద్యుల నిర్లక్ష్యం కారణమని వారు చెప్పారు. తన తండ్రికి కరోనా నెగిటివ్ అని వచ్చినా మరణించారని ఆక్సిజన్ కొరత వల్లనే మరణించాడని మృతుడి కుమార్తె పింకీ వర్మ ఆరోపించారు.తన సోదరుడిని ఆసుపత్రిలో చేర్చి ఇంజెక్షన్ కోసం 35వేల రూపాయలు చెల్లించినా మరణించాడని వైద్యుల నిర్లక్ష్యమే తన సోదరుడి మృతికి కారణమని మృతుడి సోదరి షాహీన్ ఆరోపించారు. వినాయక ఆసుపత్రిలో మృతుల బంధువులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వచ్చి అదుపు చేశారు. గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ కొరత ఉందని దీనిపై గతంలో మేయర్ రాజీవ్ పాటిల్ కూడా చెప్పారు. 7వేల కరోనా కేసులు వెలుగుచూడగా, ఇందులో 3వేల మందికి ఆక్సిజన్ అవసరమని అంటున్నారు.  మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లోనూ ఆక్సిజన్ అందక ఆరుగురు రోగులు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ సర్కార్ విచారణకు ఆదేశించింది. గుజరాత్ లోని సూరత్ లోనూ పరిస్థితులు భయంకరంగా తయారయ్యాయి. హాస్పిటల్స్ లో బెడ్లు లేకపోవడంతో ఆరు బయటే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. నర్సులో చేతిలో పట్టుకుని కొందరు రోగులకు సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది.

కరోనానా.. కరెన్సీ అందలేదా? వకీల్ సాబ్ కేంద్రంగా రచ్చ 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ కోసం ఒక రోజు రోడ్ షో నిర్వహించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. తర్వాత మళ్లీ ఆయన తిరుపతి వైపు చూడలేదు. ప్రచార గడువు నాలుగు రోజుల్లో ముగిస్తుంది అనగా.. పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారని  జనసేన ప్రకటన విడుదల చేసింది. తన భద్రతా సిబ్బందిలో కొందరికి కరోనా సోకడంతో.. డాక్టర్ల సూచనతో పవన్ కల్యాణ్ క్వారంటైన్ లో ఉన్నారని వెల్లడించింది. అయితే కీలక సమయంలో  పవన్ కల్యామ్ క్వారంటైన్ లోకి వెళ్లడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగిన బహిరంగ సభ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఆ సమావేశానికి పవన్ డుమ్మా కొట్టారు. క్వారంటైన్ లో ఉన్నా.. వీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశం ఉంది. కాని వకీల్ సాబ్ ఆ పని కూడా చేయలేదు. దీంతో బీజేపీకి ప్రచారం చేయడం ఇష్టం లేకే వకీల్ సాబ్.. కరోనా సాకుతో ప్రచారానికి దూరంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.  తిరుపతి లో పవన్ కల్యాణ్ ప్రచారం  చేయకపోవడంపైవైసీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పోత్తు ఉన్నా గబ్బర్ సింగ్ ఎందుకు ప్రచారం చేయడం లేదోనని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కరోనా తో దూరంగా ఉన్నారా లేక.. కరెన్సీ కట్టలు అందలేదని పవన్ కల్యాణ్ అలిగారా అంటూ అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. లేకపోతే తన మిత్రుడు చంద్రబాబుకు సాయం చేయడం కోసం బీజేపీకి హ్యాండిచ్చారా అంటూ రాంబాబు కొత్త రచ్చ రాజేశారు. తిరుపతిలో ఎవరూ ప్రచారం చేసినా.. చేయకపోయినా వైసీపీ ఘన విజయాన్ని ఆపలేరన్నారు అంబటి రాంబాబు. ఎమ్మెల్సే అంబటి వ్యాఖ్యలతో కొత్త చర్చ జరుగుతోంది. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో మొదటి నుంచి బీజేపీ-జనసేన మధ్య విభేదాలు వచ్చాయి. తిరుపతిలో తామే పోటీ చేస్తామని ప్రకటించారు పవన్ కల్యాణ్. 2019 ఎలక్షన్లలో బీజేపీకంటే తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని లెక్కేసింది. ఢిల్లీకి వెళ్లి మరి పవన్ కల్యాణ్... బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు.తర్వాత ఏమైందో ఏమో పవన్ వెనక్కి తగ్గారు. పోటీపై పవన్ వెనక్కి తగ్గడంపైనా పలు రకాల చర్చలు జరిగాయి.  బీజేపీపై గుర్రుగా ఉన్నందువల్లే తిరుపతిలో జనసేన పోటీ చేయలేదనే చర్చ జరిగింది. కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు.. బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పార్టీలు అవగాహనతో బరిలో నిలిచాయి. వకీల్ సాబ్ సినిమా విషయంలోనూ ఏపీ సర్కార్ తీరును ఎండగట్టారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ పై వైసీపీ కక్ష కట్టిందని మండిపడ్డారు.   తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీకి దూరంగా ఉండటమే బెటరన్న ఆలోచనకు పవన్ వచ్చారంటున్నారు. అందుకే కరోనాను సాకుగా చూపి.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ దూరంగా ఉంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది .కొన్ని రోజుల తర్వాత బీజేపీతో జనసేనాని తెగతెంపులు చేసుకుంటారని చెబుతున్నారు.   

డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో? 

తెలంగాణలో కొద్దిరోజులుగా సంచలనం రేపుతున్న బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఈ కేసుతో లింకులున్నాయన్న వార్తలు కలకలం రేపాయి. అయితే బెంగళూరు డ్రగ్స్  కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కలహార్‌రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన విషయాలు బయటపెట్టారు.  డ్రగ్స్ కేసులో మీడియాలో తనను ముద్దాయిగా చూపిస్తోందని కలహర్ రెడ్డి ఆరోపించారు. 3 సంవత్సరాల క్రితం  బర్త్ డే పార్టీ కోసం బెంగళూరు వెళ్లానని చెప్పారు. ఆ పార్టీ గురుంచి స్టేట్ మెంట్ రికార్డు కోసమే  బెంగుళూరు పోలీసులు తనను పిలిచారని తెలిపారు. అక్కడ స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చి వచ్చాను.. ఈ డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని కలహార్‌రెడ్డి స్పష్టం చేశారు. అనవసరంగా తమ పేరు  ప్రచారం చేస్తుండటంతో  కుటుంబ సభ్యులు ఇబ్బంది గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఆధారాలు ఉంటే వార్తలు రాసుకోండి కానీ అనవసరంగా తనను బ్లేమ్ చేయవద్దని వ్యాపారవేత్త కలహార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.  బెంగళూరు పార్టీ లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా  తనకు తెలియదన్నారు కలహర్ రెడ్డి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సందీప్ తో తనకు ముఖ పరిచయం మాత్రమే ఉందని.. అంతకుమించి ఎలాంటి సంబందం లేదని చెప్పారు. శంకర్ గౌడ్ తనకు ఐదు సంవత్సరాల నుండి తెలుసన్న కలహార్ రెడ్డి... డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.  డ్రగ్స్  కేసులో సూత్రధారిగా ఉన్న కన్నడ సినీ నిర్మాత శంకరగౌడ ఏర్పాటు చేసే పార్టీలకు తెలంగాణకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యేవారని పోలీసులు గుర్తించినట్లు వార్తలొస్తున్నాయి.ప్రస్తుతం శంకరగౌడను విచారిస్తున్న పోలీసులు.. అతడి నుంచి తెలంగాణ ఎమ్మెల్యేల పేర్లను బయటకుతీసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే ఈ కేసులో ట్రావెల్స్ యాజమాని రతన్ రెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. శంకరగౌడ ఏర్పాటు చేసే పార్టీలకు తెలంగాణ ఎమ్మెల్యేలను తీసుకొచ్చే బాధ్యతను కలహర్ రెడ్డి, రతన్ రెడ్డి చూసుకునేవారని ప్రచారం జరిగింది. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు  వీరిద్దరే కీలకంగా ఉన్నారని చెబుతున్నారు.  డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు  ఇప్పటికే వార్తలొచ్చాయి. వికారాబాద్, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఒక ఎమ్మెల్యే తన వెంట చాలామందిని తీసుకెళ్లేవారని పోలీసులు గుర్తించారంటున్నారు. 

జగన్ కు చంద్రబాబు వార్నింగ్ 

తిరుపతిలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సభపై రాళ్ల దాడి చేయడం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. రాళ్ల దాడి ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తన సభపై జరిగిన దాడిపై మరోసారి తీవ్రంగా స్పందించారు చంద్రబాబు. ఈ రౌడీయిజం ఎందుకు? చేతకాని మనుషులు.. అలిపిరి ఘటనలో మైన్స్‌కు భయపడని నేను.. గులకరాళ్లకు భయపడతానా...?  నేను అనుకుంటే ఒక్కరూ బయటకు వచ్చేవాళ్లు కాదని చంద్రబాబు అన్నారు. . రౌడీల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. తిరుపతికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు.. వైసీపీ అరాచకాలతో తిరుపతి శోభ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని చంద్రబాబు  వ్యాఖ్యానించారు. తిరుపతి టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.టీడీపీకి  తిరుపతి కంచుకోట అని ఈ సందర్బంగా చెప్పారు.  అన్నారు.  అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని.. రెండేళ్ల వైసీపీ పాలనలో తట్ట మట్టి కూడా వేయలేదని విమర్శించారు.  ఎన్టీఆర్‌తో పాటు నేను, పార్టీ నాయకులు.. ఎవరు తిరుపతి వచ్చినా... పవిత్ర భావంతో స్వామివారి దర్శనం చేసుకునే వాళ్లం. అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. అపచారానికి దూరంగా ఉన్నాం. విద్యాసంస్థలన్నీ టీడీపీ హయాంలో వచ్చినవే. మహిళా యూనివర్సిటీ నుంచి ఐఐటీ వరకు అన్నీ టీడీపీ తీసుకువచ్చినవే. అభివృద్ధి ఒక పంథా. దాన్ని సమర్థవంతంగా ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లాలి. నవరత్నాలు కావవి.. నవ మోసాలు అంటూ వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఉగాది  వేడుకకు టీడీపీకి చెందిన పలువురు అగ్ర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. చంద్రబాబును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, 'తిరుపతి ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం నేతలతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్నాను. తెలుగు సంస్కృతిని చాటేలా జరిగిన పంచాంగ శ్రవణం, వేపపచ్చడి సేవనం వంటి కార్యక్రమాలు ఆహ్లాదాన్నిచ్చాయి. తెలుగు ప్రజలందరూ ఆనందారోగ్యాలతో, భోగభాగ్యాలతో తులతూగాలని ఈ సందర్భంగా ఆ వేంకటేశ్వరుని కోరుకున్నాను' అని తెలిపారు.

ఈ ఏడాది పెద్ద నేతకు గండం! స్వరూపానంద జోస్యంతో కలకలం 

తెలుగు రాష్ట్రాల్లో ఉగాడి వేడుగలు వైభవంగా జరుగుతున్నాయి. పంచాంగ శ్రవణం వింటూ తమ భవిష్యత్ గురించి తెలుసుకుంటున్నారు జనాలు. విశాఖలోని శ్రీశారదాపీఠంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. పీఠం ఆధ్వర్యంలోని గంటల పంచాంగాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర చెప్పిన జోస్యం కలకలం రేపుతోంది.  ప్లవ అంటే చీకటిని పారదోలి వెలుగులు నింపడమన్నారు స్వరూపానందేంద్ర స్వామి. శార్వరి, వికారిలా కాకుండా ప్లవ నామ సంవత్సరంలో శుభాలు కలగాలని కోరుకుందామన్నారు. అయితే ఈ ఏడాది ఓ పెద్ద నేతకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని స్వామి జోస్యం చెప్పారు. స్వరూపానందేంద్ర జోస్యం తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. ఆయన చెప్పిన పెద్ద నేత ఎవరన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరంటూ రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.  ఈ ఏడాది ఇబ్బందులు పడే నేత కేంద్రానికి చెందిన నేతా, రాష్ట్రానికి చెందిన నేతా... తెలుగు నేతా... దక్షిణాది, ఉత్తారది వారా అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. స్వామిజీ చెప్పిన నేత ఎవరై ఉండొచ్చు... ఆయనకు ఎదురయ్యే ఇబ్బందులు ఏమై ఉండొచ్చు అంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఏపీ సీఎం జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు కూడా ఇదే విషయం చెబుతున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీంతో  స్వరూపానందేంద్ర చెప్పిన జోస్యం ఆసక్తిగా మారింది. 

జగన్ కు కౌంట్ డౌన్! తిరుపతిలో బీజేపీ చీఫ్ సిగ్నల్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముప్పు ముంచుకొస్తుందా? వైసీపీ సర్కార్ కు గండమేనా? అంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సాక్షిగా జరుగుతున్న పరిణామాలతో రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా బీజేపీ పెద్దలు ఏపీపై పోకస్ పెంచడంతో.. వైసీపీ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందనే చర్చ జరుగుతోంది. రెండేళ్లుగా జగన్ సర్కార్ పై కొంత సాఫ్ట్ గా ఉన్న బీజేపీ నేతలు మాటల తీవ్రత పెంచడం ఆసక్తిగా మారింది.  తిరుపతి ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇదే సిగ్నల్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో జరిగిన సభలో ప్రసంగించిన బీజేపీ చీఫ్.. ఏపీ సీఎం జగన్ పై నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ అవినీతిమయమైందని, వైసీపీ ప్రభుత్వంలో విపరీతమైన బంధు ప్రీతి ఉందన్నారు. ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయని, ఇప్పటికే 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగినా జగన్ నిమ్మకు నీరెత్తినట్టున్నారని మండిపడ్డారు. నిందితులను అరెస్ట్‌ చేయడంలో జగన్ సర్కార్ విఫలమైందని, అందుకే దాడులు జరుగుతూనే ఉన్నాయని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కనుసన్నల్లో మత మార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారు నడ్డా. ఒక మతం కోసమే ప్రభుత్వం పని చేస్తున్నట్లు కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్రిస్టియానిటీ పెరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ఏపీలో విపరీతమైన అవినీతి ఉందని, లిక్కర్, శాండ్‌, ల్యాండ్, పోర్టుల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. ప్రతి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. జగన్ ఏపీని అప్పుల కుప్పగా మార్చారని, 4 లక్షల కోట్లకు ఏపీ అప్పులు చేరుకున్నాయన్నారు జేపీ నడ్డా. తిరుపతి ప్రచారంలో జేపీ నడ్డా వ్యాఖ్యలతో వైసీపీ సర్కార్ ను బీజేపీ టార్గెట్ చేసిందనే చర్చ జరుగుతోంది. తిరుపతి ఎన్నికను సవాల్ గా తీసుకున్న హైకమాండ్.. జనసేన పోటీ చేయాలని భావించినా ఒప్పించి రిటైర్ట్ ఐఏఎస్ రత్నప్రభను బరిలోకి దింపింది. అంతేకాదు బీజేపీ-జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను ప్రకటించింది. దీంతో తిరుపతి ఎన్నికల తర్వాత బీజేపీ మరింత దూకుడు పెంచవచ్చని తెలుస్తోంది. 2014 ఎన్నికలే టార్గెట్ గా ప్రణాళికలు రచించారని చెబుతున్నారు. ఈ లెక్కన ఏపీలో త్వరలో రాజకీయ సంచనాలు జరగబోతున్నాయనే సమాచారం వస్తోంది. సీఎం జగన్ పై ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులున్నాయి. ప్రతి శుక్రవారం విచారణ జరుగుతోంది. సీఎంగా ఉన్నందున జగన్ విచారణకు హాజరుకాకపోయినా... ఆయనతో పాటు కేసుల్లో ఉన్న నిందితులంతా కోర్టుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కేసుల్లోనూ కీలక పరిణామాలు జరగవచ్చంటున్నారు. సీఎం జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవధర్ పదేపదే చెబుతుండటం కూడా ఇందుకు బలాన్నిస్తోంది. టీడీపీ నేతలు కూడా జగన్ బెయిల్ రద్దు కావడం ఖాయమంటున్నారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్ వేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో తమ భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీగా ఉన్నందునే సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారంటున్నారు. 

వామ్మో కరోనా... మరో షాకింగ్ న్యూస్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డ్ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. హాస్పిటల్స్ లో బెడ్లు దొరక్క రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కరోనాకు సంబంధించి మరో షాకింగ్ విషయం బయటికి వచ్చింది. ఇంతకాలం కరోనా వైరస్‌ యువతను ఏం చేయదులే అనే భరోసాలో ఉండగా.. సెకండ్‌వేవ్‌లో పరిస్థితి తల్లకిందులైంది. ప్రస్తుతం యువతే ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంల ోకొవిడ్‌తో ఆస్పత్రిలో చేరుతున్నవారిలో 45 ఏళ్ల లోపు వారి సంఖ్య అధికంగా ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవుతోన్న పాజిటివ్‌ కేసుల్లో 43 శాతం 21-45 ఏళ్ల గ్రూపులోనివారివేనని వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల చెబుతున్నాయి. మార్చి రెండో వారం నుంచి  సెకండ్‌వేవ్‌ ప్రారంభమైంది. మార్చి 12 నుంచి కేసులు పెరుగుతుండగా, నెల రోజుల వ్యవధిలో ఏకంగా తెలంగాణలో 28,812 పాజిటివ్‌లు వచ్చాయి. అందులో 12,677 మంది 21-45 ఏళ్లలోపువారే. ఇక మరణాల విషయంలోనూ ఇతర దీర్ఘకాలిక లక్షణాలున్న వారు 56 శాతం ఉంటే, ఎటువంటి జబ్బుల్లేకుండా కేవలం కొవిడ్‌ వల్లే చనిపోయిన వారు 44 శాతం మంది ఉన్నారు.  ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా యువతే చికిత్స తీసుకుంటున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో నిత్యం 30 వరకూ అడ్మిషన్లు ఉంటే అందులో 20 వరకు యువతకు సంబంధించినవే ఉంటున్నాయట. పలు శాఖలున్న మరో కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 250 మంది పాజిటివ్‌ల్లో 40 శాతానికిపైగా 40 ఏళ్లలోపువారే. గత రెండు వారాలుగా ఈ పరిస్థితి ఉందని ఆస్పత్రుల సిబ్బంది చెబుతున్నారు. గత ఏడాది కరోనా బాధితులలో అధిక శాతం మంది 50 ఏళ్లపైబడిన వారే ఉండేవారు. ఆస్పత్రుల్లో చేరేవారు, వెంటిలేటర్‌ అవసరమయ్యేవారు.. 60 ఏళ్లు పైబడినవారే ఎక్కువగా ఉండేవారు. వారిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా  ఉండేది. ఇప్పుడు అదే పరిస్థితి 40 ఏళ్లలోపువారిలో కూడా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు.  కొద్దిరోజులుగా ఐసీయూ చికిత్స అవసరమవుతున్న ప్రతి పది మందిలో ఒకరు 30 ఏళ్ల లోపు ఉంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. 25 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలోకూడా ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తోందని వారు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. వారు ఆస్పత్రి పాలవడానికి కారణం.. సకాలంలో చికిత్స తీసుకోకపోవడం, ‘మాకు ఏం కాదులే’ అనే నిర్లక్ష్యంతో ఉండడమేనని వైద్యులు తెలిపారు.చాలామంది తమ స్నేహితులతో దగ్గరగా మసలడం, ఆలింగనం చేసుకోవడం, చేతులు కలిపి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోవడం, ఒకే బైక్‌పై ఇద్దరు, ముగ్గురు ప్రయాణం చేయడం, మాస్కులు పెట్టుకోకపోవడంతో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. సిగరెట్‌ను షేర్‌ చేసుకోవడం వల్ల వైరస్‌ నేరుగా ఒకరి నుంచి మరొకరి నోటిలోకి ప్రవేశిస్తోంది. దీనివల్ల వైరల్‌ లోడ్‌ కూడా ఎక్కువగా ఉంటోంది. ఒకరికొకరు దగ్గరగా ఉన్నప్పుడు పాజిటివ్‌ వ్యక్తులు దగ్గితే.. ఆ తుంపర్లు నేరుగా ఎదుటి వ్యక్తి ముక్కులోకి, నోటిలోకి ప్రవేశిస్తున్నాయి. వైరస్‌ అత్యంత వేగంగా ఊపరితిత్తులకు పాకుతోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం మహారాష్ట్ర, పంజాబ్‌ తదితర 11 రాష్ట్రాలవే. వాటిలో కూడా ఎక్కువ కేసులు 15 నుంచి 44 ఏళ్లలోపువారిలోనే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ఇటీవల ఒక సమావేశంలో ప్రకటించారు. బస్సులలో తిరగడం, ఆటోలు ఎక్కడం, బస్సులలో ఊళ్లకు ప్రయాణం చేస్తుండడంతో కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తోంది. 

కరోనా కేంద్రాలుగా ఎన్నికల ర్యాలీలు 

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత వారం రోజుల్లోనే ఏకంగా తొమ్మిది లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి పలు ప్రాంతాల్లో లాక్ డౌన్లు విధించారు. అయినా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజా మరో షాకింగ్ అంశం వెలుగులోనికి వచ్చింది. ఎన్నికల ప్రచారం కరోనా హాట్ స్పాట్లుగా మారిందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా స్థాయిలో పెరుగుతున్నాయి. గత పక్షం రోజుల్లో కేసుల సంఖ్య దాదాపు రెండింతలయ్యింది.ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో  గత 14 రోజుల్లో రోజువారీ కరోనా కేసుల్లో ఏకంగా 300 శాతం వృద్ధి నమోదైంది. కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌. అక్కడ కేసుల సంఖ్య 378 శాతం పెరిగింది. గత 14 రోజుల్లో 30,230 కొత్త కేసులు నమోదయ్యాయి. బెంగాల్‌లో మొత్తం ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  ఏప్రిల్‌ 27న తుది విడత పోలింగ్‌ జరగనుంది. అస్సాంలో కొత్త కేసుల సంఖ్య 331 శాతం పెరిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో  కేసుల సంఖ్య 175 శాతం పెరిగింది. తమిళనాడులో సైతం కేసుల సంఖ్య 173 శాతం ఎగబాకింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఏపీలోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతుండగా.. తిరుపతి ఉన్న చిత్తూరు జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో చిత్తూరు జిల్లాలోనే రోజు ఎక్కువ కేసులు వస్తున్నాయి. తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీకి బైపోల్ జరుగుతుండగా... ఆ నియోజకవర్గం పరిధిలోనే కొన్ని రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.  పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉష్ణోగ్రతలు తనిఖీ చేయడం, శానిటైజర్లు అందించడం వంటి కరోనా నియమాలు పాటిస్తున్నప్పటికీ.. ప్రచారంలో మాత్రం అవేవీ పెద్దగా కనిపించడం లేదు. దీంతో అప్రమత్తమైన ఎన్నికల సంఘం.. కొవిడ్‌ నిబంధనలు పాటించనట్లైతే.. అభ్యర్థులు, స్టార్‌ క్యాంపెయినర్‌ల ప్రచారంపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది.  

చంద్రబాబుపై రాళ్ల దాడి!

తిరుపతి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో రాళ్ల దాడి జరిగింది. తిరుపతి గాంధీ రోడ్డులో చంద్రబాబు ప్రచార సభ నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాయి విసిరారు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు యువకుడికి గాయాలయ్యాయి. దీంతో చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఇది పిరికిపంద చర్య అని.. పోలీసుల వైఫల్యమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. నిరసన వద్దని చంద్రబాబును పోలీసులు కోరారు. ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. రౌడీయిజం నశించాలంటూ చంద్రబాబు నినాదాలు చేశారు. తనకు రక్షణ లేకపోతే ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న తనకు రక్షణ  కల్పించలేరా అని చంద్రబాబు మండిపడ్డారు. ఇక రాయి దాడి ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.   

IAS నోటిఫికేషన్లు ఎవరిస్తారు? విపక్షాలకు కేటీఆర్ వార్నింగ్ 

ఉద్యోగ నియామకాలపై కొంత కాలంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఉద్యోగాల పేరుతో రాజకీయాలు చేయవద్దని చెప్పారు. కొందరు నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేయూ స్టూడెంట్ సునీల్‌ను రెచ్చగొట్టడం వల్లే చనిపోయాడని చెప్పారు కేటీఆర్. సునీల్‌కు బ్రెయిన్ వాష్ చేయడం వల్లే కేసీఆర్‌పై మాట్లాడారన్నారు. ఐఏఎస్ కావాల్సిన వాడినని బోడ సునీల్ వీడియోలో చెప్పాడు. ఐఏఎస్ భర్తీ చేసే నోటిఫికేషన్లు ఎవరిస్తారు? అని ప్రశ్నించారు. ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకుంటున్నారు...  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని ఉద్యోగాలిచ్చారు? అని కేటీఆర్ నిలదీశారు.  ‘‘మోడీ ఇచ్చిన కొలువులెన్ని? అమ్మిన సంస్థలెన్ని? నిరుద్యోగి సునీల్‌ను రెచ్చగొట్టి తప్పుదారి పట్టించారు. దయచేసి యువతను గందరగోళానికి గురిచేయొద్దు. తెలంగాణ యువకులు క్షణికావేశానికి గురికావొద్దు. త్వరలోనే 50వేల ఉద్యోగాలకు ప్రకటన ఉంటుంది’’ అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ఉత్తమ్ ఎక్కడున్నారని కేటీఆర్‌  ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ వయసు, హోదా చూడకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని.. ఆయన్ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇదే చివరి హెచ్చరికని కేటీఆర్ తేల్చి చెప్పారు.  వరంగల్ లో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. విపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  వరంగల్‌ నగరాభివృద్ధికి ఎన్నికోట్లు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. తామిచ్చిన డబ్బుకు రెట్టింపు కేంద్రం నుంచి తీసుకురాగలరా? అని బీజేపీనిప్రశ్నించారు. ఉగాదికి ఒకరోజు ముందే నగరానికి తాగునీరు అందించామని మంత్రి చెప్పారు. మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని.. వరంగల్‌కు మెట్రో నియో రైలు తీసుకొచ్చేది తామేనని కేటీఆర్‌ అన్నారు.  

ప్రధాని మోడీ ఇలాకాలో కాంగ్రెస్ స్వీప్ 

ప్రధాని నరేంద్ర మోడీకి ఊహించని షాక్ తగిలింది. మోడీ ఎంపీగా  ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌యూఐ అన్ని పోస్టులను కైవసం చేసుకుంది.  ఈ ఎన్నికల్లో ఏబీవీపీకి ఒక్క పోస్ట్ కూడా లభించలేదు. వారణాసిలో ఎన్ఎస్‌యూఐ విజయం.. బీజేపీకి, ప్రధాని మోదీకి షాక్ ఇచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎన్ఎస్‌యూఐకి చెందిన కృష్ణమోహన్ శుక్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అజిత కుమార్ చౌబే ఉపాధ్యక్షుడిగా ఎన్నికవగా.. శివమ్ చౌవే జనరల్ సెక్రటరీగా, అశుతోశ్ కుమార్ మిశ్రా లైబ్రరీ మినిస్టర్‌గా ఎన్నికయ్యారు. కాగా ఈ విజయంపై కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీకి గట్టి షాక్ తగిలిందని, యువత బీజేపీకి తగిన గుణపాఠం నేర్పిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.  పాలనలో మార్పు కోరుకుంటున్నారని ఈ విజయంతో స్పష్టమవుతోందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ అన్నారు. ఉత్తర‌ప్రదేశ్‌ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మార్పునకు ఇది నాంది పలికినట్లయిందని చెప్పారు.  గతేడాది డిసెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. వాటిలో బీజేపీ కేవలం నాలుగు స్థానాల్లోనే గెలిచింది.  ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి పరిధిలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను  సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకుంది. ఈ మధ్య కాలంలో బీజేపీ పట్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేక భావన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజలు వ్యతిరేకత కనబరుస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, నిత్యావసరాల ధరలు పెరగడంతో  సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.