భార్యను కొడుతూ.. భర్త మృతి.
posted on Apr 12, 2021 @ 11:15AM
వారి పేర్లు ప్రసాద్, ఉషారాణి. వారిది పెద్దల అంగీకారంతో జరిగిన పెళ్లి. వారికీ పెళ్ళై 13 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు కుమారులు. కుమార్తెలు. ప్రసాద్ మాత్రం మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ పడేవాడు. మద్యం మత్తులో భార్యను కొడుతూ అదుపుతప్పి భవనంపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎవడి పాపాన వాడే పోతాడంటే ఇదే కావచ్చు మరి.
చైతన్యపురి ఇన్‌స్పెక్టరు రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రసాద్ (34) తాపీమేస్త్రీ. కొన్నేళ్ల క్రితం భార్య ఉషారాణి పిల్లలతో నగరానికి వచ్చి కొత్తపేటలో అద్దెకు ఉంటున్నాడు. మద్యానికి బానిసైన ప్రసాద్ తరచూ భార్యతో గొడవపడేవాడు. శనివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న ప్రసాద్ భార్యపై దాడి చేసే క్రమంలో అదుపుతప్పి అద్దెకు ఉండే 2వ అంతస్తు నుంచి మొదటి అంతస్తులో పడిపోవడంతో తలకు బలమైన గాయమై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పంచనామా అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ప్రసాద్ మద్యానికి అతిగా ఖర్చు చేయడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దీంతో భార్య ఉషారాణి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో మృతదేహాన్ని తీసుకురాలేని దుస్థితి. చైతన్యపురి పోలీసులు రూ.500 ఇచ్చి భార్యా పిల్లలకు భోజనం ఏర్పాటుచేశారు. దహన సంస్కారాలు చేయడానికి కూడా స్తోమత లేక భార్యా పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మృతుడి తల్లితండ్రి కూడా ముందుకు రాకపోవడంతో పోస్టుమార్టం అనంతరం ఉస్మానియా ఆసుపత్రి శవాగారంలో మృతదేహాన్ని ఉంచారు.