ఏపీ సచివాలయంలో కరోనా కలకలం
posted on Apr 12, 2021 @ 11:58AM
దేశంలో కరోనా పంజా విసురుతోంది. రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో రోజూ మూడు వేలకు పైగానే కొత్త కేసులు వస్తున్నాయి. ఏపీ సచివాలయంలో కరోనా ఉద్యోగులను కలవరపెడుతోంది. చాలామంది సచివాలయ ఉద్యోగులు కొవిడ్ బారిన పడ్డారని తెలుస్తోంది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారు సెలవులు పెట్టుకుని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.
సచివాలయంలోని మున్సిపల్, పరిశ్రమలు, మైనింగ్‌శాఖల్లో 9 మంది ఉద్యోగులు కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల్లో సగం మందికి పైగా వారాంతాల్లో హైదరాబాద్ వెళ్లి వస్తుండడంతోనే ఏపీ సచివాలయంలో కేసులు పెరిగాయని అంటున్నారు. గతంలో సచివాలయంలో వారానికి రెండు రోజులు ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేసేవారని, ఇపుడు చేయకపోవడంతో కొన్ని సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఉద్యోగులు ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకోవడంతో ఏ ఉద్యోగి కరోనా బారిన పడ్డారన్న సంగతిపై క్లారిటీ లేదంటున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.
సచివాలయంలో కేసులు పెరుగుతున్నప్పటికీ.. కోవిడ్ నిబంధనలు ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా సందర్శకులు లోపలికి వచ్చాక నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకున్నాం కదా…ఏమీ కాదన్నట్టు వ్యవహరిస్తున్నారట. ఇలాంటి నిర్లక్ష్యం వల్లే కరోనా విజృంభిస్తోందని భావిస్తున్నారు.