తెలంగాణ మంత్రికి కరోనా
posted on Apr 12, 2021 @ 2:42PM
తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఎవరీని వదలడం లేదు వైరస్. నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు కరోనా సోకింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి వైరస్ నిర్దారణ అయింది. తాజాగా ఓ మంత్రికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. గత రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో మంత్రి టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది.
తనకు కరోనా సోకిందన్న విషయాన్ని స్వయంగా మంత్రే వెల్లడించారు. గత రెండు, మూడు రోజులుగా వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 2,251 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ వల్ల ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,29,529కి చేరుకుంది. కరోనాతో మొత్తం 1,765 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 21,864 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 3,05,900 మంది రికవరీ అయినట్లు సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసినహెల్త్ బులిటెన్లో పేర్కొంది.
మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పందించారు. తెలంగాణలో 4 లక్షల 64 వేల డోసుల స్టాక్ ఉందన్నారు. సోమవారం రాత్రికి తెలంగాణాకు 3 లక్షల 62 వేల డోసులు రానున్నాయి. మరో ఐదు రోజులకు సరిపడా వ్యాక్సిన్ స్టాక్ ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 22 లక్షల 14, 270 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు.