ఏపీపై మరోసారి కేసీఆర్ సెటైర్లు! పాలకుడు వీకైతే అంతే.. 

ఇంటికి పెద్ద బలహీనంగా ఉంటే ఆ కుటుంబం అందరికి లోకువే.. రాష్ట్రానికి పాలకుడు వీక్ గా ఉంటే పక్క రాష్ట్రాలకు అలుసే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అచ్చం అలాగే ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏపీని పట్టించుకోవడం మానేసింది. పాలకుడు అడిగే పరిస్థితిలో లేదు కాబట్టే వరుసగా అన్యాయాలు చేసుకుంటూనే పోతోందనే చర్చ జరుగుతోంది. ఇది చాలదన్నట్లు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏపీని అవహేళన చేసే పరిస్థితులు నెలకొన్నాయి.  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఆంధ్రప్రదేశ్ పై సెటైర్లు వేశారు. ఇటీవలే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏపీలో అంతా రివర్స్ అయిందని కామెంట్ చేశారు కేసీఆర్. గతంలో ఏపీలో ఒకరం భూమి అమ్మి తెలంగాణలో రెండు ఎకరాలు కొనేవారని... కాని ప్రస్తుతం తెలంగాణలో ఎకరం ల్యాండ్ అమ్మితే ఏపీలో రెండు ఎకరాల భూమి వస్తుందన్నారు. ఏపీలో అంతా రివర్స్ గా ఉందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. అంధ్రా ప్రజలకు ఇబ్బందిగా మారింది.  తాజాగా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార సభలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ను టార్గెట్ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. గోదావ‌రిపై కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి.. రైతుల పాదాల‌ను క‌డుగుతున్నామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జున సాగ‌ర్ ఆయ‌క‌ట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామ‌న్నారు. ఇండియాలో ఈ యాసంగిలో 52 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి సాగు చేసింది తెలంగాణ‌ అన్నారు. తెలంగాణను హేళన చేసిన.. ఆంధ్రా 29 ల‌క్ష‌ల‌తో మూడో స్థానానికి పడిపోయిందని హేళనగా మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.  తెలంగాణ ధ‌నిక రాష్ట్రమైందని.. ఇతర రాష్ట్రాలు మాత్రం అప్పుల్లో మునిగిపోయాయని చెప్పారు.   కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. జగన్ తనను ప్రశ్నించలేరనే భావనతోనే కేసీఆర్.. ప్రతిసారి ఏపీని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఏపీలో పాలన సరిగా లేదనే అర్ధం వచ్చేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇది ముందుముందు ఏపీకి నష్టం కల్గిస్తుందని, వ్యాపార వేత్తలు ఏపీకి రాకుండా పోయే పరిస్థితి ఉందనే ఆందోళనలో కొందరి నుంచి వ్యక్తమవుతోంది. మొదటి సారి మాట్లాడినప్పుడే కేసీఆర్ కు ఏపీ పాలకులు కౌంటర్ ఇస్తే .. మళ్లీ మళ్లీ ఇలా మాట్లాడే అవకాశం లేకుండా పోయిదనే చెబుతున్నారు.    

మాస్క్ లేకుంటే మటాషే.. గాలి ద్వారా కరోనా వ్యాప్తి! 

దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించి మరో షాకింగ్ న్యూస్. ఇది జనాలను మరింత కలవరపరిచే వార్తే. కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణకు మహారాష్ట్ర పరిస్థితి వస్తుందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పడకల కొరత ఏర్పడుతుందన్నారు డా.శ్రీనివాస్‌. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు పడకల కొరత ఏర్పడిందన్నారు.  గతంతో పోల్చితే ప్రస్తుత వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని చెప్పారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్. ఇంట్లో ఒకరికి వైరస్‌ సోకితే గంటల్లోనే మిగతా వారికి వ్యాపిస్తుందని వెల్లడించారు. ఇప్పటివరకు బయట మాత్రమే మాస్క్‌ వేసుకోమని చెప్పామని..ఇకపై ఇంట్లో ఉన్నా మాస్క్‌ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని.. మరో 4 నుంచి 6 వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. ప్రజల జీవనోపాధి దెబ్బతినకూడదనే లాక్‌డౌన్ పెట్టడం లేదన్నారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటించకపోతే పరిస్థితి విషమిస్తుందని  డా.శ్రీనివాస్‌ హెచ్చరించారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో 20 శాతం మంది పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరారని... సెకండ్ వేవ్ లో 95 శాతం మంది ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47 వేల పడకల్లో సగానికి పైగా కోవిడ్ పేషెంట్లకే వాడుతున్నామని తెలిపారు. సీరియస్ కేసులు వస్తే... ప్రైవేట్ ఆసుపత్రులు గాంధీ ఆసుపత్రికి పంపుతున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ధర్నాలు చేయవద్దని కోరారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

భగత్ గాలి బాగానే ఉంది..

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి జానారెడ్డి చేసింది ఏమీ లేదన్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 30 ఏళ్ల అనుభవమున్న జానారెడ్డి.. హాలియాకు డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని తప్పుబట్టారు. నాగార్జున సాగర్‌కు త్వరలోనే డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తామన్నారు సీఎం కేసీఆర్.  సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియా పరిధిలోని అనుములలో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌ మాట్లాడారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. పరిణతితో ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఓటు వేసే ముందు న్యాయం ఎవరివైపు ఉందో ఆలోచించాలన్నారు. నాగార్జున సాగర్‌లో సంక్షేమ పథకాలు అందడంలేదా..? పైరవీలు లేకుండా పాలన సాగిస్తున్నాం.’’అని కేసీఆర్ అన్నారు.  నోముల భగత్‌కు ఏవిధంగా ఓట్లు పడతాయో అదే విధంగా నెల్లికల్లు లిఫ్ట్ నీళ్లు కూడా దూకుతాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో భగత్‌ గాలి బాగానే ఉందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మిత్రుడు నోముల నర్సింహయ్యను కోల్పోవడం బాధాకరమని చెప్పారు. వామపక్ష పార్టీల్లో ఉంటూ ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన తనయుడు, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను ఆశీర్వదించాలని కోరారు. 

రంజాన్ ప్రార్థనలకు హైకోర్టు నో

రంజాన్ సామూహిక ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ ఓ మసీదు ట్రస్టు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కొవిడ్-19 ఉధృతి తీవ్ర స్థాయిలో ఉన్నందున సామూహిక ప్రార్థనలకు అనుమతించడం కుదరదని తేల్చి చెప్పింది. మత విశ్వాసాన్ని అనుసరించే హక్కు ముఖ్యమే అయినా.. పౌరుల సంక్షేమం అంతకంటే ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది.  రంజాన్ మాసం దృష్ట్యా తమ మసీదులో రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలకు అనుమతి ఇవ్వాలంటూ దక్షిణ ముంబైలోని జుమా మసీదు ట్రస్ట్ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం.. ‘‘ మత విశ్వాసాలు అనుసరిస్తూ, వేడుకలను జరుపుకునే హక్కు ముఖ్యమైనదే అయినప్పటికీ.. ప్రజా భద్రత, పౌరుల సంక్షేమం అంతకంటే ముఖ్యమైన, సర్వోన్నతమైనదని గమనించాలి.’’ అని కోర్టు అభిప్రాయపడింది. తమ మసీదు ఎకరం స్థలంలో విస్తరించి ఉందనీ.. ఒకేసారి 7 వేల మంది సమావేశమయ్యేందుకు సరిపోతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక్కో విడతకు కనీసం 50 మందినైనా రంజాన్ సమయంలో ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ట్రస్ట్ కోరింది. కొవిడ్-19కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా కోర్టుకు విన్నవించింది. అయితే పిటిషనర్ వాదనను అదనపు ప్రభుత్వ ప్లీడర్ జ్యోతి చవాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. మహారాష్ట్రలో ప్రత్యేకించి ముంబైలో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆమె కోర్టుకు నివేదించారు. ‘‘ఏ మతానికి మేము మినహాయింపు ఇవ్వలేము. ప్రత్యేకించి ఈ 15 రోజుల్లో అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఈ దశలో మేము ఎలాంటి రిస్క్ తీసుకోలేం. ప్రజలంతా సహకరించాలి.’’ అని చవాన్ అన్నారు.  ప్రజలు తమ విశ్వాసాలను కొనసాగించడంపై ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించలేదని.. అయితే వాటిని ప్రజలు తమ ఇళ్ల దగ్గరనే చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదనతో ఏకీభవించిన ధర్మాసనం... ప్రస్తుతం కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నందున పిటిషనర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేమంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా గతంలో కూడా దేశంలోని అనేక కోర్టులు మతాలకు అతీతంగా సామూహిక ప్రార్థనలకు అనుమతి నిరాకరించిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది.

వామ్మో.. ఏపీలో 4 ,157  కేసులు.. 18 మరణాలు.. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్‌ విలయతాండవం చేస్తుంది. కరోనా భారీన బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,732 పరీక్షలు నిర్వహించగా.. 4,157 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,37,049 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల నెల్లూరులో నలుగురు చనిపోగా.. చిత్తూరు, కృష్ణాలో ముగ్గురేసి, విశాఖలో ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,339కి చేరింది.   24 గంటల వ్యవధిలో 1,606 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,01,327కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,34,460 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 617, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పశ్చిమ గోదావరి మినహా మిగతా అన్ని జిల్లాల్లో వందకుపైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 

తిరుపతి ప్రీపోల్ సర్వే.. గెలిచేది ఎవరంటే..

తిరుపతి పార్లమెంట్ స్థానంలో హోరాహోరీ పోరు. తిరుపతి విజయం అన్ని పార్టీలకూ కీలకం. నేతలంతా గెలుపు కోసం గట్టిగా క‌ృషి చేస్తున్నారు. ఎవరి లెక్కలు వారివే. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. పార్టీలు, నాయకుల మాటలా ఉంచితే.. మరి, తిరుపతి ఓటర్లు ఎటు వైపు? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ప్రి-పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి? అనేది ఆసక్తికరంగా మారింది. 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్' చేసిన ప్రీ పోల్ సర్వేలో ఓటర్ల నాడి స్పష్టమైంది.  సర్వేలో.. తిరుపతిలో ఎవరు గెలుస్తారంటూ ప్రశ్నించింది 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్'. 45శాతం ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుస్తారని చెప్పారు తిరుపతి ఓటర్లు. వైసీపీ వైపు 39.2శాతం మంది మొగ్గు చూపారు. బీజేపీ-జనసేనకు కేవలం 1.3శాతం మాత్రమే జై కొట్టారు. కాంగ్రెస్‌కు 0.7 మద్దతు పలకగా.. 13.8శాతం చెప్పలేమని చెప్పారు.  ఇక, టీడీపీకి ఓటేస్తామంటూ 47.8శాతం ప్రజానీకం స్పష్టం చేయండం చూస్తుంటే.. ఓటర్లలో తెలుగుదేశానికి పెరిగిన ఆదరణ స్పష్టం అవుతోంది. వైసీపీకి ఓటేసేందుకు 44.7శాతం మంది ఇంట్రెస్ట్ చూపడం ప్రజల్లో అధికార పార్టీ పరపతి కోల్పోతోంది అనడానికి నిదర్శణం. బీజేపీ-జనసేనకు ఓటేసేందుకు కేవలం 4.4శాతం ఆసక్తి కనబరిచారు.  తిరుపతిలో కులాల వారీగానూ ఓటరు నాడీ పట్టే ప్రయత్నం చేసింది 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్'. సర్వేలో అధిక శాతం రెడ్లు, మాలలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. వైసీపీకి 60.5శాతం రెడ్లు ఓటేస్తామని ముందుకు రాగా, 31.1శాతం మంది రెడ్లు మాత్రం టీడీపీకే జై కొట్టారు. 57.1శాతం మాలలు గురుమూర్తి వైపు ఉండగా, పనబాకకు 38.7శాతం మాలలు ఆసక్తి చూపారు. ఇక, మాదిగలు మాత్రం అధిక సంఖ్యలో తెలుగుదేశానికి అండగా ఉండబోతున్నారు. సర్వేలో 59.6శాతం మాదిగలు తాము టీడీపీకే ఓటు వేస్తామని చెప్పారు. వైసీపీకి 35.2శాతం మాదిగలు మద్దతు పలికారు. యాదవ ఓటర్లలో 57శాతం టీడీపీకి, 37.3శాతం వైసీపీకి సపోర్ట్‌గా ఉన్నారు. ఇక, యానాడిలు మాత్రం 2శాతం తేడాతో టీడీపీ వైపు అధికంగా మొగ్గు చూపారు.  ఇక, వర్గాల వారీగానూ ఓటర్ల చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు అధిక సంఖ్యలో టీడీపీకి మద్దతుదారులుగా నిలిచారు. 49.5శాతం మంది రైతులు తెలుగుదేశానికి ఓటేస్తామని చెప్పగా, 43.04శాతం రైతులు అధికార పార్టీకే తమ ఓటన్నారు. వ్యాపారుల్లో మాత్రం కాస్త వైసీపీ వైపే మొగ్గు కనబడింది. 47.2శాతం మంది ట్రేడర్స్ వైసీపీకి జై కొట్టగా, టీడీపీకి 45.2 శాతం వ్యాపారులు అండగా నిలిచారు.  ఇసుక విధానంతో తీవ్రంగా నష్టపోయిన రోజువారీ కూలీలు తిరుపతి ఎన్నికల్లో అధికార వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమైనట్టు ప్రీపోల్ సర్వేలో స్పష్టమవుతోంది. 44.7శాతం కూలీలు వైసీపీకి ఓటేస్తామంటే, 49.04శాతం కూలీలు టీడీపీ వైపు ఉన్నామన్నారు. 49.25శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు తెలుగుదేశానికి సపోర్ట్ చేయగా, వైసీపీకి 44.4శాతం సై అన్నారు. 49.2 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అధికార పార్టీకే ఓటేస్తామన్నారు. టీడీపీకి 45.5శాతం మద్దతు పలికారు. గృహిణిలు పెద్ద సంఖ్యలో 48.5శాతం మేర తెలుగుదేశానికి సపోర్ట్ చేయగా, వైసీపీకి 45.2శాతం ఓకే చెప్పారు. ఇక, ఓవరాల్‌గా అన్ని వర్గాలకు చెందిన మహిళల్లో 44.3శాతం వైసీపీకి, టీడీపీకి 48.7శాతం ఓటేసేందుకు సిద్ధమన్నారు. పురుషుల్లో టీడీపీకి 47.8శాతం, వైసీపీకి 44.7శాతం సపోర్టర్స్‌గా ఉన్నట్టు 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్' స్పష్టం చేస్తోంది. ఇక, అన్ని కేటగిరిల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, ఇతరులు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి.  తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగానూ ప్రీ పోల్ సర్వే నిర్వహించింది 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్'. నియోజక వర్గాల వారీగా ఓటర్ల నాడి మారిపోతోంది. అయితే, అధిక శాతం ఓటర్లు టీడీపీ వైపే ఆసక్తిగా ఉండటం ఆసక్తికరం. సర్వేపల్లి అసెంబ్లీ పరిధిలో 52.9శాతం మంది టీడీపీ గెలుస్తుందని చెప్పగా, 43.5శాతం వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 53.6శాతం టీడీపీకే ఓటేస్తామని చెప్పగా, కేవలం 41.5శాతం మంది వైసీపీకే తమ ఓటన్నారు. సూళ్లూర్‌పేట్‌లో వైసీపీ ఆధిపత్యం కనిపిస్తోంది. అక్కడ టీడీపీకి 43.4శాతం, వైసీపీకి 47.1శాతం మంది ఓటర్లు పట్టం కట్టారు. సత్యవేడులో 46.1శాతం మంది వైసీపీనే గెలుస్తుందని భావిస్తున్నా.. అక్కడి వారిలో 53.6శాతం తాము టీడీపీకే ఓటేస్తామని చెప్పడంతో అక్కడి ఓటర్ల నాడి పట్టడం కష్టంగా కనిపిస్తోంది. ఇక, శ్రీకాళహస్తి, గూడూర్ అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో 1శాతం తేడాతో హోరాహోరీ పోరు నడుస్తోంది. కీలకమైన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం దూసుకుపోతోంది. తిరుపతిలో ఏకంగా 53.3శాతం టీడీపీకి ఓటేస్తామని సర్వేలో తేల్చి చెప్పారు. వైసీపీకి 41శాతం మంది మాత్రమే మద్దతు ప్రకటించారు.  ఇలా.. వర్గాలు, ప్రాంతాల వారీగా చూస్తే.. తిరుపతి పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్' ప్రీ పోల్ సర్వేలో తేలిపోయింది. అధికార వైసీపీ రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సిందే. మిగతా పార్టీలు సోదిలోకి కూడా లేకుండా పోయేలా ఉన్నాయి. 

బాలికకు వేధింపులు.. ఆమె విషం తాగడంతో.. 

ఆమె తన కుటుంబంతో ఓ ఇంట్లో కిరాయికి ఉంటుంది. బతుకు దెరువుకోసం అమ్మ నాన్నలు చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నారు. కరోనా కారణంతో ఇంటి దగ్గరే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వింటుంది..అమ్మనాన్న ఉద్యోగానికి వెళితే రాత్రి అయితే గానీ రారు. ఇంట్లో  ఒంటరిగా ఉన్న అమ్మాయి పై ఆ ఇంటి ఓనర్ కొడుకు మధుసూదన్ రెడ్డి కన్ను పడింది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.. అప్పటికి ఆ అమ్మాయి కుదరదు అని తెగేసి తేల్చి  చెప్పింది. ఆయినా వినలేదు ఆ నీచుడు.. ఆమె తండ్రి ఫోన్‌కు కాల్‌ చేసి, బాలికను మాట్లాడమని వేధించేవాడు. ఆమె తండ్రి డ్యూటీ నుంచి వచ్చే భార్యను తీసుకురావడానికి రోజూ వెళ్తాడు. ఆ సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. విషయం తెలిసిన మధుసూదన్‌ రెడ్డి ఆ సమయంలో ఇంట్లోకి చొరబడి, తలుపులు మూసి బెదిరించి లై*గికదాడికి పాల్పడ్డాడు. ఆ తతంగాన్ని వీడియో కూడా తీశాడు. ఎవరికైనా చెబితే నీ తల్లిదండ్రులను చంపేస్తానని, వీడియోలు, ఫొటోలు బయటపెడతానని తరచూ లైంగికదాడికి పాల్పడేవాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె ఎదురుతిరిగింది. విషం తాగి చస్తా కానీ, లొంగనంటూ ప్రతిఘటించింది. అయినా, నిన్ను వదిలేది లేదంటూ.. కావాలంటే చచ్చిపో అంటూ విషం తెచ్చి ఇచ్చాడు. రోజూ అతడి చేతిలో చావటం కంటే, ఒకేసారి చనిపోదామని ఆ బాలిక విషం తాగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తనపై జరిగిన దారుణాలను పోలీసులకు వివరిస్తూ కన్నీటి కన్నీరు కార్చింది.  ఈ నెల 10న బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో మరోసారి లై*గికదాడికి యత్నించగా, ఆమె ప్రతిఘటించింది. బలవంతం చేస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరించింది. అయితే, మధుసూదన్‌ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఉన్న బాలిక దగ్గరకు వచ్చి ‘నాకు లొంగితే సరే.. లేదంటే చచ్చిపో’ అంటూ విషం బాటిల్‌ ముందు పెట్టాడు. దీంతో ఆమె విషం తాగింది. ఆమె పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించారు. బాలిక స్ప్రహలోకి రావడంతో పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో ఆమె జరిగిన విషయం చెప్పడంతో పాటు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరింది. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.    

పులివెందుల పిల్లి పారిపోయింది..

‘‘సవాల్ చేసా. వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసా. ఛాలెంజ్‌కి భయపడి పులివెందుల పిల్లి పారిపోయింది. ఈ రోజు బాబాయ్ మర్డర్ మిస్టరీ వీడిపోయింది. బాబాయ్‌ని వేసేసింది అబ్బాయే’’ అంటూ నారా లోకేశ్ ట్విట్టర్‌లో మండిపడ్డారు. #WhoKilledBabai అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు. ఆ వెంటనే అది ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది.  అలిపిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌  ప్రమాణం చేశారు. వివేకా హత్యలో తనకుగానీ, తమ కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి పాత్ర లేదని.. వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి జగన్‌రెడ్డి బయటికి రాలేదన్నారు. చెల్లికి న్యాయం చేయలేనివాడు మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? అని ప్రశ్నించారు లోకేశ్.  వైఎస్ వివేకా హత్యలో జగన్‌రెడ్డి పాత్ర ఉంది, అందుకే ఆయన రాలేదన్నారు. తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చి ప్రమాణం చేశామన్నారు. కత్తులతో బతికే చరిత్ర ఏ కుటుంబానిదో ప్రజలకు తెలుసన్నారు. జగన్‌రెడ్డి సొంత కుటుంబ సభ్యుల్ని చంపాడని ఆరోపించారు.  అంతకుముందు.. అలిపిరి సర్కిల్‌లో ప్రమాణం చేసేందుకు సీఎం జగన్ కోసం గంటకుపైగా వేచి చూశారు నారా లోకేశ్. అ సమయంలో జగన్‌పై సంచనల వ్యాఖ్యలు చేశారు. ‘కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడు.. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో’ అన్నారు లోకేశ్.  ‘‘నారాసుర రక్తచరిత్ర అంటూ దొంగవార్తలు రాశారు. మా కుటుంబానికి రక్తచరిత్ర లేదు. నాకు, నా కుటుంబ సభ్యులకుగానీ ఎలాంటి పాత్ర లేదని ఆ వేంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేస్తామని ఏప్రిల్ 7న సూళ్లూరుపేటలో సవాల్ చేశా. నేను అలిపిరిలో ఉన్నా.. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి సీఎం జగన్‌ రాగలరా.. వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే జగన్‌ను అలిపిరి తీసుకురావాలి. మా కుటుంబానికి వివేకా హత్య కేసుకు సంబందం లేదని ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. 24 నెలలు గడిచినా సీబీఐ విచారణ ఎందుకు వద్దంటున్నారు. బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోవాలని జగన్‌కు లేదా?’’ అని ప్రశ్నించారు నారా లోకేశ్.  జగన్ పెద్ద దొంగ.. ఏ2 విజయ్ సాయిరెడ్డి చిన్న దొంగ. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని విజయసాయిరెడ్డి అన్నారు. మూడు గంటల తర్వాత పోలీసుల విచారణలో ఆయనను గడ్డపారతో చంపారని తేలింది. పోస్టుమార్టం జరగకముందే సాక్షాలు లేకుండా ఆరోజే చెరిపేశారు. ఆ సమయంలో గంగిరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులందరూ సీన్‌లో ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత మాట మార్చారు. లోకేశ్‌కు, చంద్రబాబుకు హస్తం ఉందని ఆరోపించారు. తాతను, వివేకాను చంపింది మేమేనన్నారు. సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసి కూడా ఇదే చెప్పారు. మరి సీఎం అయ్యాక సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదంటూ మండిపడ్డారు నారా లోకేశ్. 

యోగి కి కరోనా.. 

దేశం లో కరోనా సెకండ్ వేవ్ చుక్కలు చూపిస్తుంది. రోజుకి వేయిల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యం లో తాజాగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కరోనా బారిన పడ్డారు. తనకు పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు యోగి వెల్లడించారు. ఇప్పటికే ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి కరోనా సోకడంతో మంగళవారం ఆదిత్యనాథ్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రోజు వారి కార్యక్రమాలను వర్చువల్‌గా ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. తనను ఇటీవల కలిసిన వారందరూ కొవిడ్‌ పరీక్షలు చేసుకోవాలని సీఎం కోరారు.    మరోవైపు ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు కూడా కరోనా సోకింది. ఇటీవల హరిద్వార్‌ కుంభమేళాలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. వైరస్‌ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.  

తొక్కిపడేస్తా.. నిరుద్యోగికి మంత్రి వార్నింగ్

నీలాంటి కుక్కలను చాలా మందిని చూశా. నిన్ను, నీ నాయకుడ్ని తొక్కిపడేస్తా. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిపై నిలదీసిన ఓ యువకుడిని మంత్రి జగదీశ్‌రెడ్డి ఇలా బెదిరించారు. పరుష పదజాలంతో దూషించారు. మంత్రి మాటలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తెలంగాణలో లక్షలాదిగా ఉన్న నిరుద్యోగులను మంత్రి జగదీశ్‌రెడ్డి అవమానించారని.. అందుకు ఆయనకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో అనుముల మండలం కొత్తపల్లిలో మంత్రి మాట్లాడుతుండగా ఆయన వాహనం దగ్గరకు అదే గ్రామానికి చెందిన నిరుద్యోగి అలుగుల అశోక్‌రెడ్డి వచ్చాడు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగభృతి హామీ ఏమైందని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన మంత్రి నీలాంటి కుక్కలను చాలా మందిని చూశానని, కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ‘నిన్ను, నీ నాయకుణ్ని తొక్కిపడేస్తా’నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుణ్ని అక్కడి నుంచి పంపించి వేశారు. ఎమ్మెస్సీ చేసిన అశోక్‌రెడ్డి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశాడు. లాక్‌డౌన్‌ తర్వాత ఇంటికి వచ్చాడు. పొలం పనులు చూసుకుంటున్నాడు. ఉద్యోగం వచ్చినా బాగుండు.. అప్పటి వరకూ నిరుద్యోగ భృతి ఇచ్చినా ఇబ్బంది లేకుండా ఉండని భావించి.. తమ ఊరికి వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డిని ఇలా ప్రశ్నించాడు. మంత్రి బెదిరింపులపై తెలంగాణ యువత మండిపడుతోంది. మంగళవారం ఈ ఘటన జరగ్గా.. బుధవారం మంత్రి జగదీశ్‌రెడ్డికి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు నిరుద్యోగులు. వెంటనే మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

భర్తకు కరోనా.. భార్య ఉరి.. 

ఆ ఇద్దరిని మూడు ముళ్ళు  కలిపింది. ఏడు అడుగులు నడిచారు. ధర్మేచ్చ, ఆరితేచ్ఛ, కామేచ్ఛ, మోక్షేష, నాతిచరామి అనే పాదాలను తూచా తప్పక పాటించాలనుకుంది. అందుకే భర్తకు కరోనా వచ్చిందని తెలిసి.. ఆమె ప్రాణాలు విడిచింది. ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటు చేసుకుంది.       భర్తకు కొవిడ్ సోకిందని ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్‌ బస్తీకి చెందిన సుద్దాల మొండయ్యకు రెండు వారాల కిందట కరోనా సోకింది. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం మొండయ్య భార్య జలజ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో భర్తకు కరోనా సోకిందనే మనస్తాపంతో మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

వాలంటీర్ సూసైడ్.. 

ఆమె ఒక విద్యా వాలంటీర్. పేరు పాలకూరి శైలజ. ఆమె భర్త సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. కరోనా వచ్చింది. అందరి కడుపు కొట్టింది. అలాగే ఈ దంపతుల కడుపు మాడ్చింది. 15 నెలలుగా పాఠశాలలు మూయడంతో జీతాలు లేదు. పోనీ భర్త జీతం అయినా వస్తుందంటే అది రెన్యూవల్ కాకపోవడంతో జీతాలు లేక వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనితో పూటగడవడం కష్టమైంయింది. బతకడానికి దారులు కనిపించలేదు. దాంతో మనస్తాపానికి గురైన శైలజ.. చనిపోదామని నిర్ణయించుకుంది. నల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలోకి వెళ్లి రైల్ కిందపడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శైలజ మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.    నోటిఫికెషన్స్ ఇవ్వడం లేదని ఈ మధ్య కాలం లోనే ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్నీ కూడా ప్రభుత్వం ఐఏఎస్ నోటిఫికేషన్ ఎవరు ఇస్తారో తెలియదా..? అంటూ ప్రతి విమర్శ చేయడమే తప్ప.. తప్పుని ఒప్పుకునే పరిస్థితి లేదు ప్రభుత్వానికి. ఇది ఇలా ఉంటే ఎప్పుడు వస్తుందే తెలియని ఆ నోటిఫికేషన్ కోసం విద్యార్థులు కోచింగ్ సెంటర్స్ గేట్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహ నా పెళ్ళంటా సినిమాలో కోడిని గుమ్మానికి కట్టేసి చికెన్ కూర తిన్నట్లు ఉంది నిరుద్యోగుల పరిస్థితి. ఆ విద్యార్థులు ఆవేదన మాత్రం దొర ఫామ్ హౌస్ కి వినిపించడం లేదు. విన్న పట్టించుకునే తీరు లేదు. తెలంగాణ వస్తే సామాన్యుడి బతుకు భరోసా ఉంటది అనుకుంటే.. తెలంగాణ వచ్చాక అదే సామాన్యుడి బతుకుకు మెతుకు కరువైయింది. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసినవాళ్లు ఒక్కడైతే.  ఆ తెలంగాణ ఫలాలు అందుకుని మింగుతుంది మరొకడు. ఒకటి కాదు, రెండు కాదు,  నాలుగు కోట్ల గొంతులు ఒక్కటై.. దిక్కులన్నీ చుట్టి.. చేయి ఎత్తి జై కొట్టి, ఎందరో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న బంగారు తెలంగాణ నిరంకుశత్వంలో ఉండిపోయింది. ఉద్యోగాలు లేవు.. ఉపాధి లేదు... తప్పును ప్రశ్నించే గళాలు లేవు. అని గతి తప్పిన జీవితాలే తప్ప .. గమనం ఉన్న జీవితాలు లేవు.. తెగించి తెచ్చుకున్న తెలంగాణాలో సామాన్యుడి బతుకు కత్తిమీద సాము గా మారింది. సామాన్యుల ప్రాణాలకు విలువలేదు.  తెలంగాణ కోటి రతనాల వీణ.. ఆ మాటకు సమాధి కట్టింది నేటి ప్రభుత్వం.  

10 పరీక్షలు రద్దు.. 12 వాయిదా.. 

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలను కేంద్ర విద్యాశాఖ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. అయితే 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.    దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి.. పాఠశాలల మూసివేత నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జరిగే సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాం. బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. జూన్‌ 1న కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం 12వ తరగతి పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటాం. పరీక్షలు ప్రారంభించడానికి 15 రోజుల ముందుగానే వివరాలను ప్రకటిస్తాం’’ అని కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు.    కరోనా విజృంభణ దృష్ట్యా వార్షిక పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్లు చేసిన  నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయి పరీక్షలపై చర్చలు జరిపారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ప్రధాని చెప్పినట్లు రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. అకడమిక్‌ ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని మోదీ సూచించినట్లు తెలిపారు.  సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ‘‘వెల్‌డన్ మోదీజీ....’’ అంటూ ప్రశంసించింది. కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ట్వీట్ చేసింది. ‘‘వెల్‌డన్ మోదీజీ... మా సలహా పాటించారు. దేశ హితం కోసం రాహుల్, ప్రియాంక ఎంత దూరమైనా ప్రయాణిస్తారు. ప్రజల మెరుగైన భవిష్యత్ కోసం కలిసి పనిచేయడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక విధి. అహంకారం కంటే దేశ శ్రేయస్సుకే పెద్దపీట వేశారు’’ అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.  సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4 నుంచి జరగాల్సిన పరీక్షలపై చర్చించేందుకు ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, ఇతర సీనియర్ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై చర్చించారు. అనంతరం టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి పరీక్షల కోసం కొత్త తేదీలను విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ పేర్కొంది.  

జగన్‌పై డైలాగ్స్ గన్

లక్ష లంచం తీసుకున్న బంగారు లక్ష్మణ్ జైలుకెళ్లారు. మారుతీ కారు కొన్న లాలూ ప్రసాద్ యాదవ్‌కూ జైలు శిక్ష పడింది. వేల కోట్లు సంపాదించిన జగన్ కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. అంటూ హాట్ కామెంట్స్ చేశారు తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్. తండ్రిని అడ్డుపెట్టుకొని జగన్ వేల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడించి జగన్‌కు బుద్ధి చెప్పాలన్నారు చింతా మోహన్.  ఏపీ సీఎం జగన్ అన్నిట్లోనూ అసమర్థుడంటూ ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఘాటైన విమర్శలు చేశారు. వాలంటీర్లతో ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు వేయనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, జనసేన అంటే అధికార పార్టీ భయపడుతోందని అన్నారు. ఇలా, తిరుపతి ఎన్నికల సాక్షిగా సీఎం జగన్ దుమ్ముదులిపేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు.

మళ్లీ జనతా కర్ఫ్యూ.. 15 రోజుల పాటు..

మళ్లీ జనతా కర్ఫ్యూ. కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. అత్యవసరం కాని షాపులు, పరిశ్రమలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.  మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతా ఒక్కసారిగా యావత్ దేశం ఉలిక్కిపడింది. దేశానికి ఆర్థిక రాజధాని అయిన ముంబైతో సహా మహారాష్ట్ట్ర వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఏకంగా 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ అంటే తమ పరిస్థితి ఏంటని వ్యాపారులు, కార్మికులు, కూలీలు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే వలస కూలీలంతా మళ్లీ సొంతూళ్ల బాట పట్టారు. దీంతో, ముంబై లోక్‌మాన్య తిలక్ టెర్మినల్‌లో రద్దీ విపరీతంగా పెరిగింది. 

ఇంటింటికీ మటన్, మద్యం.. ఓటర్లకు పండగే పండగ..

మద్యం, మాంసం. ఎన్నికల వేళ ఓటర్లకు పార్టీల తాయిళం. ఉగాది వేళ ఓ ప్రధాన పార్టీ ఇంటింటికీ కిలో మటన్, మందు బాటిల్‌ను పంపిణీ చేయడం కలకలం రేపింది. ఆ విషయం తెలిసి ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన మరో పార్టీ.. తామేమైనా తక్కువా అంటూ.. వారికి పోటీగా కిలో చికెన్‌ను ఓటర్లకు పంచింది. మరో గ్రామంలో పండగ ఖర్చుల కోసమంటూ కుటుంబానికి 500 ఇచ్చారు. ఎన్నికల పుణ్యమా అంటూ పైసా ఖర్చు లేకుండా ఉగాది పండగ ఖర్చులన్నీ వెళ్లిపోయాయి అక్కడి వారికి. ఇదంతా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జరిగిన ఎన్నికల ప్రచార పదనిసలు.  పోలింగ్‌కు మరో నాలుగు రోజులుండగానే పలు మండలాల్లో రెండు ప్రధాన పార్టీలు జోరుగా మద్యం, మాంసం పంచుతున్నాయి. మాడుగులపల్లి మండలం గజలాపురం, కొణతాలపల్లి, కన్నెకల్‌, గారుకుంటపాలెం తదితర గ్రామాల్లో మంగళవారం ఉగాది సందర్భంగా ఓ ప్రధాన పార్టీ కిలో మటన్‌, మద్యం సీసాను ఇంటింటికీ పంపిణీ చేసింది. ఇది తెలిసి మరో రాజకీయ పార్టీ నాయకులు కిలో చికెన్‌ను పంపిణీ చేశారు. నిడమనూరు మండలంలోని రెండు గ్రామాల్లో ఒక ప్రధాన పార్టీ పండగ ఖర్చులకు కుటుంబానికి రూ.500 ఇచ్చింది. ఉప ఎన్నికల పేరుతో నెల రోజులుగా తాగేవాళ్లకు తాగినంత. తినేవారికి తిన్నంత. ఈ ఏడాది పైసా ఖర్చు లేకుండా ఉగాది పండగ. అందుకే అంటారు కాబోలు ఓట్ల పండగని.

షూటింగ్స్ బంద్.. కరోనా ఎఫెక్ట్..

అవును, మీరు చదివింది నిజమే. సినిమా షూటింగ్స్ ప్యాకప్. కేవలం సినిమాలే కాదు, టీవీ సీరియల్స్, యాడ్స్ షూటింగ్స్ కూడా నిలిపివేశారు. కరోనా కేసుల సంఖ్యను కట్టడి చేసేందుకు బుధవారం సాయంత్రం నుంచి షూటింగ్స్ చిత్రీకరణను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా చైన్ ను బ్రేక్ చేసేందుకు బుధవారం రాత్రి 8గంటల నుంచి మే 1వతేదీ ఉదయం 7గంటల వరకు కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తారు.  షూటింగుల నిలిపివేత నిర్ణయం తమకు భారీ షాక్ అని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బీఎన్ తివారీ చెప్పారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగులు జరుపుతున్నామని, దీనికి తమను అనుమతించాలని కోరుతూ తాము సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాయాలని భావిస్తున్నట్టు తివారీ చెప్పారు. షూటింగుల నిలిపివేతతో అమితాబ్ బచ్చన్ ‘గుడ్ బై’, షారూఖ్ ఖాన్ ‘పఠాన్’, సల్మాన్ ఖాన్ ‘టైగర్3’ సినిమాల షూటింగ్ నిలిచిపోయింది. మహారాష్ట్ర మాదిరే మన టాలీవుడ్‌లోనూ షూటింగ్స్ ఆపేస్తారా? అనే భయం తెలుగు సినీ పరిశ్రమను వేధిస్తోంది.

జగన్‌రెడ్డి.. వెయిటింగ్ ఇక్కడ..

‘కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడు.. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.  అలిపిరి మే సవాల్. జగన్‌రెడ్డికి నారా లోకేశ్ ఛాలెంజ్. వైఎస్ వివేక హత్య కేసుపై అలిపిరిలో ప్రమాణం చేద్దాం రమ్మంటూ సీఎం జగన్‌కు ఇటీవల సవాల్ విసిరారు లోకేశ్. అందుకు, ఇవాళ ముహూర్తం ఫిక్స్ చేశారు. అలిపిరి సర్కిల్‌కు చేరుకొని బైఠాయించారు. ప్రమాణానికి సిద్ధమయ్యారు.  ‘‘నారాసుర రక్తచరిత్ర అంటూ దొంగవార్తలు రాశారు. మా కుటుంబానికి రక్తచరిత్ర లేదు. నాకు, నా కుటుంబ సభ్యులకుగానీ ఎలాంటి పాత్ర లేదని ఆ వేంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేస్తామని ఏప్రిల్ 7న సూళ్లూరుపేటలో సవాల్ చేశా. నేను అలిపిరిలో ఉన్నా.. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి సీఎం జగన్‌ రాగలరా.. వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే జగన్‌ను అలిపిరి తీసుకురావాలి. మా కుటుంబానికి వివేకా హత్య కేసుకు సంబందం లేదని ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. 24 నెలలు గడిచినా సీబీఐ విచారణ ఎందుకు వద్దంటున్నారు. బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోవాలని జగన్‌కు లేదా?’’ అని ప్రశ్నించారు నారా లోకేశ్.  జగన్ పెద్ద దొంగ.. ఏ2 విజయ్ సాయిరెడ్డి చిన్న దొంగ. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని విజయసాయిరెడ్డి అన్నారు. మూడు గంటల తర్వాత పోలీసుల విచారణలో ఆయనను గడ్డపారతో చంపారని తేలింది. పోస్టుమార్టం జరగకముందే సాక్షాలు లేకుండా ఆరోజే చెరిపేశారు. ఆ సమయంలో గంగిరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులందరూ సీన్‌లో ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత మాట మార్చారు. లోకేశ్‌కు, చంద్రబాబుకు హస్తం ఉందని ఆరోపించారు. తాతను, వివేకాను చంపింది మేమేనన్నారు. సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసి కూడా ఇదే చెప్పారు. మరి సీఎం అయ్యాక సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదంటూ మండిపడ్డారు నారా లోకేశ్.