సుప్రీంకోర్టులో సగం మందికి కరోనా! దేశంలో మహమ్మారి పంజా
posted on Apr 12, 2021 @ 10:43AM
దేశంలో కరోనా మహమ్మారి మరింత తీవ్రమైంది. ఏ రోజుకారోజు కరోనా కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బంది మహమ్మారి బారిన పడ్డారు. శనివారం ఒక్క రోజే 44 మంది సిబ్బంది కరోనా పాజిటివ్‌గా తేలింది. సిబ్బందిలో చాలా మందికి కరోనా సోకడంతో సుప్రీంకోర్టులో కలకలం రేపుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు రూముతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చేశారు. కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్ బాధితులుగా మారడంతో ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసులను విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. కోర్టు బెంచ్‌లన్నీ సోమవారం గంట ఆలస్యంగా కేసుల విచారణను ప్రారంభించాయి. గతంలో కొంతమంది న్యాయమూర్తులు కరోనా బారినపడినా ఆ తర్వాత కోలుకున్నారు.
దేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఇంతకాలం మహారాష్ట్రనే పీడించిన మహమ్మారి.. చాపకింద నీరులా దేశం మొత్తం విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 904 మంది చనిపోయారు. ఒక్క రోజులో ఇంత మంది మరణించడం ఇదే రికార్డ్. ఆదివారం దేశవ్యాప్తంగా 11,80,136 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,68,912 మందికి పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తంగా వైరస్ బారిన పడినవారి సంఖ్య కోటీ 35లక్షలకు చేరగా.. లక్షా 70వేలకు పైగా మరణాలు సంభవించాయి. కరోనా విజృంభణ తీవ్రంగా ఉండటంతో..బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 12,01,009కి చేరాయి. మొత్తంగా కోటీ 20లక్షల మందికిపైగా కొవిడ్‌ను జయించగా.. ఆ రేటు 90.44 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు టీకా డోసులు తీసుకున్నవారికి సంఖ్య 10,45,28,565కి చేరింది.
కరోనావైరస్ రెండో దశకు మహారాష్ట్ర కేంద్రంగా మారింది. ఆదివారం మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 63,294 మందికి వైరస్ సోకింది. 349 మంది చనిపోయారు. అక్కడ ప్రస్తుతం 5,67,097 క్రియాశీల కేసులున్నాయి. గతంలో ఎన్నడూ లేని తీవ్రత కనిపిస్తుండటంతో మహారాష్ట్ర ఆంక్షలను తీవ్రతరం చేసింది. లాక్‌డౌన్ విధింపుపై ఏప్రిల్ 14న ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దేశ రాజధాని దిల్లీ పరిస్థితి అలాగే ఉంది. అక్కడ అత్యధికంగా 10,774 కొత్త కేసులు వెలుగుచూశాయి. 48 మంది మరణించారు. కొవిడ్ తీవ్రత నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ విధించేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా లేదని చెప్పిన ఆయన.. ఒకవేళ ఆసుపత్రి వ్యవస్థ కుప్పకూలితే లాక్‌డౌన్ తప్పదని వివరించారు. గత దశలకంటే నాలుగో దశలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోందని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.