టీకా వేసుకుంటేనే ఆఫీసులోకి ఎంట్రీ
posted on Apr 11, 2021 @ 6:57PM
కరోనా మహమ్మారి రోజురోజుకు పంజా విసురుతుండటంతో తెలంగాణ సర్కార్ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆదేశించింది. వ్యాక్సిన్ వేయించుకుంటేనే కార్యాలయాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగులంతా ఈ నెల 15లోపు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది. 30వేల మంది సిబ్బందికి వ్యాక్సిన్ వేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొవిడ్ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మాస్క్ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధించాలని డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం దాదాపు 6 వందల వరకు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో మరో ఆరు వందల కేసులు వచ్చాయి. రాబోయే రెండు వారాల్లో కరోనా తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.