నిప్పుతో పెట్టుకోవద్దు.. చండ్ర నిప్పులు
posted on Apr 13, 2021 @ 9:32PM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో విశ్వరూపం చూపిస్తున్నారు చంద్రబాబు. నెల్లూరు జిల్లా గూడూరు సభలో సీఎం జగన్ పై నిప్పులు కురిపించారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారని, ఇదే చివరి అవకాశం కావాలని చంద్రబాబు అన్నారు. కరోనాను ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయిందని, ఏ సహాయం చేయలేదని విమర్శించారు. కరోనాతో సహజీవనం చేయాలని, బ్లీచింగ్ వేస్తే పోతుందని జగన్ జనజీవన వ్యవస్థని నాశనం చేశాడని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో మద్యం షాపులు తెరిచారని, చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలాపెట్టాడని చంద్రబాబు మండిపడ్డారుయ
రాష్ట్రంలో మద్యం ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ సొంత బ్రాండ్లు పెట్టి, సొంత షాపుల్లో అమ్ముతున్నాడంటే అంతకన్నా దారుణం ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు తెలుగు దేశం పాలనలో నీతివంతమైన పాలన అందించామని చెప్పారు. రాజకీయాల్లో రూపాయి ఆశించకుండా నిప్పులా బతుకుతున్నానని.. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నిప్పుతో పెట్టుకుంటే మాడి మసైపోతారని చంద్రబాబు హెచ్చరించారు.
ఇసుకను కమీషన్ల కోసం సొంత మనుషులకిచ్చారన్నారు చంద్రబాబు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక దొరికే పరిస్థితి లేదన్నారు. ఇసుక ధరలకి రెక్కలొచ్చాయి. ఇసుక దొరక్క 45 లక్షల మంది ఉపాధి కోల్పోయి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. సహజ వనరులని దోచేస్తున్నారు.. సిమెంట్ ధరలను అప్పట్లో నియంత్రించాం. జగన్‌కి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బ్రహ్మాండంగా ఇళ్లు నిర్మిస్తే, రెండేళ్లుగా అతీ, గతీ లేదు. నిత్యవసర సరుకుల ధరలు, కూరగాయలు అన్నీ రేట్లు పెరిగిపోయాయి.’’ అని చంద్రబాబు గూడురు రోడ్ షోలో ఆగ్రహం వ్యక్తం చేశారు.