పోటీ నుంచి తప్పుకుంటా! జానారెడ్డి సంచలనం
posted on Apr 13, 2021 @ 5:19PM
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక తెలంగాణలో కాక రేపుతోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ బరిలో ఉన్నా... ప్రస్తుతం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ సాగుతుందని తెలుస్తోంది. ఆ రెండు పార్టీల ముఖ్య నేతలంతా సాగర్ లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. గురువారం సాయంత్రంతో ప్రచారం ముగియనుండగా... బుధవారం హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభకు కొన్ని గంటల ముందు.. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జానా రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
సీఎం కేసీఆర్‌కు జానారెడ్డి సవాల్ విసిరారు. ఎల్‌ఎల్‌సీ-2లో 7వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరూపిస్తే సాగర్ ఉప ఎన్నికల పోటీ నుంచి తాను తప్పుకుంటానని ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలోనే 90శాతం వరద కాలువ పనులు పూర్తయ్యాయని జానారెడ్డి తెలిపారు.హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీగా విభజించి అన్ని అనుమతులు తెచ్చామని ఆయన పేర్కొన్నారు. సాగర్ లెఫ్ట్ కెనాల్‌పై లిఫ్ట్‌లపై కేసీఆర్ ఏనాడూ సమీక్ష చేయలేదని ఆయన విమర్శించారు. తన ఆలోచన ఫలితమే లెఫ్ట్ కెనాల్‌పై లిఫ్ట్‌లు అని జానారెడ్డి తెలిపారు.
టీఆర్‌ఎస్ వచ్చాక ఎన్నికలు కలుషితమయ్యాయని జానారెడ్డి వ్యాఖ్యానించారు. తనపై టీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలకు జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సాగర్‌లో ఏం చేశారని టీఆర్ఎస్‌కు ఓటేయాలని జానారెడ్డి ప్రశ్నించారు. ఉపఎన్నిక ఏకగ్రీవం కోసం కేసీఆర్ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని జానారెడ్డి తెలిపారు. కేసీఆర్ తనను అడిగి ఉంటే నోముల కుటుంబం కోసం పోటీ నుంచి తప్పుకునేవాడిని జానారెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ వచ్చాక ఎన్నికలు కలుషితమయ్యాయని జానారెడ్డి అన్నారు. డబ్బు, మద్యం, తప్పుడు హామీలతో ఓటర్లను మభ్యపెడుతున్నారని జానారెడ్డి విమర్శించారు.
మరోవైపు కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా హాలియాలో కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారని ఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌తో ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ వాహనాల్లో మద్యం, డబ్బు తరలిస్తున్నారని ఉత్తమ్ తెలిపారు. కేంద్ర బలగాలతో సాగర్ ఉప ఎన్నిక నిర్వహించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. సాగర్‌లో స్థానికేతర నాయకులను తక్షణమే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు. సీఎం ఒత్తిడితో అధికారులు ఎన్నికల నిబంధనలు పాటించడం లేదని ఉత్తమ్ ఆరోపించారు. కలెక్టర్‌కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంమని ఆయన ఫిర్యాదు చేశారు.