డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో?
posted on Apr 13, 2021 @ 3:46PM
తెలంగాణలో కొద్దిరోజులుగా సంచలనం రేపుతున్న బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఈ కేసుతో లింకులున్నాయన్న వార్తలు కలకలం రేపాయి. అయితే బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కలహార్‌రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన విషయాలు బయటపెట్టారు.
డ్రగ్స్ కేసులో మీడియాలో తనను ముద్దాయిగా చూపిస్తోందని కలహర్ రెడ్డి ఆరోపించారు. 3 సంవత్సరాల క్రితం బర్త్ డే పార్టీ కోసం బెంగళూరు వెళ్లానని చెప్పారు. ఆ పార్టీ గురుంచి స్టేట్ మెంట్ రికార్డు కోసమే బెంగుళూరు పోలీసులు తనను పిలిచారని తెలిపారు. అక్కడ స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చి వచ్చాను.. ఈ డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని కలహార్‌రెడ్డి స్పష్టం చేశారు. అనవసరంగా తమ పేరు ప్రచారం చేస్తుండటంతో కుటుంబ సభ్యులు ఇబ్బంది గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు ఉంటే వార్తలు రాసుకోండి కానీ అనవసరంగా తనను బ్లేమ్ చేయవద్దని వ్యాపారవేత్త కలహార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
బెంగళూరు పార్టీ లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా తనకు తెలియదన్నారు కలహర్ రెడ్డి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సందీప్ తో తనకు ముఖ పరిచయం మాత్రమే ఉందని.. అంతకుమించి ఎలాంటి సంబందం లేదని చెప్పారు. శంకర్ గౌడ్ తనకు ఐదు సంవత్సరాల నుండి తెలుసన్న కలహార్ రెడ్డి... డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
డ్రగ్స్ కేసులో సూత్రధారిగా ఉన్న కన్నడ సినీ నిర్మాత శంకరగౌడ ఏర్పాటు చేసే పార్టీలకు తెలంగాణకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యేవారని పోలీసులు గుర్తించినట్లు వార్తలొస్తున్నాయి.ప్రస్తుతం శంకరగౌడను విచారిస్తున్న పోలీసులు.. అతడి నుంచి తెలంగాణ ఎమ్మెల్యేల పేర్లను బయటకుతీసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే ఈ కేసులో ట్రావెల్స్ యాజమాని రతన్ రెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. శంకరగౌడ ఏర్పాటు చేసే పార్టీలకు తెలంగాణ ఎమ్మెల్యేలను తీసుకొచ్చే బాధ్యతను కలహర్ రెడ్డి, రతన్ రెడ్డి చూసుకునేవారని ప్రచారం జరిగింది. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు వీరిద్దరే కీలకంగా ఉన్నారని చెబుతున్నారు.
డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. వికారాబాద్, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఒక ఎమ్మెల్యే తన వెంట చాలామందిని తీసుకెళ్లేవారని పోలీసులు గుర్తించారంటున్నారు.