తిరుపతిలో అలజడికి కుట్ర!
posted on Apr 13, 2021 @ 5:38PM
తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తిరుపతి సభపై జరిగిన రాళ్ల దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. టీడీపీ సభలో అలజడి స్పష్టించాలని చూడటంపై తమ్ముళ్లు భగ్గుమంటున్నారు.తిరుపతి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. డిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను తెలుగు దేశం పార్టీ ఎంపీలు కలిశారు. సోమవారం తిరుపతిలో నిర్వహించిన చంద్రబాబు సభలో జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ వినతిపత్రం అందజేశారు.
తిరుపతి ఉపఎన్నికలో కేంద్ర బలగాల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహించాలని టీడీపీ ఎంపీలు కోరారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2లక్షల నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయని.. రెండు అదనపు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంలోని వాలంటీర్లను భాగస్వాములను చేయకుండా చూడాలని సీఈసీని కోరారు తెలుగు దేశం పార్టీ ఎంపీలు.
మరోవైపు తిరుపతి టీడీపీ సభలో రాళ్ల దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు నోటీసు ఇచ్చామని అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా టాటా తెలిపారు. ఘటనపై వెంటనే ఆధారాలు ఇవ్వాలని ఆయనకు నోటీసు ఇచ్చామని చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఐజీ మాట్లాడారు. చంద్రబాబు ప్రచార సభకు సరిపడా భద్రత కల్పించామని డీఐజీ చెప్పారు. రాళ్ల దాడి ఘటనలో పోలీసులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. అవి సరికాదన్నారు. చంద్రబాబు సభకు ఎలాంటి అంతరాయం కలగలేదని చెప్పారు. ఆయన ప్రచార వాహనానికి ఏ నష్టం జరగలేదన్నారు. దాడిపై ఆధారాలు ఇవ్వాలని ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలనూ కోరినట్లు డీఐజీ చెప్పారు.