జగన్ కు కౌంట్ డౌన్! తిరుపతిలో బీజేపీ చీఫ్ సిగ్నల్
posted on Apr 13, 2021 @ 12:28PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముప్పు ముంచుకొస్తుందా? వైసీపీ సర్కార్ కు గండమేనా? అంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సాక్షిగా జరుగుతున్న పరిణామాలతో రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా బీజేపీ పెద్దలు ఏపీపై పోకస్ పెంచడంతో.. వైసీపీ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందనే చర్చ జరుగుతోంది. రెండేళ్లుగా జగన్ సర్కార్ పై కొంత సాఫ్ట్ గా ఉన్న బీజేపీ నేతలు మాటల తీవ్రత పెంచడం ఆసక్తిగా మారింది.
తిరుపతి ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇదే సిగ్నల్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో జరిగిన సభలో ప్రసంగించిన బీజేపీ చీఫ్.. ఏపీ సీఎం జగన్ పై నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ అవినీతిమయమైందని, వైసీపీ ప్రభుత్వంలో విపరీతమైన బంధు ప్రీతి ఉందన్నారు. ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయని, ఇప్పటికే 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగినా జగన్ నిమ్మకు నీరెత్తినట్టున్నారని మండిపడ్డారు. నిందితులను అరెస్ట్ చేయడంలో జగన్ సర్కార్ విఫలమైందని, అందుకే దాడులు జరుగుతూనే ఉన్నాయని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కనుసన్నల్లో మత మార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారు నడ్డా. ఒక మతం కోసమే ప్రభుత్వం పని చేస్తున్నట్లు కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్రిస్టియానిటీ పెరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ఏపీలో విపరీతమైన అవినీతి ఉందని, లిక్కర్, శాండ్, ల్యాండ్, పోర్టుల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. ప్రతి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. జగన్ ఏపీని అప్పుల కుప్పగా మార్చారని, 4 లక్షల కోట్లకు ఏపీ అప్పులు చేరుకున్నాయన్నారు జేపీ నడ్డా.
తిరుపతి ప్రచారంలో జేపీ నడ్డా వ్యాఖ్యలతో వైసీపీ సర్కార్ ను బీజేపీ టార్గెట్ చేసిందనే చర్చ జరుగుతోంది. తిరుపతి ఎన్నికను సవాల్ గా తీసుకున్న హైకమాండ్.. జనసేన పోటీ చేయాలని భావించినా ఒప్పించి రిటైర్ట్ ఐఏఎస్ రత్నప్రభను బరిలోకి దింపింది. అంతేకాదు బీజేపీ-జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను ప్రకటించింది. దీంతో తిరుపతి ఎన్నికల తర్వాత బీజేపీ మరింత దూకుడు పెంచవచ్చని తెలుస్తోంది. 2014 ఎన్నికలే టార్గెట్ గా ప్రణాళికలు రచించారని చెబుతున్నారు. ఈ లెక్కన ఏపీలో త్వరలో రాజకీయ సంచనాలు జరగబోతున్నాయనే సమాచారం వస్తోంది.
సీఎం జగన్ పై ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులున్నాయి. ప్రతి శుక్రవారం విచారణ జరుగుతోంది. సీఎంగా ఉన్నందున జగన్ విచారణకు హాజరుకాకపోయినా... ఆయనతో పాటు కేసుల్లో ఉన్న నిందితులంతా కోర్టుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కేసుల్లోనూ కీలక పరిణామాలు జరగవచ్చంటున్నారు. సీఎం జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవధర్ పదేపదే చెబుతుండటం కూడా ఇందుకు బలాన్నిస్తోంది.
టీడీపీ నేతలు కూడా జగన్ బెయిల్ రద్దు కావడం ఖాయమంటున్నారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్ వేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో తమ భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీగా ఉన్నందునే సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారంటున్నారు.