రాజకీయ రేవ్ పార్టీ వేదికగా అసెంబ్లీ! రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
posted on Apr 13, 2021 @ 7:06PM
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత విశ్వరూపం చూపించారు. కరోనా సోకడంతో రెండు వారాల పాటు హోం ఐసోలేషన్ లో ఉన్న రేవంత్ రెడ్డి.. గత మూడు రోజులుగా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తున్నారు. మంగళవారం సాగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి... సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు.
దివంగత నోముల నర్సింహయ్యను కేసీఆర్ రాజకీయంగా బలహీనం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టిఆర్ఎస్ లో చేరిన తరువాత నోముల నర్సింహయ్య ను రాజకీయంగా కెసిఆర్ సమాధి చేశారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి , చంద్రబాబు ఉన్నప్పుడు శాసనసభలో ప్రజల సమస్యలపై నోముల నర్సింహయ్య కొట్లాడే వారన్నారు. నోముల టిఆర్ఎస్ పార్టీలో చేరి 2018 లో గెలిచిన తర్వాత శాసనసభలో రెండు సంవత్సరాలలో ఒక్క సారి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. నర్సింహయ్య టిఆర్ఎస్ లో చేరిన తర్వాతనే ప్రజల నుండి కనుమరుగై పోయారన్నారు రేవంత్ రెడ్డి.
నోముల నర్సింహయ్యను మంత్రి ఎందుకు చేయలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఆలుగడ్డలు అమ్ముకునే తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మంత్రి చేశారని విమర్శించారు. ఉప ఎన్నిక కోసం నోముల నర్సింహయ్య కుటుంబానికి తప్పించి మిగతా అందరి పేర్లు కెసిఆర్ పరిశీలించారన్నారు. దీని ద్వారా ఆయన ఆత్మకు శోభించ లేదా అని నిలదీశారు. చివరి నిముషంలో నోముల నర్సింహయ్య కొడుకుకి టికెట్ ఎనౌన్స్ చేశారన్నారు. నాగార్జునసాగర్లో జానారెడ్డి గెలుపు ఖాయమైంది కాబట్టే నోముల నర్సింహయ్య కొడుకుకి చివరి నిమిషంలో టికెట్ ఇచ్చారని విమర్శించారు. నాగార్జునసాగర్ ఓటమిని నోముల నర్సింహయ్య కుటుంబం ఖాతాలో వెయాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి.
రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు రాజకీయ ప్రత్యర్దులయిన రాజకీయ సంప్రదాయం కాపాడటానికి కృషి చేశారన్నారు రేవంత్ రెడ్డి. 26 మంది ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పై పీజేఆర్ ఒంటికాలితో పోరాటం చేశారన్నారు. తెలంగాణకు పెద్దన్న పాత్ర పోషించింది జానారెడ్డి కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణను సాధించింది జానారెడ్డే అన్నారు. శాసనసభను కేసిఆర్ కల్లు కాంపౌండ్ లా మార్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శాసనసభలో చర్చ లు లేవు.. ప్రజల సమస్యలు పరిష్కారాలు లేవని విమర్శించారు. రాజకీయ రేవ్ పార్టీ వేదికగా శాసనసభను కేసీఆర్ మార్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
గులాబీ వనంలో కేసీఆర్ గంజాయి మొక్కలను పెంచి పోషించారన్నారు రేవంత్ రెడ్డి. గులాబీ వనంలో ఉన్న గంజాయి మొక్కలను, చీడపీడలను జానారెడ్డి ఎత్తిచూపుతాడని కెసిఆర్ కక్ష కట్టారని ఆరోపించారు. అందుకే ఆయనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జానారెడ్డి సవాల్ ను ఒప్పుకోకుండా ఎందుకు తప్పించుకు తిరిగారో సాగర్ లో సభలో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతుందని నిఘా వర్గాలు నివేదిక ఇవ్వడం వల్లే కెసిఆర్ రెండోసారి బహిరంగ సభకు వస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.