కరోనా వస్తే జీవితాంతం నరకమేనా!
posted on Apr 14, 2021 @ 10:01AM
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ ఉధృతి మొదటి దశ కంటే భయంకరంగా ఉంది. పలు రాష్ట్రాల్లో హాస్పిటల్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. వైరస్ లోడు ఎక్కువగా ఉంటుండటంతో ఎక్కువ మంది ఆక్సిజన్ అవసరం అవుతోంది. దేశంలో కరోనా మరణాలు కూడా ఆందోళన కల్గిస్తున్నాయి.
కరోనా గురించి మరో ఆందోళనకరమైన వార్త బయటికి వచ్చింది. కరోనా సోకి ఎలాగోలా కోలుకున్నప్పటికీ వైరస్ ప్రభావంతో చాలా మందికి ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిపై పరిశోధనలు చేసిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు పలు కొత్త విషయాలను గుర్తించారు. కరోనా సోకి కోలుకున్న బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నాడీ సమస్యలు లేదా మానసిక జబ్బుల బారినపడుతున్నారని తేల్చారు. కరోసా సోకిన ఆరు నెలల్లోనే ఏకంగా సుమారు 34 శాతం మందిపై ఆ ప్రభావం కనపడింది. కరోనా నుంచి కోలుకున్న 17 శాతం మందిలో ఆందోళన, 14 శాతం మందిలో మూడ్ మారిపోయే సమస్యలు ఎదురవుతున్నాయి.
13 శాతం మంది మొట్టమొదటిసారి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెదడులో రక్తస్రావం 0.6 శాతం, పక్షవాతం 2.1 శాతం, మతిమరుపు 0.7 శాతం మందిలో కనపడుతున్నాయి. కరోనా తీవ్రత అధికంగా ఉండి కోలుకున్న వారిలో నాడీ సమస్యల వంటి దీర్ఘకాలిక సమస్యలు ప్రధానంగా కనపడుతున్నాయి. ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కన్నా కరోనా చాలా ప్రమాదకరమని పరిశోధకులు తెలిపారు. ఫ్లూతో పోల్చి చూస్తే కరోనా ప్రభావం వల్ల నాడి, మానసిక సమస్యల ముప్పు 44 శాతం అధికంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. శ్వాసకోశ జబ్బులతో పోలిస్తే కరోనా వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ముప్పు 16 శాతం అధికంగా ఉందని చెప్పారు.
కరోనాకు సంబంధించి మరో షాకింగ్ విషయం బయటికి వచ్చింది. ఇంతకాలం కరోనా వైరస్ యువతను ఏం చేయదులే అనే భరోసాలో ఉండగా.. సెకండ్‌వేవ్‌లో పరిస్థితి తల్లకిందులైంది. ప్రస్తుతం యువతే ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరుతున్నవారిలో 45 ఏళ్ల లోపు వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా యువతే చికిత్స తీసుకుంటున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కరోనా బాధితులలో అధిక శాతం మంది 50 ఏళ్లపైబడిన వారే ఉండేవారు. ఆస్పత్రుల్లో చేరేవారు, వెంటిలేటర్ అవసరమయ్యేవారు.. 60 ఏళ్లు పైబడినవారే ఎక్కువగా ఉండేవారు. వారిలో ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అదే పరిస్థితి 40 ఏళ్లలోపువారిలో కూడా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు.
25 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలోకూడా ఆక్సిజన్, వెంటిలేటర్ పెట్టాల్సి వస్తోందని వారు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మాకు ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో ఉండడమే ఇందుకు కారణమని వైద్యులు తెలిపారు. చాలామంది తమ స్నేహితులతో దగ్గరగా మసలడం, ఆలింగనం చేసుకోవడం, చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, ఒకే బైక్‌పై ఇద్దరు, ముగ్గురు ప్రయాణం చేయడం, మాస్కులు పెట్టుకోకపోవడంతో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. సిగరెట్‌ను షేర్ చేసుకోవడం వల్ల వైరస్ నేరుగా ఒకరి నుంచి మరొకరి నోటిలోకి ప్రవేశిస్తోంది. దీనివల్ల వైరల్ లోడ్ కూడా ఎక్కువగా ఉంటోంది. ఒకరికొకరు దగ్గరగా ఉన్నప్పుడు పాజిటివ్ వ్యక్తులు దగ్గితే.. ఆ తుంపర్లు నేరుగా ఎదుటి వ్యక్తి ముక్కులోకి, నోటిలోకి ప్రవేశిస్తున్నాయి. వైరస్ అత్యంత వేగంగా ఊపరితిత్తులకు పాకుతోంది.