తొక్కిపడేస్తా.. నిరుద్యోగికి మంత్రి వార్నింగ్
posted on Apr 14, 2021 @ 2:57PM
నీలాంటి కుక్కలను చాలా మందిని చూశా. నిన్ను, నీ నాయకుడ్ని తొక్కిపడేస్తా. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిపై నిలదీసిన ఓ యువకుడిని మంత్రి జగదీశ్‌రెడ్డి ఇలా బెదిరించారు. పరుష పదజాలంతో దూషించారు. మంత్రి మాటలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తెలంగాణలో లక్షలాదిగా ఉన్న నిరుద్యోగులను మంత్రి జగదీశ్‌రెడ్డి అవమానించారని.. అందుకు ఆయనకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో అనుముల మండలం కొత్తపల్లిలో మంత్రి మాట్లాడుతుండగా ఆయన వాహనం దగ్గరకు అదే గ్రామానికి చెందిన నిరుద్యోగి అలుగుల అశోక్‌రెడ్డి వచ్చాడు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగభృతి హామీ ఏమైందని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన మంత్రి నీలాంటి కుక్కలను చాలా మందిని చూశానని, కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ‘నిన్ను, నీ నాయకుణ్ని తొక్కిపడేస్తా’నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుణ్ని అక్కడి నుంచి పంపించి వేశారు.
ఎమ్మెస్సీ చేసిన అశోక్‌రెడ్డి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశాడు. లాక్‌డౌన్ తర్వాత ఇంటికి వచ్చాడు. పొలం పనులు చూసుకుంటున్నాడు. ఉద్యోగం వచ్చినా బాగుండు.. అప్పటి వరకూ నిరుద్యోగ భృతి ఇచ్చినా ఇబ్బంది లేకుండా ఉండని భావించి.. తమ ఊరికి వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డిని ఇలా ప్రశ్నించాడు. మంత్రి బెదిరింపులపై తెలంగాణ యువత మండిపడుతోంది. మంగళవారం ఈ ఘటన జరగ్గా.. బుధవారం మంత్రి జగదీశ్‌రెడ్డికి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు నిరుద్యోగులు. వెంటనే మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.