10 పరీక్షలు రద్దు.. 12 వాయిదా..
posted on Apr 14, 2021 @ 2:41PM
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలను కేంద్ర విద్యాశాఖ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. అయితే 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి.. పాఠశాలల మూసివేత నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జరిగే సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాం. బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. జూన్ 1న కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం 12వ తరగతి పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటాం. పరీక్షలు ప్రారంభించడానికి 15 రోజుల ముందుగానే వివరాలను ప్రకటిస్తాం’’ అని కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విటర్‌లో వెల్లడించారు.
కరోనా విజృంభణ దృష్ట్యా వార్షిక పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్లు చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయి పరీక్షలపై చర్చలు జరిపారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ప్రధాని చెప్పినట్లు రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. అకడమిక్ ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని మోదీ సూచించినట్లు తెలిపారు.
సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ‘‘వెల్‌డన్ మోదీజీ....’’ అంటూ ప్రశంసించింది. కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ట్వీట్ చేసింది. ‘‘వెల్‌డన్ మోదీజీ... మా సలహా పాటించారు. దేశ హితం కోసం రాహుల్, ప్రియాంక ఎంత దూరమైనా ప్రయాణిస్తారు. ప్రజల మెరుగైన భవిష్యత్ కోసం కలిసి పనిచేయడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక విధి. అహంకారం కంటే దేశ శ్రేయస్సుకే పెద్దపీట వేశారు’’ అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4 నుంచి జరగాల్సిన పరీక్షలపై చర్చించేందుకు ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, ఇతర సీనియర్ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై చర్చించారు. అనంతరం టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి పరీక్షల కోసం కొత్త తేదీలను విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ పేర్కొంది.