ఇంటింటికీ మటన్, మద్యం.. ఓటర్లకు పండగే పండగ..
posted on Apr 14, 2021 @ 1:02PM
మద్యం, మాంసం. ఎన్నికల వేళ ఓటర్లకు పార్టీల తాయిళం. ఉగాది వేళ ఓ ప్రధాన పార్టీ ఇంటింటికీ కిలో మటన్, మందు బాటిల్‌ను పంపిణీ చేయడం కలకలం రేపింది. ఆ విషయం తెలిసి ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన మరో పార్టీ.. తామేమైనా తక్కువా అంటూ.. వారికి పోటీగా కిలో చికెన్‌ను ఓటర్లకు పంచింది. మరో గ్రామంలో పండగ ఖర్చుల కోసమంటూ కుటుంబానికి 500 ఇచ్చారు. ఎన్నికల పుణ్యమా అంటూ పైసా ఖర్చు లేకుండా ఉగాది పండగ ఖర్చులన్నీ వెళ్లిపోయాయి అక్కడి వారికి. ఇదంతా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జరిగిన ఎన్నికల ప్రచార పదనిసలు.
పోలింగ్‌కు మరో నాలుగు రోజులుండగానే పలు మండలాల్లో రెండు ప్రధాన పార్టీలు జోరుగా మద్యం, మాంసం పంచుతున్నాయి. మాడుగులపల్లి మండలం గజలాపురం, కొణతాలపల్లి, కన్నెకల్, గారుకుంటపాలెం తదితర గ్రామాల్లో మంగళవారం ఉగాది సందర్భంగా ఓ ప్రధాన పార్టీ కిలో మటన్, మద్యం సీసాను ఇంటింటికీ పంపిణీ చేసింది. ఇది తెలిసి మరో రాజకీయ పార్టీ నాయకులు కిలో చికెన్‌ను పంపిణీ చేశారు. నిడమనూరు మండలంలోని రెండు గ్రామాల్లో ఒక ప్రధాన పార్టీ పండగ ఖర్చులకు కుటుంబానికి రూ.500 ఇచ్చింది. ఉప ఎన్నికల పేరుతో నెల రోజులుగా తాగేవాళ్లకు తాగినంత. తినేవారికి తిన్నంత. ఈ ఏడాది పైసా ఖర్చు లేకుండా ఉగాది పండగ. అందుకే అంటారు కాబోలు ఓట్ల పండగని.